నృత్యం చేసేవారు ఒక ధ్యానముద్రలో ఉంటారు. ధ్యానంలో కదిలిపోతే ఏకాగ్రత పోతుంది. సన్నివేశాలనుబట్టి వారు ఆయా పాత్రలలో ఒదిగిపోతారు. అలా కాకపోతే సభ రంజకత్వాన్ని పొందదు. కారణ జన్మురాలు, నటరాజు అనుగ్రహం పొందిన వ్యక్తి శోభానాయుడుగారు. పద్మావతీ కళ్యాణం–నృత్య రూపకంలో శ్రీమహావిష్ణువుతో పాచికలాడే సన్నివేశం. ఇలా పాచికలు వేసినట్లు, పందెం పడినట్లు, వేంకటేశ్వరుడు గెలిచినట్లు, ఈవిడకు కోపం వచ్చి అలిగినట్లు, బుంగమూతి తిప్పినట్లు, మెటికలు విరిచినట్లు, గెలిచావులే పెద్ద..అని అలిగి పాచికలను తోసేసినట్లు...అప్పుడావిడ ముమ్మూర్తులా పద్మావతే...ఎక్కడా శోభానాయుడు గారు కనబడరు.
అలా పాత్రలోకి ఒదిగిపోతారు. బ్రహ్మజ్ఞాని సాయిబాబాలాగా నర్తిస్తారావిడ. చిన్నపిల్లలతో గోళీలాడే సన్నివేశాన్ని నృత్య భంగిమల్లో ఆమె చూపుతుంటే...ఒక బ్రహ్మజ్ఞానిని చూస్తున్న అనుభూతి పొందుతాం. బాలరాముడి దగ్గర్నుంచీ రామాయణాన్ని ప్రదర్శిస్తారు. అది ఆవిడకు నటరాజు అనుగ్రహం కాకపోతే మరేమిటి...మనకు ఒక కృష్ణుడు కనపడతాడు, ఒక పద్మావతి కనబడుతుంది, ఒక సాయిబాబా...అలా ఏ పాత్ర వేస్తే ఆ పాత్రలే మన ముందు నిలబడతాయి.
నృత్యానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే... వాద్యం, ఆట, ఆంగికం, లాస్యం..ఇవన్నీ కలిసి మన మనసుల్ని మన ప్రమేయం లేకుండానే లాక్కుంటాయి, భగవత్ తత్త్వాన్ని ఆవిష్కరిస్తాయి. నటరాజ రామకృష్ణ గారి పేరిణి శివతాండవమే చూడండి. ఓరుగల్లులోని రామప్ప గుడికి చెందిన పేరిణి శివతాండవం ప్రక్రియ మీద విశేషమైన పరిశోధన చేసి మరుగున పడిన ఆ కళారూపాన్ని మనకు సజీవంగా అందించారు.
ఒకప్పుడు కాకతీయులు యుద్ధానికి వెళ్ళే సందర్భంలో వారిలో స్ఫూర్తి నింపడానికి... మృదంగాలు మోగిస్తూ ఆ తాండవం చేస్తుంటే... మంచాన ఉన్నవాడు కూడా లేచి కత్తిపట్టుకుని యుద్ధానికి బయల్దేరేటంత ఆవేశాన్ని, ఉద్రేకాన్ని నింపేదట. దానికి ఆయన జీవం పోసారు. ఒక మహాశివరాత్రినాడు ఆయన ప్రదర్శనను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పదివేలమంది వస్తారనుకుని దానికి తగ్గట్లుగా ఏర్పాటు చేసారు. చివరకు ఇసకేస్తే రాలనంతగా జనం వచ్చి చుట్టూ రోడ్లన్నీ నిండి రాకపోకలు స్తంభించి పోతే.... విధిలేని పరిస్థితుల్లో నిర్వాహకుల కోరిక మేరకు ఆయన దానిని ఆపకుండా తెల్లవారే దాకా కొనసాగించాల్సి వచ్చింది.
నాలుగు చీరలు కట్టి, అవతలివైపు టేబుల్ ఫ్యాన్లు పెట్టి..అవి గాలికి ఊగుతుంటే..వెనుక సముద్ర ఘోష శబ్దాన్ని వినిపిస్తూ ‘ఆంధ్రజాలరి’ నృత్యరూపకం ప్రదర్శిస్తుంటే...ప్రేక్షకులకు సంపత్ కుమార్ కళాకారుల బృందం ఎక్కడా కనిపించదు. నడిసముద్రంలో చేపల వేటకు వెళ్ళిన ఒక జాలరి తన జీవికకోసం పడుతున్న పాట్లను చూస్తూ గుండెలు బరువెక్కుతాయి. చిదంబర క్షేత్రం లో పరమ శివుడు, కాళికాదేవి పోటీపడి నృత్యం చేస్తుంటారు. అయ్యవారు ఎన్ని విన్యాసాలు చేసినా అమ్మ అవలీలగా చేసి పైచేయిగా ఉండడంతో శివుడు... నృత్యం చేస్తూ చేస్తూ వచ్చి అక్కడ ఉన్న కుంకుమ భరిణలో కాలి బొటనవేలు ముంచి దానితో అమ్మవారి నుదుటున బొట్టు పెడతాడు.
అమ్మ సిగ్గుతో ఆ పని చేయలేక నిలబడిపోతుంది.. అలా చిదంబరంలో నటరాజ పదవి శివుడికి దక్కిందని చూపే సన్నివేశం చూపరులను గగుర్పొడుస్తుంది. కారణం వారు కళ్ళప్పగించి చూసింది ఆదిదంపతుల నాట్యాన్నే కానీ, కళాకారుల ప్రదర్శనను కాదు. అదీ భారతీయ కళల వైభవం. వీరంతా జాతి రత్నాలు, ప్రాతఃస్మరణీయులు. మన యువతరం వాళ్ళగురించి తెలుసుకోవాలి. వారి మార్గాన్ని అనుసరించాలి. మళ్ళీ ఆ వారసత్వం, ఆ సంస్కృతి ఆగిపోకుండా కొనసాగడానికి కావలసిన సాధన, క్రమశిక్షణతో చేయాలి. లేకపోతే కొన్నాళ్ళకు అవి పుస్తకాలకే పరిమితమయిపోతాయి. అటువంటి ప్రదర్శనలను ఇచ్చేవారుండరు.
-బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
చదవండి: అజ్ఞాత బానిస అపూర్వ పరిచర్య
Comments
Please login to add a commentAdd a comment