ఆకలితో ఉన్న వాడిపై ఆగ్రహం వద్దు | Useful information by Chaganti Koteswara Rao | Sakshi
Sakshi News home page

ఆకలితో ఉన్న వాడిపై ఆగ్రహం వద్దు

Published Sun, May 6 2018 12:29 AM | Last Updated on Sun, May 6 2018 12:29 AM

Useful information by Chaganti Koteswara Rao - Sakshi

ఆతిథ్య వేళ అంటారు. ఎవరయినా మధ్యాహ్నం వేళలో భోజనానికి వస్తారు. గడపదాటి ఇంటి లోపలకు వచ్చిన అతిథిని ముందుగా ‘‘భోజనం చేసారా!’’ అని అడగాలి. ఆతిథ్య ప్రస్తావన వస్తే కాశీ పట్టణం పేరెత్తకుండా  మాట్లడటం కుదరదు. కాశీ పట్టణానికి ఓ లక్షణం ఉంది. మధ్యాహ్నం 12 గంటలవేళ ఎవరు అన్నం పెట్టినా అది అన్నపూర్ణమ్మ హస్తమే.

అందుకే ఆడవాళ్లు కాశీయాత్ర వెళ్ళినప్పుడు అక్కడ వడ్డన సేవ చేయాలని కోరుకుంటారు. అటువంటి కాశీపట్టణంలో అన్నం దొరకలేదని వ్యాసులవారికి ఎక్కడలేని కోపం వచ్చేసింది. శపించబోయారు. చేతిలోకి నీళ్ళు తీసుకున్నాడు..‘‘ధనము లేకుండెదరుగాక మూడుతరములందు, మూడు తరములు చెడుగాక మోక్షలక్ష్మి, విద్యయును మూడుతరములు లేకుండుగాక, పంచజనులకు కాశిపట్టణమందు.’’ అన్నాడు.   

ఇంతలో ఎదురుగుండా ఇంటిలోంచి గడియ తీసుకుని పట్టుచీర కట్టుకుని వచ్చింది ఓ తల్లి. అప్పటికీ లోపలినుంచి శివుడు....‘‘ధూర్తుడు, కాశీని శపిస్తాడట.. కాల్చేస్తా...!!!’ అంటున్నాడు. శివుడి ఆగ్రహానికి కారణం–‘కాశి’ పరమేశ్వరునికి భార్యలాంటిది. వెంటనే పార్వతీ దేవి అన్నది కదా...‘‘ఆగండాగండి. ఆకలిమీదున్న వాడిని కాల్చకూడదు. తప్పు. అతను అతిథి’’ అంటూ గభాల్న తలుపుతీసుకుని వచ్చింది. కోపంతో నీళ్ళుపట్టుకుని ఊగిపోతున్న వ్యాసుడిని పిలిచింది...‘‘వ్యాసా!  ఇలా రా! భిక్షలేదని కాశీ పట్టణంమీద ఇంత కోపించడమా.

నీ చిత్తశుద్ధి తెలుసుకుందామని పరమశివుడు పరీక్ష పెట్టాడు తప్ప కాశికాపట్టణంలో అన్నం దొరకకపోవడమా? భూమండలంలో ఎక్కడయినా అన్నం దొరకదేమో కానీ కాశీ పట్టణంలో అన్న దొరకకపోవడం అంటూ ఉండదు. ఎందుకంత తొందరపడుతున్నావు? వెళ్ళి స్నానం చేసి సంధ్యవార్చుకుని రా’’–అని వ్యాసుడిని, శిష్యులను పిలిచి కూర్చోబెట్టి మధుర మధురమైన వంటకాలను వడ్డించింది. పాయసం పాత్ర ఎడమచేతిలో పట్టుకుని బంగారు తెడ్డు కుడి చేత్తో పట్టుకుని అన్నపూర్ణమ్మ తల్లి ఎవడొస్తాడా వడ్డిద్దామని ఎదురు చూస్తుంటుంది కాశీలో. ఆడవారి సహకారం లేకుండా పురుషుడు ఎంత ధర్మాత్ముడయినా ఎవరికి అన్నం పెడతాడు? ఆతిథ్యమంటే ఆతిథ్యమే.

వ్యాసుడిని కూర్చోబెట్టి కడుపునిండా అన్నం పెట్టింది. అప్పుడొచ్చాడు పరమశివుడు. ‘‘ఎంత తప్పు చేసావు, కాశీని శపించడమా! వైరాగ్యం కొద్దీ కాశీకి రావాలే గానీ, భోగం కోరేవారు రాకూడదు. కాశీని వదిలి పెట్టి వెళ్ళిపో..’’ అన్నాడు. ఆతిథ్యమంటే అంత తప్పుచేసిన అతిథినికూడా కాశీ పట్టణంనుంచి పంపేముందు మధ్యాహ్నం అన్నం పెట్టి మరీ పంపించింది అన్నపూర్ణ. అదీ ఈ దేశం గొప్పతనం. ఇంటికి వచ్చిన అతిథిని పూజించి, ఆదరించి, తృప్తిగా అన్నంపెట్టి సత్కరించడం గృహస్థు ధర్మం. ఒక అతిథి ఇంటికొస్తే ఎలా గౌరవించాలి, ఎలా పూజించాలి, ఎలా సత్కరించాలన్నది మనకు మన పెద్దలు నేర్పారు.

సనాతన ధర్మం కేవలం మనం ఎలా బతకాలో నేర్పలేదు. నలుగురికోసం ఎంత ఉత్తమంగా బతికి, ఎంత ఉన్నతంగా ఎదగాలో నేర్పింది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథి దేవోభవ అని మనం ఇప్పటివరకు తెలుసుకున్న విషయాలు ముందుగా మనం పూర్తిగా జీర్ణించుకుని, మనసా వాచా కర్మణా అనుసరిస్తూ, మన పిల్లలకు ఆదర్శంగా నిలిస్తే– ఈ ధర్మాన్ని వారు మరో పదికాలాలపాటు పరిరక్షించగలుగుతారు.


- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement