
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం రోజున ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహాన్ చేసిన ప్రసంగంపై రాజధాని రైతులు మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చివరకు గవర్నర్ చేత కూడా అబద్ధాలు చెప్పించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి చేసిన ప్లాట్లను ప్రభుత్వం తమకు ఇచ్చినట్టు గవర్నర్ ప్రసంగంలో చెప్పారని.. తమకు ఇవ్వాల్సిన ప్లాట్లు ఎక్కడ అభివృద్ధి చేసి ఇచ్చారో చూపించాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. రాజధాని భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం తప్ప చంద్రబాబు రైతులకు చేసింది ఏమి లేదని అన్నారు. రాజధాని ప్రాంతంలో గవర్నర్ కనీసం ఒక్కరోజైనా పర్యటించాలని విజ్ఞప్తి చేశారు. గవర్నర్ పర్యటిస్తే.. చంద్రబాబు ప్రభుత్వం నాలుగేళ్లలో ఏం చేసిందో అర్ధమవుతుందని, వాస్తవాలు వెలుగుచూస్తాయని రాజధాని రైతులు పేర్కొన్నారు.