‘సంధ్యారంభవిజృంభితమ్’ .. అని శంకరాచార్యులవారు అంటారు శివానందలహరిలో. సంధ్యా కాలం లో శివుడు నాట్యం చేస్తాడు–అంటాడు. సంధ్య.. అంటే? చీకటి వెళ్ళిపోయి సూర్యుడు వస్తున్నాడు..ఆ మధ్య కాలంలో ఆకాశం ఎర్రబడుతుంది. అది ప్రాతః సంధ్య. మధ్యాహ్నం నడినెత్తి మీదికి వస్తాడు.. అది మాధ్యాహ్నిక సంధ్య. సాయంకాలం.. చీకటి వస్తుంటుంది. పగలు వెళ్ళిపోతుంటుంది. అప్పుడు మళ్ళీ ఆకాశం ఎర్రబడుతుంది... అది సాయం సంధ్య. ఒక అవస్థలోంచి మరొకదానిలోకి మారుతున్న మధ్య కాలానికి సంధ్య అనిపేరు. దోషమ్ అంటే చీకటి. ప్రదోషమ్.. చీకటికి ముందు వెలుతురు అస్తమిస్తున్న కాలం. ఈ రెంటికీ మధ్య ఉంది కాబట్టి ప్రదోషమ్–సంధ్యాకాలం. సంధ్యాకాలంలో నిశ్శబ్దం ఉంటుంది. సంధ్య మారుతుంటే కాలం నడుస్తుంటుంది. శుక్లపక్షం, కృష్ణపక్షం, మాసాలు, రుతువులు.. నడుస్తాయి. అవి నడిస్తే సుఖం, దుఃఖం అనుభవంలోకి వస్తుంటాయి. సంధ్యలలో కాలం మారిపోతుండాలి. ఈ నడకకి సంధ్య ప్రధానం. సంధ్యాకాలం ఉంటే తప్ప విజృంభణం అన్నది ఉండదు.
అంటే అసలు శివుడు ఎక్కడ ఉంటాడు? ఊపిరికీ, ఊపిరికీ మధ్యలో... నేను ఊపిరి లోపలికి తీసుకుంటున్నప్పుడూ ఆ తరువాత నేను చెప్పదలుచుకున్న విషయాన్ని మనసు లో ఆలోచించి లోపలికి తీసుకున్న ఊపిరిని మళ్ళీ వాక్యంగా మార్చి ఆవిష్కారం చేస్తుంటాను. ఆ మధ్యలో ఆయన లోపల విజంభిస్తుంటాడు. మాటలు మాట్లాడేటప్పుడయితే...‘సంధ్యారంభ విజృంభితమ్’ అంటాం. మరి సంగీతంలో అయితే...!!! శృతి, స్వరం శబ్దంగా పైకొచ్చి వెనక్కి వెడతాయి. రెండుగా ఉన్నవి ఒకటిగా మారిపోతాయి, లోపల అణిగి పోతాయి. ఇక్కడినుంచే ‘ఝుమ్’ అన్న నాదం వస్తుంటుంది. రెండు చెవులు గట్టిగా మూసుకుంటే వినబడుతుంటుంది. మనలోంచే వస్తుంటుంది.
నాదోపాసన చేసే విద్వాంసుడు పాట పాడుతూ పాడుతూ వెనక్కి వెళ్లిపోయి శృతినీ, స్వరాన్ని కలిపి నాదంలోకి తీసుకెడతాడు. ఆ నాదాన్ని వింటాడు. అప్పుడు ఒక లిప్తకాలం ఆగిపోతాడు. ఆగి నాదోపాసన చేస్తాడు. అలా నాదాన్ని ఉపాసన చేయడమే శివోపాసన. అదే ఈశ్వరోపాసన. అందుకే కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్రసరస్వతి మహాస్వామి వారు.. ప్రదోష కాలంలో చంద్ర మౌళీశ్వరునికి అభిషేకం చేసి చిట్టచివర చిన్న వీణ చెవి దగ్గర పెట్టుకుని తీగలు మీటుతూ నాదోపాసన చేస్తుండేవారు. నాదోపాసనం సంగీత విద్య. దానితో భగవంతుడిని చేరుకుంటారు. అంతగొప్ప స్థితి భారతీయ సంగీతానికి ఉన్నది. అందుకే అది సంస్కృతిగా వికసనాన్ని ఇస్తుంది.
ఎక్కడ సంగీతాన్ని పరమ సంతోషంతో ఆలపించే అలవాటు ఉంటుందో అక్కడ రెండు లక్షణాలు పొటమరిస్తుంటాయి. ఒకటి–భక్తితో అద్భుతమైన దర్శనం కలిగి భావాలుగా ప్రకటితమవుతుంటాయి. అంటే వాగ్గేయకార స్థితి ఏర్పడుతుంది. రెండు–తాను ఆ పాట పాడుతున్నప్పుడు దానితో రమించిపోయి–వెనక్కి వెళ్ళి నాదంతో ఒకటయిపోయి నిలబడిపోతాడు. అందుకే ఆ భావుకత ఏర్పడినప్పుడు ఆయన ఎంత స్థాయికి వెడతారంటే– బ్రహ్మ సృష్టిని తాను అనుకున్నట్లు ఎలా చేస్తాడో, కవి కూడా అలాగే తాను అనుకున్నట్లు కావ్య నిర్మాణం చేస్తాడు. భావుకు డయిన సంగీత కర్త, ఉపాసకుడు, విద్వాంసుడు అలా ఉపాసన చేస్తూ గానం చేసేటప్పుడు పరదేవత ఆనందానికి కారణమవుతాడు. అందుకే లలితా సహస్రనామ స్తోత్రం లో అమ్మవారిని ‘కావ్యాలాప వినోదినీ’ అని స్తుతిస్తాం. అందుకే మనకు కావ్యాలను శ్లోకాలుగా చదువుకోమని ఇవ్వలేదు.. తన్మయత్వంతో ఆలపించమని ఇచ్చారు.
-బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
చదవండి:
అర్జునుడు అంగారపర్ణునితో ఏమన్నాడు?
ప్రకృతి స్వరాలు... వికృతి స్వరాలు
Comments
Please login to add a commentAdd a comment