జీవితంలో కొన్ని పనులు మనం ఒక్కరమే చేయగలం. కానీ చాలా పనులు పదిమంది సహాయం లేకుండా చేయలేం. అందుకే అందరితో కలిసిమెలిసి చేయడం, చేయి చేయి పట్టుకుని నడవడం, నడిపించడం చేతకావాలి. నేనే గొప్ప, నేనెవరితోకలవను–అన్నవాడు వృద్ధిలోకి రాలేడు. అబ్దుల్ కలాం ఈ మాటలు ఒఠ్ఠిగా చెప్పలేదు. తాను స్వయంగా ఆచరించి చూపాడు కాబట్టే ఆయన మాటలంటే మనకంత గురి, మనకంత గౌరవం. విధి నిర్వహణలో ఏదయినా లోపం జరిగితే దానికి ఆయన ఒక్కడే బాధ్యత తీసుకునేవాడు. అదే ఉప్రగహం కక్ష్యలోకి వెళ్ళడం వంటి విజయాలు చవిచూసినప్పుడు ఆ గొప్పతనం తనొక్కడిదే కాదనీ, శాస్త్రవేత్తలందరిదీ అనడమేకాక, పై అధికారులకు, చివరకు ప్రధానమంత్రికి కూడా ఫలానా వారికృషివల్ల ఇది సాధించగలిగామని చెబుతూ వారిని స్వయంగా వెంటపెట్టుకెళ్ళి చూపేవాడు.
ఒకరోజు కలాం తన దగ్గర పనిచేస్తున్న ఒక వ్యక్తిని ‘నువ్వు ఇవ్వాళ రాత్రి 11 గంటల వరకు ఉండి ఈ కార్యాన్ని పూర్తి చేయాలి’ అని పురమాయించారు. ఆ ఉద్యోగి కొంచెం ఇబ్బందిగానే తనకు అప్పగించిన పనిని అంగీకరించి చేసేందుకు వెళ్ళాడు. కలాం వెంటనే అతని సన్నిహిత ఉద్యోగిని మరొకరిని పిలిచి ‘రోజూ బాగా శ్రద్ధగా చేసేవాడు, ఇవ్వాళేమయింది’ అని వాకబు చేసాడు. ‘ఆయన తన భార్యాబిడ్డలను ఇవ్వాళ సాయంత్రం ఏదో ఎగ్జిబిషన్‌కు తీసుకెడతానని చెప్పాడు. పని చేయాల్సి వచ్చినందుకు కాదు, వాళ్ళను నిరాశపరచాల్సి వస్తున్నందుకు బాధపడి ఉంటాడు’’ అని అతను చెప్పి వెళ్ళిపోయాడు.
రాత్రి 11 గంటలకు తనకు అప్పగించిన పనిముగించుకుని సదరు ఉద్యోగి భార్యాబిడ్డలకు సంజాయిషీ ఎలా చెప్పాలని మథనపడుతూనే ఇంటికి చేరుకుని తలుపు తీసి ఆశ్చర్యపోయాడు. నిరాశలో ఉంటారనుకున్నవాళ్ళంతా ఆనందంతో తుళ్ళుతూ కనిపించారు. అయోమయం నుంచి తేరుకోకముందే పిల్లలొచ్చి ‘‘నాన్నా, నాన్నా అబ్దుల్ కలాం తాతగారు మనింటికి వచ్చారు. మీనాన్న అత్యవసరమయిన పనిమీద కార్యాలయంలో ఉండిపోవాల్సి వచ్చింది. మిమ్మల్ని ఎగ్జిబిషన్‌కు తీసుకెళ్తానన్నారటకదా, పదండి, నేను తీసుకెళ్తా అని తన కారెక్కించుకుని మమ్మల్ని తీసుకెళ్ళి అంతా తిప్పి చూపించి మళ్ళీ ఇంటిదగ్గర దింపి వెళ్ళిపోయారు’’ అని చెప్పారు. ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి.
తన చుట్టూ ఉన్నవాళ్ళ పట్ల కలాం అంత ప్రేమభావంతో ఉండేవారు. ఇటువంటి వారిని చూసి మీరు స్ఫూర్తి పొందాలి. కలాం కలలు కన్న విద్యార్థులగా మీరు తయారు కావాలి. చదరంగం ఆడాలి. మీ ఒక్కరి ప్రజ్ఞాపాటవాలు చాలు. ఫుట్‌బాల్ ఆడాలి. మీ టీమ్ అంతా కలిసి ఆడితేనే మీరు గెలుస్తారు. ఒక గోడ కట్టాలి. ఇటుకలు మాత్రం ఉంటే సరిపోదు, సిమెంట్ ఒక్కటి ఉంటే చాలదు. వాటితోపాటూ ఇసుక, నీరు ఉండాలి, అవన్నీ సమపాళ్ళలో కలిసినప్పుడే గట్టిగోడ నిలుస్తుంది.
అందుకే మనకన్నా కిందివారిని, మనతోటివారిని, మనకంటే పైవారిని అందరినీ కలుపుకుని, సఖ్యతతో సమన్వయంతో, విశాల హృదయంతో ముందుకడుగేయాలి. మనందరం చేయిచేయి పట్టుకుని ‘‘మేమందరం భారతమాత బిడ్డలం, భారతీయులం, అందరం కలిసి నవభారతాన్ని నిర్మించుకుంటాం’’ అన్న దృఢ దీక్షతో అటువంటి సమగ్రతతో పనిచేసిన నాడు కలాంగారు ఏ లోకంలో ఉన్నా ఆయన పరిపూర్ణ ఆశీస్సులు మీకందరికీ అందుతాయి.
- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment