వీరేనా బాబాసాహెబ్ వారసులు? | is they baba saheb of Descendants ? | Sakshi
Sakshi News home page

వీరేనా బాబాసాహెబ్ వారసులు?

Published Wed, Apr 27 2016 10:52 AM | Last Updated on Sun, Sep 3 2017 10:49 PM

వీరేనా బాబాసాహెబ్ వారసులు?

వీరేనా బాబాసాహెబ్ వారసులు?

అంబేడ్కర్‌కు వారసులం మేమేనంటూ రాజకీయలబ్ధి పొందాలని చూస్తున్న బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లది ఆది నుంచీ ‘హిందుత్వ’ ఎజెండానే. అంబేడ్కర్ చలవ వల్లే ప్రధానిని అయ్యానన్న మోదీ, మంత్రివర్గంలో దళితులకు అతి తక్కువ ప్రాతినిధ్యాన్నిచ్చారు. మూడు బడ్జెట్లలోనూ ఎస్సీ, ఎస్టీల నిధులలో కోత పెట్టారు.
 
 కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి సెల్ఫ్‌గోల్ చేసుకోవడం అలవాటుగా మారింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా కొందరు బీజేపీ అగ్రనేతలు... అంబేడ్కర్ ఆశయాలకు, సిద్ధాంతాలకు, భావజాలానికీ, తను పార్టీకీ సారూప్యత ఉన్నదంటూ, పరోక్షంగా తామే ఆయన వారసులమని చాటుకోవాలని యత్నించారు. మొదట ఢిల్లీ, తదుపరి బిహార్ ఎన్నికలలో ఎదురైన వరుస ఘోరపరాజయాల తర్వాత ఆ పార్టీకి... దళితులు, గిరిజనులు, బహుజనులు తమకు దూరం అవుతున్నారని జ్ఞానోదయమైంది. దీంతో హఠాత్తుగా బీజేపీకి అంబేడ్కర్‌పై ప్రేమ పుట్టుకొచ్చింది.
 అంబేడ్కర్ ఈ దేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించారు. పరిపాలనకు మార్గదర్శకాలుగా ఆదేశిక సూత్రలను నిర్దేశించారు.
 
 సమాన త్వం, సౌహార్ద్రత, ప్రజాస్వామ్యం మూలస్తంభాలుగా, కుల, మత, వర్గ, ఆర్థిక అంతరాలు లేని సమాజ స్థాపనకు కృషి జరగాలన్నారు, ప్రతి వ్యవస్థలో రాజ్యాంగ స్ఫూర్తి ప్రతిఫలించాలన్నారు. బీజేపీ ప్రభుత్వం లౌకికవాదాన్ని దెబ్బతీయడమే కాదు, దళితులు, గిరిజనులు, మైనార్టీల కోసం రూపొందిం చిన 18 కేంద్ర సంక్షేమ పథకాలను నీరుగార్చింది. ఇదేనా అంబేడ్కర్ కలలు కన్న సంక్షేమ రాజ్య స్థాపన? అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో అది సృష్టించిన రాజకీయ సంక్షోభాలు, ఏపీలో ఎన్డీఏ భాగస్వామి టీడీపీ ఫిరా యింపుల పర్వం అంబేడ్కర్ భావజాలానికి అనుగుణంగా సాగుతున్నవేనా?
 
 కాషాయ రంగుటద్దాల్లోంచి అంబేడ్కర్‌తో విభేదాలు  
 చరిత్రకు కాషాయ రంగు పులమడం అలవాటైన బీజేపీ అంబేడ్కర్ విషయం లోనూ వక్రీకరణలకు పాల్పడుతోంది. మను స్మృతిని, చాతుర్వర్ణ వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించి కుల నిర్మూలన కానిదే ఆశించిన అభ్యున్నతి సాధ్యం కాదన్న అంబేడ్కర్‌ను... కులం పునాదులపై నిర్మితమైన తమ ‘హిందుత్వ’ సిద్ధాంతవాదిగా చలామణి చేయాలని చూస్తోంది. అంబేడ్కర్ 125వ జన్మదినం సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ అధికార పత్రిక ‘పాంచజన్య’  ప్రత్యేక సంచిక ‘‘అంబేడ్కర్ ముస్లింలకు వ్యతిరేకి’’ అంటూ వ్యాసాలను ప్రచురించింది.
 
  పైగా, అంబేడ్కర్-గాంధీ విభేదాలను, నెహ్రూ-అంబేడ్కర్ విభేదాలను ప్రముఖంగా ప్రస్తావించి, వక్రీకరించి దళిత వర్గాలతో కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధాన్ని చెడగొట్టాలని ప్రయత్నిస్తున్నారు. కులవ్యవస్థను నిర్మూ లించాలని అంబేడ్కర్ భావిస్తే, గాంధీజీ వర్ణవ్యవస్థలో కొంత ఔన్నత్యం ఉన్నదని భావించారు. అయితే కులవ్యవస్థపై గాంధీ అభిప్రాయాలలో మార్పు వచ్చింది. కుల నిర్మూలన జరగాలని ఆయన ఆశించారు. ప్రముఖ సోషలిస్టు నేత మధులిమాయే తన ‘అంబేడ్కర్ ద పయనీర్’లో అంబేడ్కర్ అభిప్రాయాలను గాంధీజీ గౌరవించారని, వర్ణ వ్యవస్థపై తన అభిప్రాయాలు మార్చుకొన్నారని రాశారు. కమ్యూనల్ అవార్డు ద్వారా దళితులకు విడి నియోజకవర్గాల ఏర్పాటుపై అంబేడ్కర్, గాంధీలు విభేదించారు. దళిత నియోజకవర్గాలకు వ్యతిరేకంగా గాంధీ నిరాహారదీక్ష చేశారు. కానీ, ఆ తర్వాత ‘పూనా ఒడంబడిక’ కుదిరిందని విస్మరించలేం. అంబేడ్కర్‌తో విభేదించినా గాంధీజీ ఆయన పట్ల అపార అభిమానం, గౌరవం చూపారు. నెహ్రూ తొలి మంత్రివర్గంలో అంబేడ్కర్ న్యాయశాఖ మంత్రి బాధ్యతలు స్వీకరించడానికి గాంధీయే కారణం. గాంధీజీ సలహామేరకే అంబేడ్కర్ రాజ్యాంగ ముసాయిదా కమిటీకి చైర్మన్ కాగలిగారు. ‘‘దళితులు గాంధీజీకి అత్యంత సన్నిహితులు, ప్రియమైన వారు... మనం ఆయనను సరిగా అర్థం చేసుకోలేకపోయాం’’ అని తర్వాతి కాలంలో అంబేడ్కర్ అన్నారు.
 
 అంబేడ్కర్, నెహ్రూలు కలసి పనిచేశారు
 బీజేపీ ప్రచారం చేస్తున్నట్లు అంబేడ్కర్‌కు, కాంగ్రెస్‌కు మధ్య తారస్థాయి విభేదాలు, శత్రుత్వం ఎన్నడూ లేవు. పలు అంశాలపై ఏకాభిప్రాయం కుదరకపోయినా అంబేడ్కర్... నెహ్రూ తదితర కాంగ్రెస్ నేతలతో కలసి పనిచేశారు. 1946లో తూర్పు బెంగాల్ నుంచి కాన్‌స్టిట్యుయెంట్ అసెంబ్లీకీ ఎన్నికయిన అంబేడ్కర్.. దేశ విభజనతో తన స్థానాన్ని కోల్పోయారు. కానీ కాన్‌స్టిట్యుయెంట్ అసెంబ్లీలో అంబేడ్కర్ అవసరాన్ని  గ్రహించిన బాబూ రాజేంద్రప్రసాద్, నెహ్రూలు.. జీవీ మవలాంకర్‌కు బదులుగా అంబేడ్కర్‌కు అవకాశాన్ని కల్పించారు. ప్రధానిగా నెహ్రూ, కేంద్ర న్యాయశాఖ మంత్రిగా అంబేడ్కర్  హిందూ కోడ్ బిల్లు రూపకల్పనకు కలసి
  కృషి చేశారు. ఈ బిల్లు పార్లమెంట్‌లో వీగిపోయినప్పుడు అంబేడ్కర్ రాజీనామా చేశారు.
 
 సంక్షేమ రాజ్యస్థాపన, పేదలకు, దళితులకు భూపంపిణీ, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో కార్మిక, కర్షకులకు చట్టాల ద్వారా తగిన రక్షణ కల్పించాలన్న అంశాలలో వారిరువురూ చేసిన కృషి చరిత్రాత్మకమైనది. నెహ్రూ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ... అంబేడ్కర్ సూచించిన అతివాద, మితవాదాలకు భిన్నమైన మధ్య మార్గానికి ప్రతీకగా దళిత మేధావులు పేర్కొంటారు. ప్రధాని ఇందిరా గాంధీ చేపట్టిన బ్యాంకుల జాతీయీకరణ, ప్రభుత్వ రంగసంస్థలను బలోపేతం చేయడం, ఎస్సీ, ఎస్టీల రక్షణ చట్టాల అమలు, తదితర చర్యల వల్ల దళితులకు పెద్ద ఎత్తున విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. లౌకికవాదం, సామ్యవాదం పునాదులుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో పలువురు దళిత మేధావులు అత్యున్నత స్థాయికి ఎదిగారు. బాబూ జగ్జీవన్‌రామ్ మొదలుకొని షిండే, ఖర్గే వంటి వారు కేంద్రంలో కీలక పదవులు నిర్వహించారు. దామోదరం సంజీవయ్య ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా, జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశారు.
 
 దళిత వ్యతిరేకతే సంఘ్ మార్కు అంబేడ్కర్ వాదం!
 ఆర్‌ఎస్‌ఎస్, దాని నుంచి పుట్టిన జన్‌సంఘ్, బీజేపీలది ఆది నుంచీ ‘హిందుత్వ’ ఎజెండానే. అంబేడ్కర్ సిద్ధాంతాల మేరకు పనిచేస్తామని బీజేపి గతంలో ఎన్నడూ చెప్పలేదు. పైగా వాజ్‌పేయి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న అరుణ్ శౌరి... అంబేడ్కర్‌ను స్వార్థపరుడిగా, దేశభక్తి లేక కేవలం అధికారం కోసం వెంపర్లాడిన వ్యక్తిగా చిత్రీకరిస్తే  (వర్షిప్పింగ్ ఫాల్స్ గాడ్స్), బీజేపీ అగ్రనేతలెవ్వరూ శౌరి అభిప్రాయాలను మాటమాత్రంగానైనా ఖండిం చలేకపోయారు. ఇక, నేటి ప్రధాని నరేంద్ర మోదీ అంబేడ్కర్ చలవ వల్లే ప్రధానినయ్యానన్నారే తప్ప, రెండేళ్ల పాలనలో దళితులు, గిరిజనుల సామాజిక ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చే ఏ పథకాన్ని అమలు చేయడం లేదు. ఇద్దరు దళితులకే క్యాబినెట్ స్థాయి మంత్రి పదవులు ఇచ్చారు. కేంద్ర మంత్రి వర్గంలో ఎస్సీలకు ఇంత తక్కువ ప్రాతినిధ్యం గతంలో ఎన్నడూ లేదు. మోదీ మూడు బడ్జెట్‌లలోనూ ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా కేటాయించ వలసిన నిధుల్లోనూ కోత విధించారు.
 
 ప్రభుత్వ యంత్రాంగాన్ని కుదిస్తూ, ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నందువల్ల దళితులకు రిజర్వేషన్ల ద్వారా అందే ఉద్యోగాలూ దక్కడంలేదు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీల అభ్యు న్నతి కోసం కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాలపై నియంత్రణలు విధించారు. మోదీ తేవాలనుకున్న ‘భూసేకరణ చట్టం’ అమలైతే ఎక్కువగా నష్టపోయేది ఎస్సీ, ఎస్టీలే. మోదీ పాలనలో దళితులు, మైనార్టీలపై నేరాలు పెరిగిపోతున్నాయి.

బీజేపీ అధ్యక్ష స్థానాన్ని అందుకున్న పాపానికి బంగారు లక్ష్మణ్‌కు చేసిన అన్యాయాన్ని మరచిపోలేం. నిజానికి బీజేపీలో ఏ ఒక్క దళిత మేధావినీ ఎదగనీయలేదు. వాస్తవాలు ఇలా ఉండగా, అంబేడ్కర్‌కు వార సులం మేమే నంటూ రాజకీయలబ్ధి పొందాలని చూస్తున్న మోదీ వ్యూహం పూర్తిగా బెడిసికొట్టింది. బీజేపీ సెల్ఫ్‌గోల్స్‌లో ఇది తాజాది.
 వ్యాసకర్త ఏపీ శాసన మండలి ప్రతిపక్ష నేత  మొబైల్: 8106915555
 - సి. రామచంద్రయ్య

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement