
సర్ ఆర్ధర్ కాటన్ చిన్నతనంలో అన్నయ్యతో కలిసి వీథిలో వెడుతుండగా పెద్ద వర్షంపడి అక్కడక్కడా పెద్ద మడుగులు కట్టింది. ‘ఇంటికి త్వరగా వెడదాం’ అని అన్నయ్య తొందరపెడుతున్నా కాటన్ ఒక పెద్ద మడుగు దగ్గర ఆగి... ఒకపుల్ల తీసుకుని పల్లంవైపున్న చిన్న చిన్న గుంటలలోకి ఆ మడుగు నీటిని మళ్ళించాడు.
తమ్ముడి నిశిత దృష్టిని గమనించిన అన్న ఇంటికి తిరిగివచ్చిన తరువాత వారి తండ్రికి కాటన్ చేసిన పనిని ప్రశంసాపూర్వకంగా చెప్పాడు. ఆయన కుమారుడిని నీటిపారుదల శాస్త్రంలో ఇంజనీరును చేసారు. ఆ మహానుభావుడే తరువాత కాలంలో ధవళేశ్వరం దగ్గర గోదావరిపై ఒక గొప్ప ఆనకట్ట కట్టి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో లక్షల ఎకరాల్లో బంగారం పండడానికి కారణమయ్యాడు.
ఆనకట్ట కట్టడానికి ముందు గోదావరీ పరీవాహక ప్రాంతంలోని అరణ్యమంతా సర్వే చేయడానికి ఎవరూ ముందుకు రాకపోతే కాటన్ తానే గుర్రం ఎక్కి స్వయంగా సర్వేకు పూనుకున్నాడు. మార్గమధ్యంలో దోమలు కరిచి మలేరియా సోకితే ఇంటికి వెళ్ళి కోలుకున్న అనంతరం తిరిగొచ్చి సర్వే కొనసాగించాడు. రాత్రిళ్ళు సమీప గ్రామస్థులందరినీ సమావేశపరచి ‘రూపాయికి బదులు పావలానే తీసుకోండి. శ్రమపడండి. నాలుగేళ్ళు చాలు.
ఆనకట్ట వస్తే మీ జీవితాలు బంగారమయిపోతాయి. వెయ్యిరూపాయల పొలం లక్ష రూపాయలు పలుకుతుంది’ అని నచ్చచెప్పి ఆనకట్ట కట్టాడు. ఈవేళ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జరుగుతున్న వ్యవసాయంవల్ల వస్తున్న కొన్ని లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఎవరి త్యాగ ఫలితం అంటే వినిపించేది ఒక్క పేరే–సర్ ఆర్ధర్ కాటన్. అందుకే ఈ రెండు జిల్లాల్లో ఎక్కడికి వెళ్ళినా ఆంజనేయ స్వామి విగ్రహాలు ఎన్ని కనిపిస్తాయో మీకు గుర్రంమీద కూర్చుని ఉన్న కాటన్ విగ్రహాలు అన్ని కనబడతాయి. అది ఈ జాతి కృతజ్ఞత.
అంటే విద్యార్థిగా నువ్వొక లక్ష్యం పెట్టుకో. ఏ లక్ష్యం లేకుండా గడ్డిపరకలా బతకొద్దు. ఇది నామాట కాదు. కలాంగారి ఆవేదన. ‘‘నేను యుక్తవయస్సులో ఉన్నప్పుడు ఉన్న శక్తి ఇప్పుడు లేదు. అప్పుడు చేసిన మంచి పనులు, అప్పుడు చదివిన చదువే ఆధారంగా జీవితం కొనసాగుతున్నది. అప్పుడు చదువుకుని ఉండకపోతే ఇలా నేను మీ ముందుకు వచ్చే సాహసం చేయగలిగి ఉండేవాడిని కాదు. శక్తి నిరుపయోగం కాకుండా ఉండాలంటే ఒక లక్ష్యం ఉండాలి. ఏ లక్ష్యమయినా అలవోకగా సాధించలేం. అందుకే కలాం గారు –‘చిన్న లక్ష్యాన్ని పెట్టుకోవడం నేరం అని నాకు అర్థమయింది’ అని అన్నారు. పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుంటేనే ఎక్కువ శ్రమచేసి దానిమీద దృష్టి పెట్టుకోగలుగుతారు.
రాముడూ లేస్తాడు ఉదయాన్నే, రావణాసురుడూ లేస్తాడు ఉదయాన్నే. రావణాసురుడు లేచి పరస్త్రీ వ్యామోహంలో వెడితే, రాముడు దైవకార్యం చేయడానికి వెడతాడు. అందుకే అలారం పెట్టుకోని నీవు ఎప్పుడు లేచావన్నది కాదు, లేచి ఏం చేసావన్నదే ముఖ్యం.‘నేనిది అయి తీరుతాను’ అని ఒక లక్ష్యంపెట్టుకోవడం ఒక ఎత్తు.
దృష్టి చెదరకుండా దాని వైపుగా మాత్రమే ప్రయాణించడం మరో ఎత్తు. లక్ష్యం దిశగా నీ ప్రయాణం ముందుకు సాగకుండా వెనక్కి లాగేవి రెండు ఉంటాయి. వాటిలో ఒకటి అహిత శత్రువు, అంటే శత్రువు నీకు కనబడడు. కానీ పక్కన చేరి పాడు చేస్తుంటాడు. అంటే ఎంతో స్నేహితుడిలాగా కనబడతాడు. కానీ కుట్రలు చేస్తుంటాడు. నీవది గ్రహించే సరికి పుణ్యకాలం దాటిపోతుంది.
- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment