చిన్ని నా బొజ్జకు... అనుకుంటే ఎలా ? | A story by Chaganti Koteswara Rao | Sakshi
Sakshi News home page

చిన్ని నా బొజ్జకు... అనుకుంటే ఎలా ?

Published Sun, Sep 30 2018 1:16 AM | Last Updated on Sun, Sep 30 2018 1:16 AM

A story by Chaganti Koteswara Rao - Sakshi

కుల, జాతి, మత, రాష్ట్ర భేదాలు లేకుండా ఎవరోఒకరి జీవితాన్ని రక్షించడానికి లేదా వృద్ధిలోకి తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తాను–అన్నది అబ్దుల్‌ కలాం విద్యార్థులచేత చేయించిన నాలుగో ప్రతిజ్ఞ. నిజానికి ఈ మాటలు ఎక్కడివంటే...అబ్దుల్‌కలాంగారిని చాలా ప్రభావితం చేసిన వ్యక్తులు ఇద్దరు. ఒకరు మహాత్మా గాంధీ. మరొకరు నెల్సన్‌ మండేలా. వీరిద్దరూ అంటే ఆయనకు చాలా గౌరవం. బారిష్టర్‌ చదువుకోవడానికి విదేశాలకు వెడుతున్నప్పుడు గాంధీగారి తల్లి ఆయనకు చెప్పిన మాటలు ఇవి. ఆమె ఏమన్నారంటే...‘ ‘మనిషిగా పుట్టినందుకు ఒకరికి ఉపకారం చేయాలి. దానికి ముందు – నా కులం వాడా, నా మతం వాడా, నా జాతి వాడేనా, నా భాష వాడేనా వంటివి చూడొద్దు.

ఈ తేడా చూపకుండా ఎవరో ఒక్కరి నైనా సరే, వాళ్ళ జీవితాన్ని రక్షించడానికి లేదా వద్ధిలోకి తీసుకురావడానికి నీవు కారణం కావాలి. మనిషికీ , మిగిలిన జీవులకూ తేడా అక్కడే ఉంది’’ అని. ఆకలితో ఉన్న పులికి నిండు గర్భంతో ఉన్న జింక కనబడినా దానిని ఆహారంగానే చూస్తుంది తప్ప ఇతరత్రా ఆలోచించదు. పెద్ద చేప చిన్న చేపలను మింగేస్తుంది. అది వాటి స్వభావం. కానీ మనిషి మాత్రం –‘‘నేనొక్కడినీ బతకడం గొప్పకాదు, నా చుట్టూ ఉన్న ప్రాణులనూ కాపాడవలసిన బాధ్యత నాది’’ అనుకుంటాడు. మండుటెండలోనుంచి వెళ్ళి మనిషి ఒక చెట్టు నీడన సేదతీరతాడు. ‘‘నేను దీని నీడను అనుభవిస్తున్నాను’’ అనుకుని కాసిన్ని నీళ్ళు దానికి పోస్తాడు. ఆ చెట్టే కాదు, ఏ చెట్టయినా దానికి కొద్దిగా నీళ్ళు పోసే ప్రయత్నం చేయగలగాలి. ఏదో ఒక ప్రాణికి ఇంత ఆహారం పెట్టగలగాలి.

తమిళనాడులో ఒక వ్యక్తిని చూసా. ఆయనకు మామిడితోట ఉంది. చాలా చెట్లున్నాయి. అన్ని చెట్లనుంచి కాయలు కోసుకుంటాడాయన. కానీ ఒక్క చెట్టును మాత్రం  కోయకుండా అలా వదిలేస్తాడు. ఎందుకలా అని అడిగితే – మామిడిచెట్టంటూ ఉంటే పళ్ళు తినడానికి రామచిలుకలు వస్తాయి. నా తోటలోని కాయలన్నీ నేనే తినేయడం ఎందుకండీ. ఒక చెట్టును వాటికి వదిలేస్తా. రేపు పొద్దున వచ్చి చూడండి. చెట్టుమీద కాయలను మీరు లెక్కపెట్టగలరేమో కానీ ఆనందంతో రెక్కలు విప్పుకుని వచ్చే చిలుకలను లెక్కపెట్టలేరు.

ఆ అందం చూసి అనుభవించే తృప్తి ఎంత ఖర్చుపెట్టినా దొరకదు. ఇన్ని చెట్లకాయలను నేనొక్కడినీ తినలేకపోతే అమ్ముకుంటాను...కానీ  ఆ చిలకలు మాత్రం వాటికి ఎంత అవసరమో అంతే తింటాయి. తప్ప తుంచుకెళ్ళవు, కింద పడేయవు. మళ్ళీ రేపొచ్చి తింటాయి.’’ అని చాలా తన్మయత్వంతో చెప్పాడు. అంతేకాదు నూకలు(విరిగిన బియ్యం) తెప్పించి రోజూ కొద్దిగా పొలంలోని మూలల్లో చీమల పుట్టల దగ్గర రోజూ చల్లుతుంటాడు. ‘‘చిన్ని నాబొజ్జకు... అని మాత్రమే అనుకోను. నాతోపాటూ నాలుగు ప్రాణులు తినాలి కదండీ’’ అంటాడు.

‘‘అన్ని ప్రాణులకూ ఆకలి ఒక్కటే. నేను తినకుండా వాటికి పడేయడం లేదు కదా, అటువంటప్పడు కాసిని వాటికి కూడా పెట్టడానికి అభ్యంతరం ఎందుకుండాలి’’అని కూడా అంటాడు. అంటే మనిషి మిగిలిన ప్రాణుల్లా బతకకూడదు. అవి భూతదయతో ఉండే అవకాశం లేదు. కానీ మనిషి తానొక్కడూ బతకడం కాదు,‘‘మరొక ప్రాణి బతకడానికి, మరొకరు వృద్ధిలోకి రావడానికి నేను ప్రయత్నిస్తున్నానా..??’’ అని తనను తాను నిత్యం ప్రశ్నించుకుంటూ ఉండాలి.’’


- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement