
అంబేద్కర్‌గారి గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కరలేదు. దేశంలో పీడితవర్గాలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి నిరంతరం పరిశ్రమించినవాడు. స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగాన్ని అనుష్టించి, అనుసరించి, పరిపాలన చేసుకోగలుగుతున్నాం అంటే దానికి ఆయన ప్రధాన కారకులు. రాజ్యాంగ నిర్మాతలలో ఆయన కూడా ఒకరు. ఆయన చెప్పిన ఒక మంచి మాట – ’నీకోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు, జనం కోసం జీవిస్తే చరిత్రలో నిలుస్తావు’ అని!
సర్వసాధారణంగా ఏ వ్యక్తి అయినా మొట్టమొదట తన గురించే ఆలోచిస్తాడు. ‘నాకోసం నేను బతకాలి. నేను బాగుండాలి, నా భార్యాబిడ్డలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి’ అని ఆశిస్తాడు. కేవలం నాకోసం నేను జీవించాలనుకోవడం తప్పుకాకపోవచ్చు. పరిధి పెరిగి తనకన్నా సమాజం గొప్పదనీ, తన ఇంటికన్నా దేశం గొప్పదనీ ఆలోచించాలి. అందరికోసం జీవించినవారు ధర్మాత్ములు. అటువంటి వారు కొన్ని కోట్లమందికి స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని పొంది ఉంటారు. అటువంటి మహాపురుషులు ఈ దేశంలో ఎందరో ప్రభవించారు.
స్వాతంత్య్ర సమర సమయంలో తమ ప్రాణాలను గడ్డిపోచకింద భావించి జీవితాంతం జైలుజీవితం అనుభవించినవారున్నారు. ఏకాంతవాసం చేసినవారు, ప్రవాస జీవితం గడిపిన వారు, ద్వీపాంతర జీవితం గడిపినవారు, లాఠీదెబ్బలు తిన్నవారు, తుపాకీ గుళ్ళకు ఒరిగిపోయినవారు, అంగవైకల్యం పొందినవారు, కుటుంబాలు పోగొట్టుకున్నవారు, ఆర్థికంగా చితికినవారు, .. ఇటువంటి మహాత్ములు ఎందరో... ఎవరికోసం అదంతా... ఈ దేశంకోసం.. ఈ దేశ ప్రజల కోసం.. ఈ ఉదాత్త భావన ఆనాడు దేశ ప్రజలందరిలో ఎంతగా పొంగిపొర్లుతూ ఉండేదంటే... వినోబా భావే భూదానోద్యమం ప్రచారానికి దేశమంతటా తిరుగుతూ తమ తమ ప్రాంతాలకు వస్తే... చిన్నకమతాల దగ్గరనుండీ వందల, వేల ఎకరాల భూమిని నీళ్ళలా దానం చేసేసారు.. దాదాపు 42 లక్షల ఎకరాల భూమి పంచిపెట్టడానికిగాను ప్రజలు ఆయనకు ఇచ్చారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఒక గ్రామానికి గ్రామం ఆయనకు దానమిచ్చేసారు. సంపద ఉంటే సంపద దానం లేకుంటే దేశంకోసం శ్రమదానం చేసారు.
ఇదీ నలుగురికోసం బతకడం అంటే... అంబేద్కర్ చెప్పినది ఇదే...ఇలాంటి త్యాగబుద్ధి ప్రతి ఒక్కరిలో ఉండాలి. దేశంమంటే నేను, నా కుటుంబం అనే కాదు, దేశమున్నది నాకోసం, నా కుటుంబం కోసం మాత్రమే కాదు...పరిధి దాటాలి, కుటుంబం పరిధి, ఊరు పరిధి... ఈ దేశం మనది అన్న భావన, మన దేశం బాగుపడడం కోసం మనం ఏ చేద్దామనే భావన ప్రతి ఒక్కరిలో రగులుతూ ఉండాలి. ఒకరిన చూసి మరొకరు స్ఫూర్తి పొందాలి... అప్పడు మనం మహాత్మాగాంధీలను, అంబేద్కర్‌లను... రోజూ చూస్తూనే ఉండవచ్చు.
- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment