
ప్రముఖ తత్త్వశాస్త్ర నిపుణుడు, మాజీ రాష్ట్రపతి కీ.శే. సర్వేపల్లి రాధాకృష్ణన్‌గారు చాలా కష్టాల్లోంచి పైకొచ్చారు. తిరుపతిలో ఆయన చదువుకుంటున్న రోజులవి. ఆ రోజు పరీక్ష ఫీజు కట్టడానికి ఆఖరు రోజు. విద్యార్థిగా ఉన్న దశలో ఒకసారి పుస్తకం చదివితే మొత్తం ఆయనకు గుర్తుండిపోయేది. ఆయనకు ఒక అలవాటు ఉండేది. ఏదయినా చూడాలనిపిస్తే ఎన్ని మైళ్లయినా నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడు. అలా ఒకసారి వెళ్ళి తిరిగి వస్తుండగా నిర్మానుష్యంగా ఉన్న దారిలో ఒక పాడుబడ్డ బావి వద్ద ఒక దొంగ పొంచి ఉండి, ఆయనమీద పడి పట్టుకున్నాడు. ఆయన చెవికున్న బంగారు పోగులకోసం పొదల్లోకి లాక్కెళ్ళి కొట్టడంతో ఆయన అర్భకుడు కావడాన స్పృహతప్పి పడిపోయాడు. చెవులకున్న పోగులు లాగేసుకుని దొంగ వెళ్ళిపోయాడు. స్పృహతప్పిన రాధాకృష్ణన్ గారికి కొద్దిసేపటి తరువాత తెలివి వచ్చి ఒళ్ళంతా దెబ్బలతో ఇంటికి చేరుకున్నాడు.
ఫీజు కట్టడానికి అదే ఆఖరి రోజు, అయినా బాగా తెలివిగల పిల్లవాడయిన రాధాకృష్ణన్ ఇంకా రాలేదేమిటని ఆందోళన చెందిన ఆయన ఉపాధ్యాయుడు తానే స్వయంగా దరఖాస్తు నింపి తన సొంత డబ్బుతోనే ఫీజు కట్టేశాడు. పక్కరోజు రాధాకృష్ణన్ వెడితే విషయం తెలుసుకున్న ఉపాధ్యాయుడు తాను ఫీజు కట్టేశానని చెప్పి పరీక్ష రాయించాడు. ఆ పరీక్షలో ఆయన అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. రాధాకృష్ణన్ మైసూర్ విశ్వవిద్యాలయంలో తత్త్వ శాస్త్రానికి ఆచార్యుడిగా ఉండి తరువాత కలకత్తా విశ్వవిద్యాలయానికి ఉన్నత పదవిలో చేరడానికి సిద్ధపడ్డారు. మైసూరునుంచి కలకత్తాకు వెళ్ళే రోజున సామానంతా వేరుగా స్టేషన్‌కు పంపించేసి, భార్యతో గుర్రపుబగ్గీలో పోవడానికి బయటికి వచ్చారు. ఆయన దగ్గర చదువుకున్న, చదువుకుంటున్న విద్యార్థులు వందల సంఖ్యలో ఆ సమయానికి అక్కడికి చేరుకున్నారు.
‘‘మాకింత గొప్పగా పాఠాలు చెప్పి తన ఊపిరిని మాకోసం వెచ్చించిన మా గురువుకు కృతజ్ఞతగా ...’’ అంటూ బండికి కట్టిన గుర్రాలను విడిపించి స్వయంగా విద్యార్థులే ఆ బండిని మైసూరు స్టేషన్ వరకు లాగుకుంటూ తీసుకెళ్ళారు. పూలు పరచి వాటిమీదుగా వారిని తీసుకెళ్ళి రైలెక్కించారు. రాధాకృష్ణ్ణన్ గారు కూడా బరువెక్కిన హృదయంతో చేతులూపుతూ వారినుంచి వీడ్కోలు తీసుకున్నారు. ఉపాధ్యాయ వృత్తికే అత్యంత గౌరవం, గుర్తింపు తెచ్చిన ఆయన జీవితం ఆ వృత్తితో ఎంతగా పెనవేసుకుపోయిందంటే జన్మదినాన్ని ఆత్మీయులు, సన్నిహితుల మధ్య జరుపుకునే సంప్రదాయానికి స్వస్తి చెప్పి దానిని ‘టీచర్స్ డే’ గా జరుపుకోవాలని వాంఛించారు. తననే కాదు అది గురువులందరినీ స్మరించుకోవాలన్న. గౌరవించుకోవాలన్న సందేశాన్ని ఆయన దీని ద్వారా ఇచ్చారు. ఇక అప్పటినుంచీ సెప్టెంబరు 5వ తేదీని ‘ఉపాధ్యాయ దినోత్సవం’ గా జరుపుకుంటున్నాం.
ఇదంతా కలాంగారు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే... అమ్మ తిట్టిందనో, నాన్న కోప్పడ్డాడనో, గురువు గారు మందలించారనో వారిపై అక్కసు పెంచుకోకుండా... ఎందుకు ఆగ్రహిస్తున్నారో దాని వెనుక ‘మిమ్మల్ని సంస్కరించాలన్న’ వారి ఆవేదనను అర్థం చేసుకుని మీకుటుంబ గౌరవం పెంచేలా, మీ స్నేహితులు, మీ చుట్టూ ఉన్న సమాజం గర్వపడేలా మీ వ్యక్తిత్వాన్ని దిద్దుకోండి’’ అని చెప్పడానికి.
- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment