177 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన దక్షిణమధ్య రైల్వే
ప్రయాగ్‌రాజ్, అయోధ్య,వారణాసి ప్యాకేజీలతో ట్రావెల్స్ సంస్థలు
భారీగా పెరిగిన విమాన చార్జీలు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద వేడుకైన మహాకుంభమేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివెళ్లనున్నారు. ఈ మేరకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. సంక్రాంతి (Sankranti) వేడుకలు, శబరిమల సందర్శన కూడా ముగియడంతో భక్తజనం కుంభమేళాకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ మేరకు టూర్స్, ట్రావెల్స్ సంస్థలు, పర్యాటక సంస్థలు ప్రత్యేక ప్యాకేజీలతో భక్తులను ఆకట్టుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి 10 లక్షల మందికిపైగా వెళ్లనున్నట్లు అంచనా. మరోవైపు కుంభమేళా (Kumbh Mela) కోసం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం రైల్వే శాఖ 3 వేల ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయగా, తెలుగు రాష్ట్రాల నుంచి రాకపోకలు సాగించే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే 177 రైళ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. రెగ్యులర్ రైళ్లకు అదనపు బోగీలను జత చేస్తున్నట్లు అధికారులుమ తెలిపారు. బస్సులు, రైళ్లు, విమానాలతోపాటు సొంత వాహనాల్లోనూ జనం పెద్ద ఎత్తున తరలి వెళ్లనున్నారు.
ఒక్కరికి రూ.45 వేల పైనే...
భక్తులు మహాకుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానం ఆచరించడాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఈ మేరకు 10 నుంచి 20 మంది దంపతులు కలిసి ఒక బృందంగా మహాకుంభమేళాకు (Maha Kumbh Mela) వెళ్తున్నట్లు హిమాయత్‌నగర్‌కు చెందిన ఒక ట్రావెల్స్ సంస్థ ప్రతినిధి తెలిపారు. ఇలా వచ్చేవారి కోసం మినీబస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కనీసం వారంపాటు కొనసాగనున్న ఈ పర్యటనలో మహాకుంభమేళాతోపాటు అయోధ్య, వారణాసి తదితర పుణ్యక్షేత్రాలను కూడా సందర్శిస్తారు. ఇందుకనుగుణంగా ప్యాకేజీలను సిద్ధం చేస్తున్నారు. కొన్ని సంస్థలు భోజనం, వసతి, రవాణా తదితర సదుపాయాలతో కలిపి ప్యాకేజీలను అందజేస్తుండగా కొన్నిసంస్థలు హైదరాబాద్, విజయవాడ, (Vijayawada) విశాఖ తదితర నగరాల నుంచి కేవలం రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి.
హైదరాబాద్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లి తిరిగి వచ్చేందుకు టూరిస్ట్ బస్సుల్లో రూ.15 వేలకుపైగా చార్జీ విధిస్తున్నారు. అక్కడి నుంచి పలు పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు నాలుగు రాత్రులు, ఐదు పగళ్లకు కలిపి రూ.25 వేల చొప్పున ప్యాకేజీలు ఉన్నాయి. మహాకుంభమేళాకు వెళ్లేందుకు సగటున ఒక భక్తుడు రూ.45 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేయవలసి వస్తుంది. సాధారణ రోజుల్లో అయితే కేవలం రూ.20 వేలల్లోనే అయోధ్య, వారణాసి వంటి ప్రాంతాలను సందర్శించి వచ్చే అవకాశం ఉంటుందని సికింద్రాబాద్‌కు చెందిన ఒక ట్రావెల్స్ సంస్థ ప్రతినిధి మురళి తెలిపారు.
ఫ్లైట్ చార్జీ రూ.20 వేలు..
విమాన చార్జీలు కూడా చుక్కలను తాకుతున్నాయి. హైదరాబాద్ (Hyderabad) నుంచి వారణాసికి సాధారణ రోజుల్లో రూ.4 వేల నుంచి రూ.7 వేల వరకు చార్జీ ఉంటుంది. ఇది రూ.18 వేల నుంచి రూ.20 వేలకు పెరిగింది. అయినప్పటికీ టికెట్లు లభించడం లేదని పలువురు ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ప్రయాణికుల రద్దీ ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు విమాన చార్జీలు కూడా పెరగవచ్చని ట్రావెల్స్ సంస్థలు అంచనా వేస్తున్నాయి.
రైళ్లలో వంద శాతం ఆక్యుపెన్సీ
హైదరాబాద్‌తోపాటు వివిధ ప్రాంతాల నుంచి వారణాసి, లక్నో, రెక్సల్, పట్నా తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే రెగ్యులర్ రైళ్లలో ఫిబ్రవరి నెలాఖరు వరకు ఎలాంటి బుకింగ్ సదుపాయం లేదు. అన్ని రైళ్లలో రిగ్రేట్ దశకు చేరుకుంది. ప్రత్యేక రైళ్లన్నీ 90 శాతం నుంచి 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో ప్రత్యేక రైళ్లలోనూ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఏ రోజుకు ఆ రోజు అనూహ్యమైన డిమాండ్ కనిపిస్తోందని దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రయాణికుల డిమాండ్, రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇప్పటి వరకు 177 రైళ్లను అదనంగా ఏర్పాటు చేయగా, రానున్న రోజుల్లో మరిన్ని రైళ్లను నడిపేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు చెప్పారు.
చదవండి: జంట హత్యల కేసులో వీడిన మిస్టరీ
సొంత వాహనం సో బెటర్
రైళ్లు, బస్సులు, విమానాల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని కొంతమంది భక్తులు సొంత వాహనాల్లో వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆధ్యాత్మికయాత్రతో పాటు వారం, పది రోజులు నచ్చిన ప్రాంతాల్లో పర్యటించేందుకు అనుగుణంగా ప్రణాళికలను రూపొందించుకొని బయలుదేరుతున్నారు. ఫ్యామిలీ టూర్‌గా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
పక్కా ప్రణాళికతో వెళ్లండి
మహాకుంభమేళాకు ఇప్పటికే లక్షలాదిగా జనం తరలి వస్తున్నారు. ప్రయాగ్‌రాజ్‌కు వచ్చే దారాలన్నీ జనసంద్రంగా మారాయి. హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి వెళ్లేవారు ప్యాకేజీలపై స్పష్టమైన అవగాహనతో ప్రణాళికలు వేసుకోవడం మంచిది.
– హరికిషన్, వాల్మీకి టూర్స్ అండ్ ట్రావెల్స్
ఫ్లైట్లకు డిమాండ్ పెరిగింది
కొద్ది రోజులుగా ఫ్లైట్స్‌కు డిమాండ్ భారీగా పెరిగింది. బుకింగ్స్ కూడా లభించడం లేదు. ఫ్లైట్ బుకింగ్ కోసం వేచిచూడటం మంచిది. చార్జీల్లో హెచ్చుతగ్గులను గమనించి బుక్ చేసుకోవాలి.
– మురళి వడ్ల, టూరిస్ట్ ఆపరేటర్
Comments
Please login to add a commentAdd a comment