భారతీయ సంస్కృతీ వైభవంలో భాగంగా... నాదమే శంకరుడి శరీరం.. అంటూ త్యాగరాజు తన కీర్తన ద్వారా ప్రతిపాదించిన సంగీత తత్త్వాన్ని ప్రస్తావించుకుంటూ ‘మోదకర..’ అంటే అది సంతోషం ఇవ్వగలిగినదని ఆయన చెప్పిన విషయాలను తెలుసుకుంటున్నాం. మోదము అంటే హర్షము. సంతోషం ఇవ్వగలిగినది శాంతి. శాంతి అంటే ...ఎంత అనుభవించినా..రుచి తీరదు. ఎంతో హాయిగా ఉన్నట్లు అనిపించడమే కాదు... అసలు నిజంగా పరమ ప్రశాంతంగా ఉండగలిగిన స్థితికన్నాకూడా సుఖమయమైన స్థితి మరొకటి ఉండదు. ఆ స్థితికి చేరుకుంటే... మనసు కదలకుండా ఉండిపోతుంది. (చదవండి: సంసార జీవితంతో వేగలేను)
నీళ్ళ కొలనులో రాయి వేస్తే... కెరటాలు వస్తాయి.. ధ్యానంలో కూడా అలా కదిలిన మనసును స్థిరం గా నిలబెట్టడానికి షోడశోపచారాలతో మళ్ళీ పరమేశ్వరుడి వద్దకు తీసుకెళ్ళినప్పుడు.. పరమ సంతోషం అక్కడే ఉద్బుదం అవుతుంది. సంçస్కృతి–అంటే తడి కలిగి ఉండడం... ఆర్ద్రత. ఒక విత్తనానికి తడి తగిలితే అంకురం వస్తుంది... అలాగే ఇది. కళకు, సంస్కృతి కి ఉండే గొప్పతనం ఏమిటంటే– అది అవతలివారిలో మంచి అధ్యవసానంతో కూడుకున్న బుద్ధిని నింపుతుంది. శాంతాన్ని నింపుతుంది. ఆ శాంతాన్ని ఇవ్వగలిగిన వేదం–సామవేదం. సామ–ఆమ.. అంటే శాంతి అనే అర్థం. సామగానం చేస్తే వెంటనే శాంతి కలుగుతుంది. సామగానం దీర్ఘంగా ఊపిరిపట్టి చేయాలి. అంత స్వరంతో అలా చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఊపిరి బిగపట్టడం కష్టమవుతుంది. ఫలితంగా స్వరభంగమవుతుంటుంది కూడా.(చదవండి: అర్థం ఉంటేనే అది శబ్దం అవుతుంది)
ఇతర వేదాలను చదివేటప్పుడు స్వరభంగం దోషం. అనుమతించరు. కానీ సామవేదం చదివేటప్పుడు కించిత్ స్వరభంగం జరిగినా... పట్టించుకోకూడదు. అందుకే ‘‘వేదానం సామవేదోస్మి’’ అంటాడు కృష్ణ భగవానుడు. అంటే వేదాలలో నేను సామవేదాన్ని–అని. సామము పాడితే శాంతి కలుగుతుంది. సామదానం జరిగితే ప్రశాంతత దొరుకుతుంది. సంగీతం సామవేదంలోంచి వచ్చింది. సంగీతం తక్షణ ఫలితం ఏమిటి? అవతలివాడు ప్రశాంత పడతాడు. అంటే... అస్థిమితంగా ఉండేవారు శాంతిపొందుతారు. సంగీతం గురించి మాట్లాడుతూ–‘సంగీత మపి సాహిత్యం సరస్వత్యాః స్తన ద్వయమ్ ఏకమాపాత మధురం అన్యదాలోచనామతమ్‘. సంగీతసాహిత్యాలు– సరస్వతీ దేవి రెండు పాలిండ్లు. సంగీతమనే స్తనంలోంచి వచ్చిన పాలు అవతలివాడి ప్రజ్ఞాపాటవాలతో సంబంధం లేకుండా సంతోషాన్నిస్తాయి. అదే సాహిత్యమయితే కొంత శక్తి ఉంటే తప్ప అర్థం చేసుకుని ఆనందాన్ని పొందలేరు.
‘‘శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగానరసం ఫణిః’’. ఎప్పుడూ అస్థిమితంతో, కోపంతో ఊగిపోయే పాము కూడా సామగానం వినపడితే పడగ అలాగే పెట్టి ఆగిపోతుంది. కదలదు. ఎప్పుడూ అస్థిరంగా కదిలిపోతూ, ఏడుస్తూ, అటూ ఇటూ తిరుగుతూ, అల్లరి చేసే పిల్లలు కూడా సామగానం వినపడితే అలా నిలబడిపోయి సంతోషాన్ని పొందుతారు. బుద్దిలేని జీవులు కూడా అటువంటి సంగీతానికి ప్రసన్నత్వాన్ని పొందుతాయి. కారణం– అది సామవేదంలోంచి రావడం. అది శాంతి కారణం. శాంతి కారకం కావడానికి సంగీతం తప్ప–అదివిని మనసులో అశాంతి కలగడానికి సంగీతం సాధన కాదు. అటువంటి ‘‘మోదకర నిగమోత్తమ సామవేదసారం వారమ్ వారమ్’’ అన్నారు త్యాగరాజస్వామి. నిగమాలు అంటే వేదాలు. వాటిలో ఉత్తమమైనది సామవేదం. దాని సారమే పరమశివుడు. అందుకే ఆయన నటరాజుగా నిలబడ్డాడు. అన్ని కళలు ఆయననుండే వచ్చాయి. అలా రాశీభూతమైన సామవేద సారము శివుడే. ఇది భారతీయ సంగీతానికున్న గొప్పతనం. ఇదీ భారతీయ సంస్కృతికి పునాది.
-బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment