లలితా సహస్ర నామ స్తోత్రంలో అమ్మవారిని ‘కావ్యాలాప వినోదినీ’ అని స్తుతిస్తారు. కావ్యాలను ఆలాపన చేసేవాళ్ళను చూసి అమ్మ సంతోషిస్తుంది. అందుకే మనకు కావ్యాలను చదవడం కోసం కాకుండా వీణమీద పలికించమని, నోటితో పాడమని ఇచ్చారు. శ్రీరామాయణాన్ని వాల్మీకి మహర్షి లవకుశులకు –వీణమీద పలికిస్తూ, పాడండి–అని ఇవ్వడంతో వారు అయోధ్యకు వెళ్ళి అలాగే పాడారు. అంటే శ్రీరామాయణం నిజానికి పాటగా పాడుకోవలసినది. శ్లోకాలు అంత గొప్పగా రచించారు. అందుకే ఆలాపన చేసే వాళ్ళు ఆ తల్లికి అంత దగ్గరగా కూర్చుంటారు. వాళ్ళు తమ ఉపాసనా శక్తిని, ఆ సంతోషానికి, వాళ్ళు అనుభవిస్తున్న తాదాద్య్మతకి అమ్మవారు దిగొచ్చేస్తుంది కూడా. ఆ విషయం
బాలమురళీగారే చెప్పుకున్నారు కూడా..
బాల మురళీ కృష్ణ గారు ఒక మహానగరంలో సముద్రపు ఒడ్డున కచ్చేరీ చేస్తున్నారు. ఇసకేస్తే రాలనంత జనం ఉన్నారు. ఆయన కళ్యాణి రాగం పాడుతున్నారు. ఆయనకు ఆ రాగమం టే మహాప్రీతి. గంటకుపైగా తనను తాను మర్చిపోయి ఆ రాగాన్ని ఆలపిస్తుండగా... ఇంతలో మహాసౌందర్యవతి ఐన ఒక పిల్ల కొప్పునిండా పూలు పెట్టుకుని జనంలోంచి నడిచి వస్తుంటే అందరూ దారి వదిలారు. ఆ పిల్ల నేరుగా వచ్చి వేదిక మీద బాలమురళీగారి పక్కన కూర్చుంది. ఆయన చూసారు. ఏ కళ్యాణి రాగాన్ని ఉపాసన చేసానో, ఆ రాగమే సాకారమై నడిచి వచ్చి నా పక్కన కూర్చుంది–అని సంతోషంతో అప్పటికప్పుడు ఆశువుగా కళ్యాణి రాగంలో పరమాద్భుతమైన ఒక కీర్తన చేసారు.
‘ఎంత సొగసైన దానివమ్మా! నేను ఈ రాగాన్ని ఆలాపన చేసి చేసి భావుకత్వంతో ఆకసానికి ఎగిరిపోయా. అక్కడ పాడుతున్నా... అంతకుముందు చంద్రుడికి కళలు పెరగడం, తరగడం ఉండేవి కావు. నా ఆలాపనకు అమృతాన్ని శరీరంగా కలిగిన చంద్రుడు కరిగిపోయి, ముద్దయిపోయి, నవనీతం అయిపోయాడు. అప్పటినుంచి చంద్రుడికి కళలు తరగడం, పెరగడం మొదలయ్యాయి... అంతకుముందు నక్షత్రాలు మిణుకు మిణుకుమంటూ ఊగుతుండేవి కావు. నేను అంబరవీథికి గిరి కళ్యాణి రాగాన్ని ఆలాపన చేసినప్పుడు చుక్కలు ఊగడం మొదలయ్యాయి. నేను మళ్ళీ తిరిగి వచ్చి వేదిక మీద కూర్చున్న తరువాత కళ్యాణి ప్రీతి పొంది అంతర్ధానమయింది. కళ్యాణి రాగాన్ని పాడుతున్నప్పుడు ఆ రాగమే పరవశించి అరమోడ్పు కన్నులతో కూర్చుని ఉంటే...బ్రహ్మగారు .. నేను ఇటువంటి మూర్తిని సృజించలేకపోయానని సిగ్గుపడ్డాడు...’’ అంటూ
చక్కటి భావుకతతో ఒక కీర్తనను ఆయన సజించి ఆలపించారు. ఇదీ భారతీయ సంగీతం గొప్పదనం. కొంతమంది మహాపురుషులకు ఆ రాగాలు రాగిణులై దర్శనమిచ్చాయి. భారతీయ సంస్కృతికి పునాది అయిన ఇటువంటి కళలలో ఎంత భగవత్ తత్త్వాన్ని ఉపాసన చేసారో, అసలు ఆ పాట పాడుతూ పాడుతూ ఎక్కడికో వెళ్ళిపోయి ఎంత గొప్ప గొప్ప స్థితులు అనుభవించారో అర్థం చేసుకోవచ్చు.
-బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
చదవండి:
పవిత్రతా స్వరూపిణి సీత
కావ్యాలు చదవకూడదు, పాడుకోవాలి
Comments
Please login to add a commentAdd a comment