అసెంబ్లీ ఆవరణలో రాజ్యాంగ నిర్మాత
అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన గవర్నర్
మండలి చైర్మన్, స్పీకర్ సహా అన్ని పక్షాల నేతలు హాజరు
పోటాపోటీగా జై తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాలు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఆవరణలో భవనానికి ఎదురుగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సోమవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ చక్రపాణి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్, ఉప సభాపతి భట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ పాల్గొన్నారు.
ఇంకా ఈ కార్యక్రమానికి మండలిలో అధికారపక్ష నేత, మంత్రి సి. రామచంద్రయ్య, మండలి, శాసనసభల్లో ప్రతిపక్ష నేతలు యనమల రామకృష్ణుడు, చంద్రబాబు, వైఎస్సార్‌సీపీ పక్ష నాయకురాలు వైఎస్ విజయమ్మ, టీఆర్‌ఎస్ ఎల్పీ నేత ఈటెల రాజేందర్, ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, సీపీఐ పక్ష నేత గుండా మల్లేశ్, బీజేపీ పక్ష నేత యెండల లక్ష్మీనారాయణ, సీపీఎం పక్ష నేత జూలకంటి రంగారెడ్డి, లోక్‌సత్తా ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ్, అసెంబ్లీ కార్యదర్శి ఎస్.రాజాసదారాం, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. గవర్నర్‌తో పాటు కార్యక్రమానికి హాజరైన వారందరూ అంబేద్కర్ విగ్ర హం వద్ద పుష్పగుచ్చాలుంచి నివాళులర్పించి.. గ్రూప్ ఫొటో దిగారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన వెంటనే అక్కడున్న వారు ‘జోహర్ అంబేద్కర్’, ‘అమర్ రహే అంబేద్కర్’ అంటూ నినాదాలు చేశారు.
ఇవి అలా పూర్తయ్యాయో లేదో తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు ‘జై తెలంగాణ’ అని నినాదాలు చేయగా, సీమాంధ్ర ఎమ్మెల్యేలు ‘జై సమైక్యాంధ్ర’ అంటూ పోటీగా నినాదాలు చేశారు. అనంతరం శాసనసభ లాంజ్‌లో ఏర్పాటు చేసిన తేనీటి విందులో నేతలంతా పాల్గొన్నారు. అక్కడ మండలి చైర్మన్ చక్ర పాణి మాట్లాడుతూ సభాపతి స్థానంలో ఉన్న వారు తక్కువ మాట్లాడి, సక్రమంగా జడ్జిమెంట్ చేయాలన్నారు. వెంటనే జోక్యం చేసుకున్న చంద్రబాబు ఇపుడు పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా ఉందన్నారు. గవర్నర్ మాట్లాడుతూ విభజన బిల్లుపై చర్చలో నన్ను భాగస్వామిని కానివ్వరా అని నవ్వుతూ వ్యాఖ్యానించారు. గవర్నర్ పక్కనే ఉన్న ఒకరు మీరు ఉభయ సభల్లో సభ్యులు కాదని నవ్వుతూ సమాధానమిచ్చారు.
చంద్రబాబు వెంటనే స్పందిస్తూ, మీరు రాజ్యాంగానికి అధిపతి అని అనడంతో గవర్నర్ నవ్వుతూ, నాకు ప్రతిపక్షం మద్దతు లభించిందని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. విగ్రహావిష్కరణ అనంతరం స్పీకర్ మనోహర్ మీడియాతో మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ఎమ్మెల్యేలు పనిచేస్తారనే ఉద్దేశంతోనే రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. విగ్రహంలో చిన్న చిన్న లోపాలుంటే పట్టించుకోవద్దని, స్ఫూర్తిని మాత్రమే తీసుకోవాలన్నారు. విప్ ఆరేపల్లి మోహన్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహంలో కొన్ని లోపాలున్నాయని స్పీకర్, సీఎంల దృష్టికి తీసుకెళ్లామన్నారు. టీడీఎల్పీ ఉప నేత మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ.. శాసనసభ ఆవరణలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు.