తప్పుచేసినా అతిథి అతిథే! | Devotional information by Chaganti Koteswara Rao | Sakshi
Sakshi News home page

తప్పుచేసినా అతిథి అతిథే!

Apr 29 2018 12:49 AM | Updated on Apr 29 2018 12:49 AM

Devotional information by Chaganti Koteswara Rao - Sakshi

రామాయణం యుద్ధకాండలో...రావణ సంహారం అయింది.  శుభవార్త చెప్పడానికి వెళ్ళిన హనుమ సీతమ్మతో..‘‘.....అమ్మా ! ఆనాడు నేను వచ్చినప్పుడు ఈ రాక్షస స్త్రీలు నిన్ను ఎంత బాధపెట్టారో గుర్తుందా అమ్మా...అనుజ్ఞ ఇయ్యి. వీరందరినీ పిడికిలిపోట్లతో చంపేస్తానమ్మా..’’అన్నాడు. దానికి ఆమె అందికదా...‘‘నీ ప్రభువు చెప్పింది నీవు చేసావు, వాళ్ళ ప్రభువు చెప్పింది వాళ్ళు చేసారు. వాళ్ళనెందుకు చంపడం? మరొక్కమాట విను..

‘‘వెనకటికి ఓ వేటగాడు అరణ్యంలోకి వెళ్ళాడు. పెద్దపులి తరిమింది. భయంతో పరుగెత్తుతూ దారిలో ఓ చెట్టు కనిపిస్తే పెద్దపులి ఎక్కలేదుకదా అనుకుని అది ఎక్కేసాడు. తీరా పైకి వెళ్ళి చూసే సరికి అక్కడ ఓ భల్లూకం(ఎలుగుబంటి)ఉంది. దానిని చూసి వణికిపోతుంటే అది అంది కదా..‘‘తెలిసో తెలియకో ప్రాణభయంతో పరుగెత్తుకొచ్చి నేనున్న చెట్టెక్కావు. కాబట్టి నీవు నాకు అతిథివి. నిన్ను కాపాడడం నా కర్తవ్యం. నువ్వలాకూర్చో’’ అంది. వేటగాడు సేదదీరుతుంటే కింద ఉన్న పెద్దపులి –‘‘వాడు మనుష్యుడు. పైగా వేటగాడు. బాణం వేసి కొడతాడు. ఇప్పుడు మనకు చిక్కాడు. మనం ఇద్దరం జంతువులం. వాడిని కిందకు తోసెయ్‌. నేను తిని వెళ్ళిపోతాను. నీజోలికి రాను’’ అంది.

దానికి భల్లూకం బదులిస్తూ–‘‘తెలిసో తెలియకో నేనున్న చెట్టుదగ్గరికి ప్రాణ భయంతో వచ్చాడు కనుక అతను నాకు అతిథి. నేను రక్షణ కల్పిస్తాను తప్ప కిందకు తోసి వేయను’’ అని అంది. కాసేపయిన తరువాత భల్లూకానికి నిద్ర వచ్చింది. నిద్ర పోతోంది. పెద్దపులి అంది కదా – ‘‘అది భల్లూకం. నిద్రలేస్తే దానికి ఆకలివేస్తుంది. అప్పుడిక వెనకాముందూ చూడదు. నిన్ను చంపేస్తుంది. నా మాట విను. దానిని కిందకు తోసెయ్‌. నేను దానిని తిని వెళ్ళిపోతాను. అదెలాగూ చచ్చిపోతుంది, నేనూ ఉండను కాబట్టి నువ్వు నిశ్చింతగా చెట్టుదిగి వెళ్ళిపో..’’ అంది. మనుష్యుడు భల్లూకాన్ని కిందకు తోసేశాడు. అది కిందకు పడిపోయే సమయంలో అలవాటు ప్రకారం కింద కొమ్మల్లో ఒక కొమ్మను పట్టుకుని మళ్ళీ పైకి ఎగబ్రాకింది. వెళ్ళి మనుషుడి పక్కన కూర్చుంది.

పెద్దపులి వెంటనే – ‘‘చూసావా మనుష్యుడి కౄరప్రవృత్తి. నువ్వు నిద్రపోతుంటే నిన్ను తోసేయబోయాడు. అదృష్టం బాగుండబట్టి కొద్దిలో తప్పించుకున్నావు. ఇప్పటికయినా నా మాట విను. మనుష్యుణ్ణి తోసెయ్‌. నేను నిన్ను వదిలేస్తా. మనుష్యుడిని తినేస్తా.’’ అంది. వేటగాడు వణికిపోతున్నాడు... ఇంతలో భల్లూకం అంది కదా..‘‘వాడు కృతఘ్నుడే కావచ్చు. తప్పే చేయవచ్చు. కానీ నా ఇంటికి వచ్చి ఉన్నంతసేపు నా అతిథి. వాడిని తోసేయలేను.’’ అంది.

‘‘హనుమా! నోరులేని ఒక కౄరజంతువు తన దగ్గరకు వచ్చిన వాడిని, పైగా తప్పు చేసిన వాడిని కాపాడింది. మనుష్య స్త్రీగా ప్రవర్తిస్తున్న దానిని, రామచంద్రమూర్తి ఇల్లాలిని, ధర్మం తెలిసున్న దాన్ని.  నన్ను బాధపెట్టారన్న కారణంతో రాక్షస స్త్రీలను నీకు అప్పచెప్పనా? వాళ్ళు నా అతిథుల్లాంటి వాళ్ళు. కాపాడతా’’ అంది. అతిథి ప్రాముఖ్యతను వెల్లడిస్తూ రామాయణం మనకు అమూల్యమైన చాలా సందేశాల నిచ్చింది.

- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement