హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ, మండలి బడ్జెట్ సమావేశాలు మార్చి ఐదో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ మంగళవారం జారీ చేసిన నోటిఫికేషన్‌లో ఈ విషయాన్ని పేర్కొన్నారు.
మార్చి ఐదో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభమవుతాయి. మార్చి 5 నుంచి 31వ తేదీ వరకూ ఉభయ సభలు సమావేశం కానున్నాయి. మార్చి 12న శాసనసభలో ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్‌ను, 14వ తేదీన వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు.