ఆతిథ్యం ఎంత శక్తిమంతం అంటే... | Devotional information by Chaganti Koteswara Rao | Sakshi
Sakshi News home page

ఆతిథ్యం ఎంత శక్తిమంతం అంటే...

Mar 25 2018 12:56 AM | Updated on Mar 25 2018 12:56 AM

Devotional information by Chaganti Koteswara Rao - Sakshi

అతిథిరూపంలో ఆ పరమేశ్వరుడికన్నా గొప్పవాళ్ళు రావచ్చు. అందుకే పూజలో కూర్చున్నప్పుడు... శాస్త్రం మినహాయింపు ఇచ్చింది. పూజ చేస్తుంటే లేవకూడదన్నది నియమం. కానీ పూజచేస్తుండగా గురువుగారొచ్చినా, మహాత్ములు వచ్చినా పూజ విడిచిపెట్టి వెళ్ళి వారిని ఆదరించాలి. ఎందుకొచ్చారో కనుక్కుని పంపించి తరువాత పూజచేసుకోవాలి. అంతేతప్ప ‘నేను పూజలో ఉన్నాను కాబట్టి వారిని చూడను’ అని అనకూడదు. అతిథిరూపంలో వచ్చినవాడు మహాత్ముడయితే వారిని సేవించకుండా తనదగ్గర కూర్చోవడాన్ని పరమేశ్వరుడు కూడా సహించడు. గజేంద్రమోక్షం కథామూలం అదే కదా!

ఒకానొకప్పుడు ద్రవిడదేశంలో ఇంద్రద్యుమ్నుడనే రాజు అంతఃపురాన్ని విడిచిపెట్టి ఒక కొండమీదున్న ప్రశాంత ప్రదేశంలో కూర్చుని జపం చేసుకుంటున్నాడు. ఆ సమయంలో మహాత్ముడయిన అగస్త్యుడొచ్చాడు. ఇంద్రద్యుమ్నుడు లేచి నమస్కరించి అర్ఘ్యపాద్యాలిచ్చి ఉంటే తరించిపోయి ఉండేవాడు. కానీ ఆయన వస్తే నాకేంటన్నట్లు ఉండిపోయాడు. ‘నీవు తమోగుణంతో ప్రవర్తిస్తున్నావు కాబట్టి వచ్చే జన్మలో ఏనుగువయి పుడతావు’ అని శపించాడు అగస్త్యుడు.

అయితే ఈ జన్మలో జపతపాదులు చేసావు కాబట్టి నీ ప్రాణంమీదికి వచ్చినప్పుడు పరమేశ్వరుడు గుర్తొచ్చి శరణాగతి చేస్తావని వరమిచ్చాడు. అందుకని ఏనుగుగా పుట్టిన తరువాత మొసలికి చిక్కి ప్రాణం పోతున్న దశలో శరణాగతి చేసి విష్ణువుని పిలిచాడు. అతిథి దేవోభవ అని శాస్త్రం అన్నదంటే అంత మర్యాదతో కూడుకున్న వాక్యం అది. అమర్యాద అంటే–అతిథి పూజ చేయకుండుట–అంటే... ఇంటికొచ్చిన వాళ్ళకు అన్నం పెట్టకుండా ఉండడం అని కాదు. నువ్వు అన్నం పెట్టావా, ఫలహారం పెట్టావా ... అన్న లెక్క ఉండదు. నీ మర్యాద ఎటువంటిదన్నదే ప్రధానమయి ఉంటుంది. కుటిల బుద్ధులయిన వారి ఇండ్లకు పోవద్దంటూ దక్షయజ్ఞం ఘట్టంలో పరమేశ్వరుడు

పార్వతీ దేవితో చెప్పిందదే... ‘‘వారేం నష్టపోతున్నారో వాళ్ళకు తెలియదు పార్వతీ... దుర్మార్గులైన వారేం చేస్తారో తెలుసా...పరమ భాగవతోత్తములు, పూజనీయులు ఇంటికొస్తే ఆదరబుద్ధితో తలుపు తీయరు. ‘రండిలోపలికి’ అని పిలవరు. తలుపుకొద్దిగా తీసి కనుబొమలు ముడేస్తారు, ఎందుకొచ్చారన్నట్లు చూస్తారు, నిన్ను పలకరించరు, నువ్వలా బయటే చాలాసేపు కూర్చుని ఉంటే... వస్తున్నా ఉండండి.. అని ... ఆ తరువాత ఎప్పుడో వచ్చి పలకరిస్తారు. ఆ తరువాత వారు నీకు అన్నం పెట్టినా, పరమాన్నం పెట్టినా... నీ మనసుకు తగిలిన గాయాన్ని తట్టుకోలేవు పార్వతీ! నా మాట విను. ఆదరబుద్ధి లేనివారి ఇంటికి వెళ్ళవద్దు.’’ అని పరమశివుడంతటివాడు చెప్పాడు.

నీకు శక్తి ఉంది. అతిథికి మర్యాదలు ఘనంగా చెయ్యవచ్చు. శక్తిలేదు. అసలు చెయ్యలేకపోవచ్చు. చెయ్యలేకపోతే వచ్చిన నష్టం లేదు. చెయ్యలేకపోతున్నానన్నమాట పరమ మర్యాదతో చెప్పాలి. ‘అయ్యా! నన్ను మన్నించండి. మీవంటి మహాత్ములు వస్తే ఇవ్వాళ నేను ఆతిథ్యం ఇవ్వలేకపోతున్నా. ఫలానా నిస్సహాయ పరిస్థితిలోఉన్నా. క్షమించండి’’ అని ఒక్కమాట చెబితే వారు పరవశించి వెళ్ళిపోతారు. ఆతిథ్యం అనేది అంత శక్తిమంతం.

- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement