Telugu devotees
-
మహాకుంభమేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి 10 లక్షల మందికిపైగా భక్తులు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద వేడుకైన మహాకుంభమేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివెళ్లనున్నారు. ఈ మేరకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. సంక్రాంతి (Sankranti) వేడుకలు, శబరిమల సందర్శన కూడా ముగియడంతో భక్తజనం కుంభమేళాకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ మేరకు టూర్స్, ట్రావెల్స్ సంస్థలు, పర్యాటక సంస్థలు ప్రత్యేక ప్యాకేజీలతో భక్తులను ఆకట్టుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి 10 లక్షల మందికిపైగా వెళ్లనున్నట్లు అంచనా. మరోవైపు కుంభమేళా (Kumbh Mela) కోసం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం రైల్వే శాఖ 3 వేల ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయగా, తెలుగు రాష్ట్రాల నుంచి రాకపోకలు సాగించే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే 177 రైళ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. రెగ్యులర్ రైళ్లకు అదనపు బోగీలను జత చేస్తున్నట్లు అధికారులుమ తెలిపారు. బస్సులు, రైళ్లు, విమానాలతోపాటు సొంత వాహనాల్లోనూ జనం పెద్ద ఎత్తున తరలి వెళ్లనున్నారు. ఒక్కరికి రూ.45 వేల పైనే... భక్తులు మహాకుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానం ఆచరించడాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఈ మేరకు 10 నుంచి 20 మంది దంపతులు కలిసి ఒక బృందంగా మహాకుంభమేళాకు (Maha Kumbh Mela) వెళ్తున్నట్లు హిమాయత్‌నగర్‌కు చెందిన ఒక ట్రావెల్స్ సంస్థ ప్రతినిధి తెలిపారు. ఇలా వచ్చేవారి కోసం మినీబస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కనీసం వారంపాటు కొనసాగనున్న ఈ పర్యటనలో మహాకుంభమేళాతోపాటు అయోధ్య, వారణాసి తదితర పుణ్యక్షేత్రాలను కూడా సందర్శిస్తారు. ఇందుకనుగుణంగా ప్యాకేజీలను సిద్ధం చేస్తున్నారు. కొన్ని సంస్థలు భోజనం, వసతి, రవాణా తదితర సదుపాయాలతో కలిపి ప్యాకేజీలను అందజేస్తుండగా కొన్నిసంస్థలు హైదరాబాద్, విజయవాడ, (Vijayawada) విశాఖ తదితర నగరాల నుంచి కేవలం రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి.హైదరాబాద్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లి తిరిగి వచ్చేందుకు టూరిస్ట్ బస్సుల్లో రూ.15 వేలకుపైగా చార్జీ విధిస్తున్నారు. అక్కడి నుంచి పలు పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు నాలుగు రాత్రులు, ఐదు పగళ్లకు కలిపి రూ.25 వేల చొప్పున ప్యాకేజీలు ఉన్నాయి. మహాకుంభమేళాకు వెళ్లేందుకు సగటున ఒక భక్తుడు రూ.45 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేయవలసి వస్తుంది. సాధారణ రోజుల్లో అయితే కేవలం రూ.20 వేలల్లోనే అయోధ్య, వారణాసి వంటి ప్రాంతాలను సందర్శించి వచ్చే అవకాశం ఉంటుందని సికింద్రాబాద్‌కు చెందిన ఒక ట్రావెల్స్ సంస్థ ప్రతినిధి మురళి తెలిపారు.ఫ్లైట్ చార్జీ రూ.20 వేలు.. విమాన చార్జీలు కూడా చుక్కలను తాకుతున్నాయి. హైదరాబాద్ (Hyderabad) నుంచి వారణాసికి సాధారణ రోజుల్లో రూ.4 వేల నుంచి రూ.7 వేల వరకు చార్జీ ఉంటుంది. ఇది రూ.18 వేల నుంచి రూ.20 వేలకు పెరిగింది. అయినప్పటికీ టికెట్లు లభించడం లేదని పలువురు ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ప్రయాణికుల రద్దీ ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు విమాన చార్జీలు కూడా పెరగవచ్చని ట్రావెల్స్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. రైళ్లలో వంద శాతం ఆక్యుపెన్సీ హైదరాబాద్‌తోపాటు వివిధ ప్రాంతాల నుంచి వారణాసి, లక్నో, రెక్సల్, పట్నా తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే రెగ్యులర్ రైళ్లలో ఫిబ్రవరి నెలాఖరు వరకు ఎలాంటి బుకింగ్ సదుపాయం లేదు. అన్ని రైళ్లలో రిగ్రేట్ దశకు చేరుకుంది. ప్రత్యేక రైళ్లన్నీ 90 శాతం నుంచి 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో ప్రత్యేక రైళ్లలోనూ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఏ రోజుకు ఆ రోజు అనూహ్యమైన డిమాండ్ కనిపిస్తోందని దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రయాణికుల డిమాండ్, రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇప్పటి వరకు 177 రైళ్లను అదనంగా ఏర్పాటు చేయగా, రానున్న రోజుల్లో మరిన్ని రైళ్లను నడిపేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు చెప్పారు.చదవండి: జంట హత్యల కేసులో వీడిన మిస్టరీసొంత వాహనం సో బెటర్ రైళ్లు, బస్సులు, విమానాల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని కొంతమంది భక్తులు సొంత వాహనాల్లో వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆధ్యాత్మికయాత్రతో పాటు వారం, పది రోజులు నచ్చిన ప్రాంతాల్లో పర్యటించేందుకు అనుగుణంగా ప్రణాళికలను రూపొందించుకొని బయలుదేరుతున్నారు. ఫ్యామిలీ టూర్‌గా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.పక్కా ప్రణాళికతో వెళ్లండిమహాకుంభమేళాకు ఇప్పటికే లక్షలాదిగా జనం తరలి వస్తున్నారు. ప్రయాగ్‌రాజ్‌కు వచ్చే దారాలన్నీ జనసంద్రంగా మారాయి. హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి వెళ్లేవారు ప్యాకేజీలపై స్పష్టమైన అవగాహనతో ప్రణాళికలు వేసుకోవడం మంచిది. – హరికిషన్, వాల్మీకి టూర్స్ అండ్ ట్రావెల్స్ఫ్లైట్లకు డిమాండ్ పెరిగింది కొద్ది రోజులుగా ఫ్లైట్స్‌కు డిమాండ్ భారీగా పెరిగింది. బుకింగ్స్ కూడా లభించడం లేదు. ఫ్లైట్ బుకింగ్ కోసం వేచిచూడటం మంచిది. చార్జీల్లో హెచ్చుతగ్గులను గమనించి బుక్ చేసుకోవాలి. – మురళి వడ్ల, టూరిస్ట్ ఆపరేటర్ -
కిషన్‌రెడ్డి ఆదేశాలు.. హెలికాప్టర్లో తరలింపు
సాక్షి, న్యూఢిల్లీ: మానససరోవరం యాత్రంలో చిక్కుకున్న తెలుగు యాత్రికులను రక్షించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని నేపాల్‌లో ఉన్న భారత ఎంబసీ అధికారులను హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో ఎంబసీ అధికారులు రంగంలోకి దిగారు. ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా అక్కడ చిక్కుకున్న యాత్రికులను నేపాల్ రాజధాని ఖాట్మండూకు తరలిస్తున్నారు. మరోవైపు అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తన కార్యాలయానికి తెలియజేయాల్సిందిగా అధికారులను కిషన్‌రెడ్డి కోరారు. మానససరోవరం యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులకు.. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో గత ఐదురోజులుగా నరకయాతన అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 13న హైదరాబాద్‌కి చెందిన 40 మంది మానస సరోవర్ యాత్రకు వెళ్లారు. సదరన్ ట్రావెల్స్ ద్వారా యాత్రకు వెళ్లిన వీళ్లు.. చైనా నేపాల్ సరిహద్దు ప్రాంతమైన మానససరోవర్‌లో అనూహ్యంగా చిక్కుకుపోయారు. దీంతో గత నాలుగురోజులుగా బాహ్యప్రపంచాన్ని చూడలేని పరిస్థితుల్లో వీరు ఉన్నారు. హైదరాబాద్ వాసులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా ట్రావెల్ ఏజెన్సీ మాత్రం అస్సలు పట్టించుకోవడంలేదని తెలుస్తోంది. ఎన్ని విజ్ఞప్తులు చేసినా సదరన్ ట్రావెల్స్ నుంచి స్పందన లేదని యాత్రికులు ఆరోపించారు. తమ గోడను వివరిస్తూ వీడియో రికార్డ్ చేసి కుటుంబసభ్యులకు వీడియో ద్వారా వారి బాధలను తెలియజేసిన విషయం తెలిసిందే. -
సురక్షిత ప్రాంతాలకు యాత్రికులు
-
మానస సరోవరం: ముమ్మరంగా సహాయక చర్యలు!
ఢిల్లీ: మానస సరోవర యాత్రలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముమ్మర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన గ్రంధి సుబ్బారావు అనే తెలుగు యాత్రికుడు ప్రమాదవశాత్తూ మృతిచెందిన సంగతి తెల్సిందే. ఆయన మృతదేహాన్ని హిల్సా నుంచి సిమికోట్‌కు నేపాల్ అధికారులు తరలిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం లక్నో మీదుగా కాకినాడ తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మృతదేహాన్ని తర్వగా తరలించేందుకు నేపాల్ రాయబార కార్యాలయంతో ఏపీభవన్ అధికారులు సంప్రదింపులు చేపడుతున్నారు. కేరళకు చెందిన మరో యాత్రికుడు కూడా ఈ మానస సరోవర యాత్రలో ప్రమాదవశాత్తూ చనిపోయినట్లు తెలిసింది. యాత్రికులకు తరలించేందుకు అధికారులు ఏడు విమానాలను ఏర్పాటు చేశారు. సిమికోట్ నుంచి నేపాల్గంజ్కు 104 మంది యాత్రికుల తరలించారు. తెలుగువారి బాగోగులు తెలుసుకుని సహాయక చర్యలు చేపట్టేందుకు నేపాల్ గంజ్‌కు ఆంధ్రప్రదేశ్ భవన్ నుంచి ఒక టీంను ఓఎస్డీ రవి శంకర్ ఆధ్వర్యంలో బుధవారం పంపుతున్నామని ఏపీ భవన్ అధికారి డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. ఈ విషయమై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఢిల్లీలో మాట్లాడారు. మానస సరోవర యాత్రికులను సురక్షితంగా తరలించేందుకు అత్యవసర ఏర్పాట్లు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. హిల్సా బేస్ క్యాంప్ లో చిక్కుకున్న వారికి అవసరమైన వైద్య చికిత్స అందించాలన్నారు. మానస సరోవర యాత్రకు వెళ్లిన వారు సురక్షితంగా రావాలని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు. అమర్నాథ్ యాత్రలో అపశృతి అమర్నాథ్ యాత్రలో మంగళవానం అపశృతి చోటుచేసుకుంది. అమర్నాథ్ యాత్రకు వెళ్లిన పశ్చిమగోదావరి జిల్లా చాగల్లుకు చెందిన తోట రత్నం(72) అనే తెలుగు మహిళ గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటన బలకేజ్ బేస్ క్యాంప్‌లో జరిగినట్లు అధికారులు వెల్లడించారు. నాలుగు రోజుల క్రితమే రత్నం రాజమండ్రి వారితో కలిసి యాత్రకు వెళ్లినట్లు సమాచారం అందింది. రత్నం మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులకి అధికారులు సమాచారం అందించారు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతదేహాన్ని చాగల్లుకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. -
శబరిమలలో చిక్కుల్లోపడ్డ తెలుగు భక్తులు
ఉయ్యూరు (పెనమలూరు): శబరిమలలో తెలియక చేసిన తప్పు తెలుగు భక్తులను చిక్కుల్లోకి నెట్టింది. ఆలయంలోని ధ్వజస్తంభంపై వేసిన పూజాద్రవ్యాల వల్ల అపచా రం జరగడంతో కృష్ణా జిల్లాకు చెందిన భక్తుల్ని కేరళ పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు. శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో ఆదివారం బంగారు ధ్వజస్తంభ ప్రతిష్ట అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంట, పెద ఓగిరాలకు చెందిన దండమూడి లక్ష్మణ చౌదరి, దండమూడి వెంకట్రావ్, బొమ్మారెడ్డి సత్యనారాయణరెడ్డి, కట్టా సుధాకర్‌రెడ్డి, గుంటక ఉమామహేశ్వరరెడ్డి వెళ్లారు. వీరు తీసుకువెళ్లిన పూజా ద్రవ్యాలను ధ్వజస్తంభం ప్రతిష్టించకముందు భూమిలో వేయాలి. వీరు వెళ్లేసరికి ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించడంతో.. తమ వద్ద ఉన్న పూజా ద్రవ్యాలను వారు ధ్వజస్తంభంపై చల్లారు. దీంతో ఆ ప్రాంతంలో బంగారు తాపడం స్వల్పంగా దెబ్బతింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆ ఐదుగుర్నీ గుర్తించిన దేవస్థానం బోర్డు వారిని కేరళ పోలీసులకు అప్పగించింది. తమకు తెలియక చేశామని వేరు వేడుకున్నా ఫలితం లేకపోయింది. కాగా, దీనిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. -
వైభవంగా అయ్యప్ప మహాపూజ
భివండీ, న్యూస్‌లైన్ : శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి భక్త మండలి ఆధ్వర్యంలో పద్మనగర్‌లోని దత్తమందిరం ప్రాంగణంలో గురువారం రాత్రి అయ్యప్ప స్వామి మహాపూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. అయ్యప్పమాల ధరించిన తెలుగు భక్తులు నిత్యపూజలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా పడిపూజ, నిత్యానదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాలు అయ్యప్ప నామస్మరణతో మారుమోగి పోతున్నాయి. ఇదిలా వుండగా, మహాపూజలో భాగంగా సాయంత్రం 21 మంది చిన్నారులు గంగాజలంతో కూడిన కలశాలను తలపై పెట్టుకొని ఊరేగింపుగా వరాలదేవి మందిరం నుంచి బాలాజీ మందిర్, దత్తామందిర్ వరకు వెళ్లారు. తర్వాత శ్రీ గణపతి హోమం, దీపారాధన, శ్రీ అయ్యప్ప అర్చన, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అదేవిధంగా వివిధ భాషల్లో భజన కార్యక్రమాలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. రాత్రి 8 గంటలకు కట్టేకోల గురుస్వామి చేతులమీదుగా పడి పూజ , మహాపూజ నిర్వహించారు. ఈ మహాపూజకు వర్లీకి చెందిన శ్రీ అయ్యప్ప స్వామి సచ్చిదానంద భక్త సమాజానికి చెందిన పొట్టబత్తిని శ్రీహరి గురుస్వామి, చెంబూరులోని మణికంఠ సేవా సమితికి చెందిన ముక్కు శ్రీనివాస్ గురుస్వామి, శ్రీ అయ్యప్ప సేవాసమితికి చెందిన సురేష్ గురుస్వామి, శ్రీ వేంకటాచల అయ్యప్ప భక్త బృందానికి చెందిన గడ్డం లక్ష్మణ్ గురుస్వామి, శ్రీ తమిళ్ గణేశ్ మిత్ర మండలికి చెందిన లాల్ చంద్ గురుస్వామి, కామత్‌ఘర్‌కు చెందిన సంతోష్ బండారి గురుస్వామితో పాటు భివండి పట్టణవ్యాప్తంగా మాలధారణ చేసిన అయ్యప్ప భక్తులు, స్థానిక తెలుగు ప్రజలు వేల సంఖ్యలో హాజరయ్యారు. మహాపూజ అనంతరం స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. అనంతరం చేపట్టిన మహాప్రసాదం అన్నదానం కార్యక్రమంలో సుమారు ఐదు వేల మంది పాల్గొన్నారని అనుమండ్ల శ్రీహరి గురుస్వామి తెలిపారు.