భవిష్యత్తంతా విద్యార్థులదే. దేశ కీర్తి ప్రతిష్ఠలు, అభివృద్ధి మీ చేతిలో ఉన్నాయని గట్టిగా నమ్మిన అబ్దుల్ కలాం మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడానికి పలు సూచనలుచేసారు. ఎవరికి వారు తాము చదువుకున్న చదువుతో డబ్బు సంపాదించుకుంటూ, అదే ధ్యేయంగా బతికితే దేశం ఎలా, ఎప్పటికి బాగుపడుతుందనేది ఆయన ఆవేదన. చదువుకోవడం గొప్పకాదు. మీరో గొప్ప ఇంజనీరో, డాక్టరో అవుతారు. మీ చదువుద్వారా ఎంతమందికి మీరు ఉపయోగపడుతున్నారనే దాన్ని బట్టి మీ చదువుయొక్క సార్ధక్యం ఆధారపడి ఉంటుంది. మీరు డాక్టరై ఎంతమందికి ప్రాణభిక్షపెడుతున్నారు, స్వార్థంలేకుండా ఎంతమందికి చికిత్స చేయగలుగుతున్నారు. సమాజ హితానికి ఎంత ప్రయత్నిస్తున్నారన్న స్పృహతో మీరు గొప్పవారవుతారు తప్ప అన్యథా కాదు. నేను ఇంజనీరయినాను కాబట్టి ఎంతమంది ఏమయిపోయినా ఫరవాలేదు, ఏ ఆనకట్ట ఎలా బద్దలయిపోయినా ఫరవాలేదు, నా డబ్బు నాకొస్తుందికదా.. అన్న ఆలోచన మంచిది కాదు.
మీ చదువుతో మీరు, మీ కుటుంబం, మీ బంధుమిత్ర పరివారం, మీ సమాజం, మీ దేశం అందరూ బాగుండాలి, అన్నీ బాగుపడాలి. అప్పుడు మీ చదువుకు సార్థకత. అలా జరగాలంటే...పదిమందితో కలిసి మీ ప్రజ్ఞాపాటవాలు పంచుకోవాలి. అలా పంచుకోవాలంటే మున్ముందుగా మీకు ఉండవలసిన ఒకానొక ప్రధాన లక్షణం– అందరిలో మంచిని చూడగలగడం. ప్రతివారిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. ఏ గొప్పతనం లేకుండా ఎవరూ ఉండరు. మీ చుట్టూ ఎవరున్నా, ప్రతివారిలో ఉన్న ప్రతిభను వెతకగలగడం మీకు చేతకావాలి. మీ వద్ద ఎవరిపేరయినా ప్రస్తావనకు వచ్చీరాగానే వారిలోని ఉత్తమగుణాలు మీకు వెంటనే స్ఫురణకు రావాలి.
అలా కాకుండా ప్రతివాడిలోనూ చెడు మాత్రం చూసే అలవాటున్నప్పుడు వారిని తృణీకరించడం, చులకనచేసి మాట్లాడడం అలవాటవుతుంది. దానివల్ల అవతలివాళ్ళకు ఎటువంటి నష్టం వాటిల్లుతుందో నాకు తెలియదు కానీ, ఎవరిలోకూడా మంచి చూడడం అలవాటు చేసుకోక, మంచిని అనుకరించడం తెలియక, మంచిమార్గంలో వెళ్ళడం చేతకాక... చివరకు మనమే పతనమయిపోతాం. అలా కాకుండా ఉండాలంటే... ఎక్కడికెడితే అక్కడ ఇమిడి పోవడం చిన్నప్పటినుంచీ ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలి. తల్లిదండ్రులు కూడా అలా పిల్లల్ని ప్రోత్సహించాలి. నీటిలో ఇసుక వేస్తే కరగదు. అదే చక్కెరవేస్తే కరిగిపోతుంది, కలిసిపోతుంది. అది మీకు చేతకావాలి. అలా నలుగురిలో కలిసిపోవాలి, కరిగిపోవాలి.
మీరు బడికి వెళ్ళారు. అక్కడ తోటి పిల్లలతో హాయిగా కలిసిపోవాలి. కాలేజికి వెళ్ళారు. సహ విద్యార్థులతో, కింది తరగతుల వాళ్ళతో, పైతరగతుల వాళ్ళతో కలిసిపోవాలి. ఉద్యోగానికి వెళ్ళారు. అక్కడ చిన్నా పెద్దా ఉద్యోగులందరితో కలిసిపోవాలి. కుటుంబంలో, బంధువులతో, దేశపౌరులతో.. అలా కలిసిపోతుండాలి. ‘‘నేను ఇంత గొప్పవాడిని’’ అని గిరిగీసుకుని మిగిలిన వాళ్ళకన్నా దూరంగా బతకడం, మిగిలినవాళ్ళు నాకన్నా తక్కువ వాళ్ళు అని భావించడం మనకు మేలు చేయకపోగా మనల్ని మరింత కిందకు దిగజారుస్తుంది. అలా కాకుండా ఉండాలంటే మీరు మూడు విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. మనతో సమానులను ఆదరబుద్ధితో చూడాలి. మన కంటే కిందివారిని మనమే చొరవతీసుకుని వారికి దగ్గరయ్యేందుకు ప్రయత్నించాలి, వారిని ప్రేమించాలి. మనకన్నా పైవారిపట్ల గౌరవ మర్యాదలతో మసులుకోవాలి.
- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment