Baba saheb
-
అంబేడ్కర్‌ను సరిగ్గా అర్థం చేసుకోవాలి!
‘‘మహా సామ్రాజ్యాలు, సంకుచిత మనస్తత్వాలు కలిసి మనుగడ సాగించలేవు’’ అన్న అంబేడ్కర్ మాటలు రాజ్యాంగ సభను నివ్వెరపరిచాయి. 18వ శతాబ్దపు ఐరిష్ రాజనీతి తాత్వికుడు ఎడ్మండ్ బర్క్ మాటలను అంబేడ్కర్ తీవ్ర స్వరంతో పలికారు. ఆగస్టు 26, 1949న రాజ్యాంగంలో పొందుపరి చిన ఆర్టికల్ 334పై జరిగిన చర్చను ముగిస్తూ అంబేడ్కర్ చేసిన నిరసన గర్జన అది. షెడ్యూల్డ్ కులాల రాజకీయ హక్కుల కోసం పోరాడిన అంబేడ్కర్‌కు రాజ్యాంగసభ నిరాశను మిగిల్చింది. దాని పర్యవ సానమే 1955 ఆగస్టు 21న బొంబాయిలో జరిగిన ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కులాల సమాఖ్య, వర్కింగ్ కమిటీ సమావేశంలో... పార్లమెంటు, శాసనసభలు, జిల్లా, పట్టణ స్థాయి స్థానిక సంస్థల్లో ఎస్సీలకు కేటాయించిన రిజర్వుడు సీట్లను ఎత్తివేయాలన్న తీర్మానం. ఈ సమావేశంలో అంబేడ్కర్ కూడా పాల్గొన్నారు. దీనిని కొంతమంది ఎస్సీ రిజర్వేషన్లకే అంబేడ్కర్ వ్యతిరేకమని అర్థం చేసుకుంటున్నారు. అదే సంవత్సరం అంటే 1955 డిసెం బర్ 23న, భాషా ప్రయుక్త రాష్ట్రాలపై రూపొందించిన డాక్యు మెంటులో ‘‘ప్రత్యేక ఓటింగ్ విధానం గానీ, సీట్ల రిజర్వేషన్ గానీ సాధ్యం కానప్పుడు బహుళ సభ్యుల నియోజక వర్గాలు అంటే రెండు లేక మూడు నియోజక వర్గాలు కలిపి ఒకే నియోజక వర్గంగా రూపొందిస్తే అది అల్ప సంఖ్యాకులుగా ఉన్న వారికి భరోసాను ఇస్తుంది. దీనినే క్యుములేటివ్ ఓటింగ్ అంటారు’’ అని ప్రత్యామ్నాయాన్ని సైతం అంబేడ్కర్ సూచించిన విష యాన్ని మర్చిపోవద్దు. బాబాసాహెబ్ రాజ్యాంగ సభలో సభ్యుడిగా వెళ్లిన కారణమే రాజకీయ, సామాజిక హక్కులను పొందుపరచడానికని మరచి పోవద్దు. పార్లమెంటు, అంసెబ్లీలలో రిజర్వేషన్లు పదేళ్ళు మాత్రమే ఉంటాయనే విషయాన్ని అంబేడ్కర్ అంగీకరించలేదు. ‘ఎస్సీ, ఎస్టీల కోసం నిర్దేశించిన రిజర్వేషన్లు పదేళ్ళు ఉండాలని చాలామంది మాట్లాడారు. వాళ్ళందరికీ నేను చెప్పదల్చుకున్నది ఒక్కటే. మహా సామ్రాజ్యాలు, సంకుచిత మనస్తత్వాలు కలిసి మనుగడ సాగించలేవు’ అన్నారు. దీనర్థం పదేళ్ళ పరిమితిని అంగీకరించినట్టా, వ్యతిరేకించినట్టా? 1955లో షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ చేసిన తీర్మానానికీ, రాజ్యాంగం ఆమోదించిన దానికీ మధ్యలో చాలా పరిణామాలు జరిగాయి. అంబేడ్కర్ ఆశించిన రాజకీయ హక్కుల రక్షణకే వల్లభ్ భాయి పటేల్ లాంటి వాళ్ళు ఎసరు పెట్టారు. తాను ప్రతిపాదిస్తున్న ప్రత్యేక ఓటింగ్ విధానం కూడా సాధ్యం కాదేమో అనే అభిప్రాయానికి అంబేడ్కర్ వచ్చారు. 1947 ఆగస్టులో రూపొందించిన రాజ్యాంగ ముసాయిదాలో షెడ్యూల్డ్ కులాలకు, ఇతర మైనారిటీలకు రాజకీయ రక్షణలను చేర్చారు. అంబేడ్కర్ డిమాండ్ చేసిన ప్రత్యేక ఓటింగ్ విధానం ఆమోదం పొందలేదు. అయినప్పటికీ అంబేడ్కర్ రిజర్వుడు సీట్ల విధానానికి ఒప్పు కున్నారు. అప్పుడు పదేళ్ళ పరిమితి లేదు. అయితే పాకిస్తాన్ విభజన జరగడం, గాంధీజీ హత్యకు గురవడంతో సర్దార్ పటేల్ 1947 నాటి ముసాయిదాను తిరగదోడారు. రిజర్వేషన్లనే తీసి వేస్తామని ప్రకటించారు. 1948 ఆగస్టు నాటికి రాజ్యాంగ రచన పూర్తయింది. చర్చలు ముగిశాయి. అంబేడ్కర్ తీవ్ర ఆగ్రహంతో రాజ్యాంగ సభ నుంచి వాకౌట్ చేశారు. అంటరాని వారి సంక్షేమాన్ని హిందువులు ఎట్లా అడ్డుకున్నారో తరతరాల చరిత్ర మరువని విధంగా తాను రాజ్యాంగ సభ నుంచి వాకౌట్ చేస్తున్నా నని ప్రకటించారు. దాంతో దిగివచ్చిన కాంగ్రెస్ నాయకులు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు అంగీకరించారు. అయితే రాజ్యాంగం ఆమోదం సమయంలో పటేల్, నెహ్రూ పదేళ్ళ పాటు మాత్రమే రిజర్వేషన్లు ఉంటాయని చేసిన ప్రసం గాలు అంబేడ్కర్‌ను బాధించాయి. 1951, 1952లో జరిగిన మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ ఎటువంటి విజయాలు సాధించలేదు. అంబేడ్కర్ కూడా ఓడి పోయారు. రిజర్వుడు సీట్ల విధానం వల్ల నిజమైన ఎస్సీ ప్రతి నిధుల ఎన్నిక అసాధ్యమనే విషయాన్ని మరోసారి ఆ ఎన్నికలు రుజువు చేశాయి. 1936లో, 1942లో జరిగిన ఎన్నికల్లో ఇదే అను భవం అంబేడ్కర్‌కు ఎదురైంది. అందుకే 1947లో తయారు చేసిన నమూనా రాజ్యాంగంలో ప్రత్యేక ఓటింగ్ విధానాన్ని ప్రతిపాదించారు. నమూనా రాజ్యాంగానికి ‘స్టేట్స్ అండ్ మైనారి టీస్’ అనే పేరు పెట్టారు. ‘‘ఈ రిజర్వేషన్లు పదేళ్ళే ఉంటాయి. ఆ తర్వాత ఉండవు. అందువల్ల మనం ఐక్యంగా ఉద్యమించాలి. అంతే కాకుండా, హిందువుల దయాదాక్షిణ్యాల మీద ఎన్నికయ్యే ఈ రిజర్వుడు సీట్ల విధానం వల్ల మనకు ఎటువంటి ప్రయోజనం లేదు’’ అంటూ పంజాబ్ ఎన్నికల సభల్లో అంబేడ్కర్ చేసిన ప్రసంగాలు అంబేడ్కర్ సమగ్ర రచనల 17వ సంపుటంలోనే ఉన్నాయి. పనికిరాని రిజర్వేషన్లు, పదేళ్ళే ఉండే రిజర్వేషన్లు ఉంటే ఎంత, పోతే ఎంత అనే అభిప్రాయానికి అంబేడ్కర్ వచ్చారు. దాని ఫలితమే షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ తీర్మానం. ఆ తర్వాత క్యుములేటివ్ ఓటింగ్ విధానాన్ని ఆయన ముందుకు తెచ్చారు. ఈ విధానంలో ఎన్ని నియోజక వర్గాలను కలిపి ఒక్కటిగా చేస్తారో, ప్రతి ఓటరుకు అన్ని ఓట్లు ఉంటాయి. మూడు నియోజకవర్గాలను కలిపితే మూడు ఓట్లు ఉంటాయి. రిజర్వేషన్లు ఉండవు. ఎవరైనా పోటీ చేయొచ్చు. తమ నియోజక వర్గాలకు ప్రతి పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులు ఉంటారు. ఒక ఓటరు తన మూడు ఓట్లను ముగ్గురికి ఒక్కొక్క ఓటుగా వేయొచ్చు; ఇద్దరికే వేయొచ్చు; మూడు ఓట్లను ఒక అభ్యర్థికి కూడా వేయొచ్చు. ఎస్సీ అభ్యర్థి ఒక్కడే ఉండే ఆ నియోజక వర్గంలో ఎస్సీలందరూ ఒక్క అభ్యర్థికే తమ మూడు ఓట్లను వేస్తే, తప్పనిసరిగా ఎస్సీ అభ్యర్థి గెలుస్తాడు. అయితే అంబేడ్కర్‌కి ఈ విధానం మీద ఉద్యమం చేసేంతటి సమయం లేదు. ఆ సమ యంలో ఆయన బౌద్ధంపై కేంద్రీకరించి ఉన్నారు. ఈ ఆలోచన ‘స్టేట్స్, అండ్ మైనారిటీస్’లో కూడా ప్రతిపాదించారు. కానీ అది ప్రచారం పొందలేదు. రిజర్వేషన్ సీట్లు రాజకీయ అధికార భాగస్వామ్యం కోసం నిర్దేశించుకున్న ఒక రూపం. రిజర్వుడు సీట్లు అంబేడ్కర్ రాజకీయ మార్గం కాదు. ఎన్నో మార్గాలను అంబేడ్కర్ వెతికారు. ఆయన నిజమైన లక్ష్యం ఎస్సీలు రాజకీయాధికారంలో భాగం కావడం. ఆ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్ళేవారు ఆయన ఆలోచనా సరళిని సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మల్లెపల్లి లక్ష్మయ్య, వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 81063 22077 -
మనువును కాల్చేశాడు పదవిని కాలదన్నాడు
అంబేడ్కర్ మనుస్కృతి ప్రతులను దగ్ధం చేయడాన్ని చాలామంది ‘కులం’ కోణం నుంచే చూస్తారుగానీ ఇందులో స్త్రీ దృకోణం కూడా ఉంది. మనుస్మృతి అనేది స్త్రీ కాళ్లకు, మేధస్సుకు బంధనాలు వేస్తుందనే నిరసన కూడ మనుస్మృతి దగ్ధం వెనుక ఒక ప్రధాన కారణం. స్త్రీ హక్కుల కోసం అంబేద్కర్ తన మంత్రి పదవిని కూడా వదులుకున్నారు. హక్కులు, స్వేచ్ఛ, సాధికారత, ఆత్మగౌరవంపై అంబేడ్కర్‌కు స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. కులం దుర్మార్గాన్నే కాదు స్త్రీల మీద అణిచివేత ధోరణులను కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించేవారు. ఒక సమాజం అభివృద్ధి చెందింది అని చెప్పడానికి స్త్రీ అభివృద్ధి అనేది కొలమానం అనేవారు. తన ఉపన్యాసాలలో స్త్రీ అణచివేత, కులవ్యవస్థ మధ్య ఉన్న లంకెను గురించి చర్చించేవారు.‘ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ హిందూ వుమెన్’ పేరుతో రాసిన వ్యాసంలో స్త్రీని చీకటి అగాధంలోకి నెట్టేవేసిన సామాజిక పరిస్థితులు గురించి లోతుగా చర్చించారు. ఆడబిడ్డ పుట్టుకను బౌద్ధసంప్రదాయం దుఃఖమయ ఘటనగా భావించదని చెబుతూ... బుద్దుడు, ప్రసంజిత్ మహారాజుల మధ్య జరిగిన ఒక సంఘటనను ఉదహరిస్తుండేవారు అంబేడ్కర్. తనకు ఆడపిల్ల జన్మించిందన్న కారణంతో ప్రసంజిత్ మహారాజు దుఃఖితుడవుతున్న సమయంలో–‘‘ఆడబిడ్డ పుట్టిందని ఎంత మాత్రం దుఃఖించాల్సిన అవసరం లేదు. ఆడబిడ్డ మగబిడ్డకు ఏమాత్రం తీసిపోదు’’ అంటాడు బుద్దుడు.తన ఉపన్యాసాల ద్వారా స్త్రీ చైతన్యానికి ప్రయత్నించేవారు అంబేడ్కర్. మారుతున్న సమాజంతో పాటు మారాలని, మూఢాచారాలను వదిలివేయాలని, అనవసర ఆర్భాటాలకు దూరంగా ఉండాలని చెప్పేవారు.వేశ్యవృత్తిలో ఉన్న కొందరు మహర్ మహిళలు, ఆ నరక చీకట్లో నుంచి వెలుగులోకి రావడానికి, కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అంబేడ్కర్ మాటలు ఎంతో దోహదపడ్డాయి.స్త్రీ విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు అంబేడ్కర్. ఆయన నేతృత్వంలో ఏర్పడిన ‘పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ’ ఎందరో బాలికలకు విద్యావకాశాలు కల్పించింది. మహిళలు చదుకోవాల్సిన అవసరం గురించి ప్రచారం చేసింది. అంబేడ్కర్ మనుస్కృతి ప్రతులను దగ్ధం చేయడాన్ని చాలామంది ‘కులం’ కోణం నుంచే చూస్తారుగానీ ఇందులో స్త్రీ దృకోణం కూడా ఉంది. మనుస్మృతి అనేది స్త్రీ కాళ్లకు, మేధస్సుకు బంధనాలు వేస్తుందనే నిరసన కూడ మనుస్మృతి దగ్ధం వెనుక ఒక ప్రధాన కారణం.కులం, స్త్రీ అణచివేతను విడి విడి సమస్యలుగా చూడలేదు అంబేడ్కర్. రెండు సమస్యలకు సమ ప్రాధాన్యం ఇచ్చారు. బాల్యవివాహాలకు దూరంగా ఉండాలని చెప్పిన అంబేడ్కర్, స్త్రీ దృష్టి కోణం నుంచి కుటుంబ నియంత్రణను గట్టిగా సమర్థించేవారు.దళిత స్త్రీల కట్టుబొట్టును నిర్ణయించి, నియంత్రించిన అగ్రకులవ్యవస్థ కుట్రను కూడా తన ప్రసంగాలలో ఎండగట్టేవారు అంబేడ్కర్. దళిత మహాసభలు జరిగినప్పుడు, స్త్రీల కోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రసంగించేవారు.‘‘పాత, మురికి బట్టలకు దూరంగా ఉండాలి’’ అని చెప్పేవారు. దీని ఉద్దేశం దళిత స్త్రీలు అందంగా, ఆడంబరంగా తయారవ్వాలని కాదు... కుల ఆధారిత వస్త్రధారణను నిరసించడం మాత్రమే ఆయన మాటల వెనుక ఉన్న సారాంశం. అంబేడ్కర్ మాటల ప్రభావంతో ఎన్నో దళిత మహిళాసంఘాలు తమాషా(పాటలతో కూడిన నృత్యం)లకు దళిత స్త్రీలు దూరంగా ఉండాలని ఒక తీర్మానం చేశాయి. ప్రదర్శన సమయంలో దళిత స్త్రీలు నెత్తి మీద గ్యాస్ దీపాలు మోయకూడదని కూడా తీర్మానం చేశాయి.పాట కావచ్చు, పని కావచ్చు, వేసుకునే బట్టలు కావచ్చు...ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఎలాంటి చర్యను అనుమతించకూడదని అంబేడ్కర్ దళిత స్త్రీలకు చెప్పేవారు.కుటుంబవ్యవస్థలో స్త్రీలకు కొన్ని హక్కులు కల్పిస్తూ తాను తయారుచేసిన ‘హిందూ కోడ్’ బిల్లును పార్లమెంట్లో ఆమోదింపజేయడానికి శతవిధాల ప్రయత్నించారు అంబేడ్కర్. సంప్రదాయ ఛాందసుల కుట్ర వల్ల ఈ బిల్లు ఆమోదం పొందలేదు. దీనికి నిరసనగా తన మంత్రి పదవికి రాజీనామా చేసి స్త్రీల హక్కులపై తన నిబద్దతను చాటుకున్న ధీశాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్. (సౌజన్యం : డాక్టర్ బి. విజయభారతి) -
విషాన్ని మింగి అమృతాన్ని పంచారు
భగవంతుడిచ్చిన మరో కానుక నవ్వు. మనస్ఫూర్తిగా చిరునవ్వు నవ్వడం మనిషి ప్రసన్నంగా ఉన్నాడనడానికి గుర్తు. చిరునవ్వుని మించిన ఆభరణం లేదు. ముఖం మీద చిరునవ్వులేకుండా ఎప్పుడూ చిటపటలాడుతుండేవాడి దగ్గరకు వెళ్ళడానికి ఎవరూ ఇష్టపడరు. కలాంగారు మాట్లాడుతున్నప్పుడు, ఆయన చూపే ప్రేమ చూడండి. చిరునవ్వు చూడండి. ఆయన విజయాలకు అది కూడా ఒక ప్రధాన కారణం. ఆ నవ్వు తన చుట్టూ ఉన్నవారిలో శాంతాన్ని నింపుతుంది, ఉద్వేగం లేకుండా చేస్తుంది. సంతోషంగా, హాయిగా ఉండేటట్లు చేస్తుంది. అలా పరమేశ్వరుడిచ్చిన అపురూప కానుకలయిన మాట, నవ్వు, బుద్ధి...ఈ మూడింటి ద్వారా నేను సమాజానికి ఏం ఉపకారం చేయగలను, ఎలా ఉద్ధరించగలను..అని ఆలోచిస్తూ ఉండాలి. కటిక పేదరికంలోంచి వచ్చి, తాను పొందిన పేదరికం ఇతరులు పొందకూడదని, తను పడిన బాధలు మరొకరు పడకూడదని తన చుట్టూ ఉన్నవారి ఉద్ధరణకోసం జీవితాన్ని అంకితం చేసిన మహానుభావులున్నారు. బాబా సాహెబ్ జీవిత చరిత్ర చదివితే రోమాంచితమవుతుంది. గుక్కెడు మంచినీళ్లు తాగడానికి ఆ రోజుల్లో ఆయన పడిన కష్టాలు చదువుతుంటే కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఆయన సమాజంలో వివక్షవలన పొందిన అవమానాలు తెలుసుకుంటుంటే చాలా రోతగా అనిపిస్తుంది. ఇలా ఉండొచ్చా ఒక సమాజంలో !!! అనిపిస్తుంది. ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు భీమ్ రావు. కానీ చిన్నతనంలో ఆయనను అంబేద్కర్ అనే ఉపాధ్యాయుడు చేరదీసి పాఠాలు చెప్పి తాను తెచ్చుకున్న భోజనంలో కొంతపెట్టి ఆదుకున్నాడు. బారిష్టర్ చదివిన తరువాత తన వద్ధికి కారణమయిన తన గురువుగారిని తన పేరులో చేర్చుకుని భీమ్ రావు అంబేద్కర్ అయ్యారు. కేంద్ర న్యాయశాఖామంత్రిగా ఎదిగినా, భారత రాజ్యాంగ నిర్మాణ సభ లోనే అంత గొప్పవ్యక్తి అయినా, రాజ్యాంగ రూపకల్పనలో స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషించి రాజ్యాంగ నిర్మాతగా కొనియాడబడినా... తాను కష్టపడినట్లుగా, సమాజంలో వివక్షకు గురయి బాధపడినట్లుగా మరెవరూ బాధపడకూడదని ఆఖరి ఊపిరివరకూ శ్రమించాడు, ఎన్నో కోట్లమంది సంతోషంగా ఉండడానికి కారణమయ్యాడు. ఏది చేస్తున్నా, ఎక్కడ ఉన్నా ఇతరులకు ఏమివ్వగలనని ఆలోచించమని అబ్దుల్ కలాంగారు విద్యార్థుల చేత ప్రమాణం చేయించింది ఇటువంటి దార్శనికుల అడుగుజాడల్లో నడవమని చెప్పడానికే. అటువంటివారు ఎందరో ఉన్నారు. ఉండిచేసిన వారు కారు. చిన్నతనంలో కటిక దరిద్రాన్ని అనుభవించినా, వారు పెద్దయిన తరువాత వారు సంపాదించినది ఒక రూపాయి కూడా మిగుల్చుకోకుండా సమాజపరం చేసారు. ఎం.ఎస్.సుబ్బులక్ష్మిగారు చివరి దశలో ఆస్పత్రిలో ఉండి ఇక ప్రాణం విడిచి పెట్టేస్తారనగా...‘‘నేనెలాగూ ఇక ఇంటికి వెళ్లేది లేదు, ఇక్కడ ప్రాణోత్కమ్రణం అయిపోతుంది’’ అనిపించి... తనకు నిరంతరం సేవలు అందించిన వ్యక్తి పేర తన ఇంటిని రాసిచ్చేశారు. ఆవిడ శరీర త్యాగం చేసేటప్పటికి తనది అని ఆవిడ ఏదీ ఉంచుకోలేదు. ఎన్ని లబ్ధికచేరీలు చేసారో, ఎన్ని లక్షల రూపాయలు సముపార్జించి పెట్టారో ఆఖరున పండుటాకులా అయిపోయిన తరువాత కూడా ‘మా గురువుగారికోసం ఏదో చేయాలి’ అని సంకల్పించి కంచికామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామివారి స్మారకంగా ఏర్పాటు చేయదలచిన మణిమంటప నిర్మాణానికి లబ్ధి కచేరీల ద్వారా సంపాదించిన దాని నుంచి భూరి విరాళాలు అందేలా చేసారు. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
తెరపైకి అంబేద్కర్ జీవిత చరిత్ర
భారత రాజ్యాంగ రూపకర్త బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నది తాజా న్యూస్. రన్హార్స్ మీడియా పతాకంపై అజయ్‌కుమార్ బాబాసాహెబ్ పేరుతో ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించ తలపెట్టారు. దీని గురించి ఆయన తెలుపుతూ ప్రస్తుతం రౌడీల జీవిత ఇతివృత్తాలతో చిత్రాలు అధికంగా రూపొందుతున్నాయన్నారు. అలాంటిది ఒక జాతీయ నాయకుడి జీవిత చరిత్రను సినిమాగా ఆవిష్కరించకూడదన్న ఆలోచనకు రూపం దాల్చనున్న చిత్రం బాబాసాహెబ్ అని తెలిపారు. ఇది ఒక జాతి నాయకుడి కథగా కాకుండా ఒక దేశ నాయకుడి కథగా ఈ చిత్రం ఉంటుందన్నారు. కాగా ఇందులో బాబాసాహెబ్ పాత్రదారుడి కోసం 10 వేలకు పైగా నటులను పరిశీలించినా ఒక్కరూ సెట్ కాలేదన్నారు. చివరికి తమ ఛాయాగ్రహకుడు మోహన్ సూచన మేరకు ఆయ్వుకూట్టం చిత్ర హీరో రాజ్గణపతికి మేకప్ టెస్ట్ చేయగా ఆయన రూపం బాబాసాహెబ్లానే ఉందన్నారు. కాగా ఆయన బాల్యం, యుక్త వయసు పాత్రల కోసం, భారతీయార్, పెరియార్, ఇతర నటీనటుల ఎంపికను, అంబేద్కర్ 125వ జయంతోత్సవకార్యక్రమాన్ని ఆ నెల 19న స్థానిక ఆవడిలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అదే విధంగా చిత్ర షూటింగ్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు అజయ్‌కుమార్ తెలిపారు. -
వీరేనా బాబాసాహెబ్ వారసులు?
అంబేడ్కర్‌కు వారసులం మేమేనంటూ రాజకీయలబ్ధి పొందాలని చూస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్లది ఆది నుంచీ ‘హిందుత్వ’ ఎజెండానే. అంబేడ్కర్ చలవ వల్లే ప్రధానిని అయ్యానన్న మోదీ, మంత్రివర్గంలో దళితులకు అతి తక్కువ ప్రాతినిధ్యాన్నిచ్చారు. మూడు బడ్జెట్లలోనూ ఎస్సీ, ఎస్టీల నిధులలో కోత పెట్టారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి సెల్ఫ్‌గోల్ చేసుకోవడం అలవాటుగా మారింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా కొందరు బీజేపీ అగ్రనేతలు... అంబేడ్కర్ ఆశయాలకు, సిద్ధాంతాలకు, భావజాలానికీ, తను పార్టీకీ సారూప్యత ఉన్నదంటూ, పరోక్షంగా తామే ఆయన వారసులమని చాటుకోవాలని యత్నించారు. మొదట ఢిల్లీ, తదుపరి బిహార్ ఎన్నికలలో ఎదురైన వరుస ఘోరపరాజయాల తర్వాత ఆ పార్టీకి... దళితులు, గిరిజనులు, బహుజనులు తమకు దూరం అవుతున్నారని జ్ఞానోదయమైంది. దీంతో హఠాత్తుగా బీజేపీకి అంబేడ్కర్‌పై ప్రేమ పుట్టుకొచ్చింది. అంబేడ్కర్ ఈ దేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించారు. పరిపాలనకు మార్గదర్శకాలుగా ఆదేశిక సూత్రలను నిర్దేశించారు. సమాన త్వం, సౌహార్ద్రత, ప్రజాస్వామ్యం మూలస్తంభాలుగా, కుల, మత, వర్గ, ఆర్థిక అంతరాలు లేని సమాజ స్థాపనకు కృషి జరగాలన్నారు, ప్రతి వ్యవస్థలో రాజ్యాంగ స్ఫూర్తి ప్రతిఫలించాలన్నారు. బీజేపీ ప్రభుత్వం లౌకికవాదాన్ని దెబ్బతీయడమే కాదు, దళితులు, గిరిజనులు, మైనార్టీల కోసం రూపొందిం చిన 18 కేంద్ర సంక్షేమ పథకాలను నీరుగార్చింది. ఇదేనా అంబేడ్కర్ కలలు కన్న సంక్షేమ రాజ్య స్థాపన? అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో అది సృష్టించిన రాజకీయ సంక్షోభాలు, ఏపీలో ఎన్డీఏ భాగస్వామి టీడీపీ ఫిరా యింపుల పర్వం అంబేడ్కర్ భావజాలానికి అనుగుణంగా సాగుతున్నవేనా? కాషాయ రంగుటద్దాల్లోంచి అంబేడ్కర్‌తో విభేదాలు చరిత్రకు కాషాయ రంగు పులమడం అలవాటైన బీజేపీ అంబేడ్కర్ విషయం లోనూ వక్రీకరణలకు పాల్పడుతోంది. మను స్మృతిని, చాతుర్వర్ణ వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించి కుల నిర్మూలన కానిదే ఆశించిన అభ్యున్నతి సాధ్యం కాదన్న అంబేడ్కర్‌ను... కులం పునాదులపై నిర్మితమైన తమ ‘హిందుత్వ’ సిద్ధాంతవాదిగా చలామణి చేయాలని చూస్తోంది. అంబేడ్కర్ 125వ జన్మదినం సందర్భంగా ఆర్ఎస్ఎస్ అధికార పత్రిక ‘పాంచజన్య’ ప్రత్యేక సంచిక ‘‘అంబేడ్కర్ ముస్లింలకు వ్యతిరేకి’’ అంటూ వ్యాసాలను ప్రచురించింది. పైగా, అంబేడ్కర్-గాంధీ విభేదాలను, నెహ్రూ-అంబేడ్కర్ విభేదాలను ప్రముఖంగా ప్రస్తావించి, వక్రీకరించి దళిత వర్గాలతో కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధాన్ని చెడగొట్టాలని ప్రయత్నిస్తున్నారు. కులవ్యవస్థను నిర్మూ లించాలని అంబేడ్కర్ భావిస్తే, గాంధీజీ వర్ణవ్యవస్థలో కొంత ఔన్నత్యం ఉన్నదని భావించారు. అయితే కులవ్యవస్థపై గాంధీ అభిప్రాయాలలో మార్పు వచ్చింది. కుల నిర్మూలన జరగాలని ఆయన ఆశించారు. ప్రముఖ సోషలిస్టు నేత మధులిమాయే తన ‘అంబేడ్కర్ ద పయనీర్’లో అంబేడ్కర్ అభిప్రాయాలను గాంధీజీ గౌరవించారని, వర్ణ వ్యవస్థపై తన అభిప్రాయాలు మార్చుకొన్నారని రాశారు. కమ్యూనల్ అవార్డు ద్వారా దళితులకు విడి నియోజకవర్గాల ఏర్పాటుపై అంబేడ్కర్, గాంధీలు విభేదించారు. దళిత నియోజకవర్గాలకు వ్యతిరేకంగా గాంధీ నిరాహారదీక్ష చేశారు. కానీ, ఆ తర్వాత ‘పూనా ఒడంబడిక’ కుదిరిందని విస్మరించలేం. అంబేడ్కర్‌తో విభేదించినా గాంధీజీ ఆయన పట్ల అపార అభిమానం, గౌరవం చూపారు. నెహ్రూ తొలి మంత్రివర్గంలో అంబేడ్కర్ న్యాయశాఖ మంత్రి బాధ్యతలు స్వీకరించడానికి గాంధీయే కారణం. గాంధీజీ సలహామేరకే అంబేడ్కర్ రాజ్యాంగ ముసాయిదా కమిటీకి చైర్మన్ కాగలిగారు. ‘‘దళితులు గాంధీజీకి అత్యంత సన్నిహితులు, ప్రియమైన వారు... మనం ఆయనను సరిగా అర్థం చేసుకోలేకపోయాం’’ అని తర్వాతి కాలంలో అంబేడ్కర్ అన్నారు. అంబేడ్కర్, నెహ్రూలు కలసి పనిచేశారు బీజేపీ ప్రచారం చేస్తున్నట్లు అంబేడ్కర్‌కు, కాంగ్రెస్‌కు మధ్య తారస్థాయి విభేదాలు, శత్రుత్వం ఎన్నడూ లేవు. పలు అంశాలపై ఏకాభిప్రాయం కుదరకపోయినా అంబేడ్కర్... నెహ్రూ తదితర కాంగ్రెస్ నేతలతో కలసి పనిచేశారు. 1946లో తూర్పు బెంగాల్ నుంచి కాన్స్టిట్యుయెంట్ అసెంబ్లీకీ ఎన్నికయిన అంబేడ్కర్.. దేశ విభజనతో తన స్థానాన్ని కోల్పోయారు. కానీ కాన్స్టిట్యుయెంట్ అసెంబ్లీలో అంబేడ్కర్ అవసరాన్ని గ్రహించిన బాబూ రాజేంద్రప్రసాద్, నెహ్రూలు.. జీవీ మవలాంకర్కు బదులుగా అంబేడ్కర్‌కు అవకాశాన్ని కల్పించారు. ప్రధానిగా నెహ్రూ, కేంద్ర న్యాయశాఖ మంత్రిగా అంబేడ్కర్ హిందూ కోడ్ బిల్లు రూపకల్పనకు కలసి కృషి చేశారు. ఈ బిల్లు పార్లమెంట్లో వీగిపోయినప్పుడు అంబేడ్కర్ రాజీనామా చేశారు. సంక్షేమ రాజ్యస్థాపన, పేదలకు, దళితులకు భూపంపిణీ, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో కార్మిక, కర్షకులకు చట్టాల ద్వారా తగిన రక్షణ కల్పించాలన్న అంశాలలో వారిరువురూ చేసిన కృషి చరిత్రాత్మకమైనది. నెహ్రూ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ... అంబేడ్కర్ సూచించిన అతివాద, మితవాదాలకు భిన్నమైన మధ్య మార్గానికి ప్రతీకగా దళిత మేధావులు పేర్కొంటారు. ప్రధాని ఇందిరా గాంధీ చేపట్టిన బ్యాంకుల జాతీయీకరణ, ప్రభుత్వ రంగసంస్థలను బలోపేతం చేయడం, ఎస్సీ, ఎస్టీల రక్షణ చట్టాల అమలు, తదితర చర్యల వల్ల దళితులకు పెద్ద ఎత్తున విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. లౌకికవాదం, సామ్యవాదం పునాదులుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో పలువురు దళిత మేధావులు అత్యున్నత స్థాయికి ఎదిగారు. బాబూ జగ్జీవన్‌రామ్ మొదలుకొని షిండే, ఖర్గే వంటి వారు కేంద్రంలో కీలక పదవులు నిర్వహించారు. దామోదరం సంజీవయ్య ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా, జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశారు. దళిత వ్యతిరేకతే సంఘ్ మార్కు అంబేడ్కర్ వాదం! ఆర్ఎస్ఎస్, దాని నుంచి పుట్టిన జన్‌సంఘ్, బీజేపీలది ఆది నుంచీ ‘హిందుత్వ’ ఎజెండానే. అంబేడ్కర్ సిద్ధాంతాల మేరకు పనిచేస్తామని బీజేపి గతంలో ఎన్నడూ చెప్పలేదు. పైగా వాజ్‌పేయి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న అరుణ్ శౌరి... అంబేడ్కర్‌ను స్వార్థపరుడిగా, దేశభక్తి లేక కేవలం అధికారం కోసం వెంపర్లాడిన వ్యక్తిగా చిత్రీకరిస్తే (వర్షిప్పింగ్ ఫాల్స్ గాడ్స్), బీజేపీ అగ్రనేతలెవ్వరూ శౌరి అభిప్రాయాలను మాటమాత్రంగానైనా ఖండిం చలేకపోయారు. ఇక, నేటి ప్రధాని నరేంద్ర మోదీ అంబేడ్కర్ చలవ వల్లే ప్రధానినయ్యానన్నారే తప్ప, రెండేళ్ల పాలనలో దళితులు, గిరిజనుల సామాజిక ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చే ఏ పథకాన్ని అమలు చేయడం లేదు. ఇద్దరు దళితులకే క్యాబినెట్ స్థాయి మంత్రి పదవులు ఇచ్చారు. కేంద్ర మంత్రి వర్గంలో ఎస్సీలకు ఇంత తక్కువ ప్రాతినిధ్యం గతంలో ఎన్నడూ లేదు. మోదీ మూడు బడ్జెట్లలోనూ ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా కేటాయించ వలసిన నిధుల్లోనూ కోత విధించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని కుదిస్తూ, ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నందువల్ల దళితులకు రిజర్వేషన్ల ద్వారా అందే ఉద్యోగాలూ దక్కడంలేదు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీల అభ్యు న్నతి కోసం కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాలపై నియంత్రణలు విధించారు. మోదీ తేవాలనుకున్న ‘భూసేకరణ చట్టం’ అమలైతే ఎక్కువగా నష్టపోయేది ఎస్సీ, ఎస్టీలే. మోదీ పాలనలో దళితులు, మైనార్టీలపై నేరాలు పెరిగిపోతున్నాయి. బీజేపీ అధ్యక్ష స్థానాన్ని అందుకున్న పాపానికి బంగారు లక్ష్మణ్‌కు చేసిన అన్యాయాన్ని మరచిపోలేం. నిజానికి బీజేపీలో ఏ ఒక్క దళిత మేధావినీ ఎదగనీయలేదు. వాస్తవాలు ఇలా ఉండగా, అంబేడ్కర్‌కు వార సులం మేమే నంటూ రాజకీయలబ్ధి పొందాలని చూస్తున్న మోదీ వ్యూహం పూర్తిగా బెడిసికొట్టింది. బీజేపీ సెల్ఫ్గోల్స్లో ఇది తాజాది. వ్యాసకర్త ఏపీ శాసన మండలి ప్రతిపక్ష నేత మొబైల్: 8106915555 - సి. రామచంద్రయ్య -
అసెంబ్లీ ఆవరణలో రాజ్యాంగ నిర్మాత
అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన గవర్నర్ మండలి చైర్మన్, స్పీకర్ సహా అన్ని పక్షాల నేతలు హాజరు పోటాపోటీగా జై తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాలు సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఆవరణలో భవనానికి ఎదురుగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సోమవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ చక్రపాణి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్, ఉప సభాపతి భట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమానికి మండలిలో అధికారపక్ష నేత, మంత్రి సి. రామచంద్రయ్య, మండలి, శాసనసభల్లో ప్రతిపక్ష నేతలు యనమల రామకృష్ణుడు, చంద్రబాబు, వైఎస్సార్సీపీ పక్ష నాయకురాలు వైఎస్ విజయమ్మ, టీఆర్ఎస్ ఎల్పీ నేత ఈటెల రాజేందర్, ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, సీపీఐ పక్ష నేత గుండా మల్లేశ్, బీజేపీ పక్ష నేత యెండల లక్ష్మీనారాయణ, సీపీఎం పక్ష నేత జూలకంటి రంగారెడ్డి, లోక్‌సత్తా ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ్, అసెంబ్లీ కార్యదర్శి ఎస్.రాజాసదారాం, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. గవర్నర్‌తో పాటు కార్యక్రమానికి హాజరైన వారందరూ అంబేద్కర్ విగ్ర హం వద్ద పుష్పగుచ్చాలుంచి నివాళులర్పించి.. గ్రూప్ ఫొటో దిగారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన వెంటనే అక్కడున్న వారు ‘జోహర్ అంబేద్కర్’, ‘అమర్ రహే అంబేద్కర్’ అంటూ నినాదాలు చేశారు. ఇవి అలా పూర్తయ్యాయో లేదో తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు ‘జై తెలంగాణ’ అని నినాదాలు చేయగా, సీమాంధ్ర ఎమ్మెల్యేలు ‘జై సమైక్యాంధ్ర’ అంటూ పోటీగా నినాదాలు చేశారు. అనంతరం శాసనసభ లాంజ్‌లో ఏర్పాటు చేసిన తేనీటి విందులో నేతలంతా పాల్గొన్నారు. అక్కడ మండలి చైర్మన్ చక్ర పాణి మాట్లాడుతూ సభాపతి స్థానంలో ఉన్న వారు తక్కువ మాట్లాడి, సక్రమంగా జడ్జిమెంట్ చేయాలన్నారు. వెంటనే జోక్యం చేసుకున్న చంద్రబాబు ఇపుడు పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా ఉందన్నారు. గవర్నర్ మాట్లాడుతూ విభజన బిల్లుపై చర్చలో నన్ను భాగస్వామిని కానివ్వరా అని నవ్వుతూ వ్యాఖ్యానించారు. గవర్నర్ పక్కనే ఉన్న ఒకరు మీరు ఉభయ సభల్లో సభ్యులు కాదని నవ్వుతూ సమాధానమిచ్చారు. చంద్రబాబు వెంటనే స్పందిస్తూ, మీరు రాజ్యాంగానికి అధిపతి అని అనడంతో గవర్నర్ నవ్వుతూ, నాకు ప్రతిపక్షం మద్దతు లభించిందని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. విగ్రహావిష్కరణ అనంతరం స్పీకర్ మనోహర్ మీడియాతో మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ఎమ్మెల్యేలు పనిచేస్తారనే ఉద్దేశంతోనే రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. విగ్రహంలో చిన్న చిన్న లోపాలుంటే పట్టించుకోవద్దని, స్ఫూర్తిని మాత్రమే తీసుకోవాలన్నారు. విప్ ఆరేపల్లి మోహన్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహంలో కొన్ని లోపాలున్నాయని స్పీకర్, సీఎంల దృష్టికి తీసుకెళ్లామన్నారు. టీడీఎల్పీ ఉప నేత మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ.. శాసనసభ ఆవరణలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు.