భగవంతుడిచ్చిన మరో కానుక నవ్వు. మనస్ఫూర్తిగా చిరునవ్వు నవ్వడం మనిషి ప్రసన్నంగా ఉన్నాడనడానికి గుర్తు. చిరునవ్వుని మించిన ఆభరణం లేదు. ముఖం మీద చిరునవ్వులేకుండా ఎప్పుడూ చిటపటలాడుతుండేవాడి దగ్గరకు వెళ్ళడానికి ఎవరూ ఇష్టపడరు. కలాంగారు మాట్లాడుతున్నప్పుడు, ఆయన చూపే ప్రేమ చూడండి. చిరునవ్వు చూడండి. ఆయన విజయాలకు అది కూడా ఒక ప్రధాన కారణం. ఆ నవ్వు తన చుట్టూ ఉన్నవారిలో శాంతాన్ని నింపుతుంది, ఉద్వేగం లేకుండా చేస్తుంది. సంతోషంగా, హాయిగా ఉండేటట్లు చేస్తుంది. అలా పరమేశ్వరుడిచ్చిన అపురూప కానుకలయిన మాట, నవ్వు, బుద్ధి...ఈ మూడింటి ద్వారా నేను సమాజానికి ఏం ఉపకారం చేయగలను, ఎలా ఉద్ధరించగలను..అని ఆలోచిస్తూ ఉండాలి.
కటిక పేదరికంలోంచి వచ్చి, తాను పొందిన పేదరికం ఇతరులు పొందకూడదని, తను పడిన బాధలు మరొకరు పడకూడదని తన చుట్టూ ఉన్నవారి ఉద్ధరణకోసం జీవితాన్ని అంకితం చేసిన మహానుభావులున్నారు. బాబా సాహెబ్ జీవిత చరిత్ర చదివితే రోమాంచితమవుతుంది. గుక్కెడు మంచినీళ్లు తాగడానికి ఆ రోజుల్లో ఆయన పడిన కష్టాలు చదువుతుంటే కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఆయన సమాజంలో వివక్షవలన పొందిన అవమానాలు తెలుసుకుంటుంటే చాలా రోతగా అనిపిస్తుంది. ఇలా ఉండొచ్చా ఒక సమాజంలో !!! అనిపిస్తుంది. ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు భీమ్ రావు. కానీ చిన్నతనంలో ఆయనను అంబేద్కర్ అనే ఉపాధ్యాయుడు చేరదీసి పాఠాలు చెప్పి తాను తెచ్చుకున్న భోజనంలో కొంతపెట్టి ఆదుకున్నాడు.
బారిష్టర్ చదివిన తరువాత తన వద్ధికి కారణమయిన తన గురువుగారిని తన పేరులో చేర్చుకుని భీమ్ రావు అంబేద్కర్ అయ్యారు. కేంద్ర న్యాయశాఖామంత్రిగా ఎదిగినా, భారత రాజ్యాంగ నిర్మాణ సభ లోనే అంత గొప్పవ్యక్తి అయినా, రాజ్యాంగ రూపకల్పనలో స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషించి రాజ్యాంగ నిర్మాతగా కొనియాడబడినా... తాను కష్టపడినట్లుగా, సమాజంలో వివక్షకు గురయి బాధపడినట్లుగా మరెవరూ బాధపడకూడదని ఆఖరి ఊపిరివరకూ శ్రమించాడు, ఎన్నో కోట్లమంది సంతోషంగా ఉండడానికి కారణమయ్యాడు. ఏది చేస్తున్నా, ఎక్కడ ఉన్నా ఇతరులకు ఏమివ్వగలనని ఆలోచించమని అబ్దుల్ కలాంగారు విద్యార్థుల చేత ప్రమాణం చేయించింది ఇటువంటి దార్శనికుల అడుగుజాడల్లో నడవమని చెప్పడానికే.
అటువంటివారు ఎందరో ఉన్నారు. ఉండిచేసిన వారు కారు. చిన్నతనంలో కటిక దరిద్రాన్ని అనుభవించినా, వారు పెద్దయిన తరువాత వారు సంపాదించినది ఒక రూపాయి కూడా మిగుల్చుకోకుండా సమాజపరం చేసారు. ఎం.ఎస్.సుబ్బులక్ష్మిగారు చివరి దశలో ఆస్పత్రిలో ఉండి ఇక ప్రాణం విడిచి పెట్టేస్తారనగా...‘‘నేనెలాగూ ఇక ఇంటికి వెళ్లేది లేదు, ఇక్కడ ప్రాణోత్కమ్రణం అయిపోతుంది’’ అనిపించి... తనకు నిరంతరం సేవలు అందించిన వ్యక్తి పేర తన ఇంటిని రాసిచ్చేశారు.
ఆవిడ శరీర త్యాగం చేసేటప్పటికి తనది అని ఆవిడ ఏదీ ఉంచుకోలేదు. ఎన్ని లబ్ధికచేరీలు చేసారో, ఎన్ని లక్షల రూపాయలు సముపార్జించి పెట్టారో ఆఖరున పండుటాకులా అయిపోయిన తరువాత కూడా ‘మా గురువుగారికోసం ఏదో చేయాలి’ అని సంకల్పించి కంచికామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామివారి స్మారకంగా ఏర్పాటు చేయదలచిన మణిమంటప నిర్మాణానికి లబ్ధి కచేరీల ద్వారా సంపాదించిన దాని నుంచి భూరి విరాళాలు అందేలా చేసారు.
- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment