విద్యార్థినీ విద్యార్థుల భవిష్యత్‌ను, వారి వ్యక్తిత్వ వికసనాన్ని దృష్టిలోపెట్టుకుని, వేనాడు(కేరళ)లోని జవహర్ నవోదయ పాఠశాలలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వారిచేత ఒక ప్రతిజ్ఞ చేయించారు. అది ఒక్క సందర్భంలోనే చేయించారు. అది తన జీవితంలో మరచిపోలేని రోజని ఆయన తన పుస్తకంలో రాసుకున్నారు. ఆ ప్రతిజ్ఞలోని పదిసూత్రాలు ఇవి....
1 నేను ఒక పెద్ద లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని దాని సాధనకోసం కష్టపడతాను. చిన్న లక్ష్యం పెట్టుకోవడం నేరమని గుర్తించాను.
2 చిత్తశుద్ధితో పనిచేసి సమగ్ర విజయం సాధిస్తాను.
3 నేను నా కుటుంబంలో, నా సమకాలీన సమాజంలో, దేశంలో, ప్రపంచంలో ఒక మంచి సభ్యుడిగా ఉంటాను.
4 కుల, జాతి, భాష, మత, రాష్ట్ర భేదాలు లేకుండా ఎవరో ఒకరి జీవితాన్ని రక్షించడానికి లేదా వృద్ధిలోకి తీసుకు రావడానికి నేను ప్రయత్నిస్తాను.
5 ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా ‘‘నేనేం ఇవ్వగలను’’ అని ఆలోచిస్తాను.
6 సమయ ప్రాముఖ్యతను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. జవసత్వాలతో ఉన్న నా కాలాన్ని వృథా కానివ్వను. దీనినే నేను ఆదర్శంగా భావిస్తాను.
7 స్వచ్ఛమైన భూగ్రహ వాతావరణం కోసం, స్వచ్ఛమైన ఇంధన శక్తికోసం సర్వదా ప్రయత్నిస్తాను.
8 ఈ దేశ యువ ప్రతినిధిగా నా లక్ష్యాలన్నింటినీ విజయవంతంగా సాధించడానికి సాహసంతో పనిచేస్తాను. ఇతరుల విజయాలను కూడా అదే స్ఫూర్తితో ఆస్వాదిస్తాను.
9 నేను నా విశ్వాసమంత యువకుడిని/యువతిని. సందేహమంత వృద్ధుడను/వృద్ధురాలను. అందువల్ల నా హృదయంలో విశ్వాసమనే దీపాన్ని వెలిగిస్తాను.
10 నా దేశ పతాకం నా హృదయంలో ఎప్పుడూ రెపరెపలాడుతూనే ఉంటుంది. నా దేశానికి కీర్తి, వైభవం తీసుకు వస్తాను.
ఆ రోజున తనలోంచి వచ్చిన భావావేశాన్ని పదిసూత్రాలుగా మలచి కలాం అక్కడ విద్యార్థులతో చేయించిన ఈ ప్రతిజ్ఞను కాకినాడలో విద్యార్థులకోసం ఏర్పాటు చేసిన ఒకశిబిరంలో వారితో అదే స్ఫూర్తితో, నిబద్ధతతో చేయించాం.
ఈ ప్రతిజ్ఞా పాఠాన్ని ప్రతి విద్యార్థీ ప్రతిరోజూ ఒకసారి ఇంట్లో కుడిచేయి ముందుకు చాపి నిజాయితీగా ప్రతిజ్ఞలాగా చదువుకోవాలి. విద్యాలయాలు కూడా ఇలా పిల్లల చేత ప్రతిజ్ఞ చేయిస్తే ... విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, తోబుట్టువులు, స్నేహితులు, వారి ఊరు, ఈ దేశం అన్నీ గర్వపడే పౌరులుగా తయారవుతారు. దీని కారణంగా అబ్దుల్ కలాంగారి ఆశీస్సులు వారందరికీ పరిపూర్ణంగా లభిస్తాయి.
నేను కూడా ‘‘మహాత్మా! విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి మీరు కన్న కలలు సాకారం కావాలనీ, అలాగే మీరు చెప్పిన విషయాలు వారి మనసులలో బాగా నాటుకుని వారు ఉత్తమ పౌరులుగా తయారు కావడానికి అవసరమైన శ్రద్ధాసక్తులను వారికి కటాక్షించవలసింది’’ అని కోరుతూ శారదామాతకు శిరస్సువంచి నమస్కారం చేస్తున్నా.
- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment