వైభవంగా అయ్యప్ప మహాపూజ
భివండీ, న్యూస్‌లైన్ : శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి భక్త మండలి ఆధ్వర్యంలో పద్మనగర్‌లోని దత్తమందిరం ప్రాంగణంలో గురువారం రాత్రి అయ్యప్ప స్వామి మహాపూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. అయ్యప్పమాల ధరించిన తెలుగు భక్తులు నిత్యపూజలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా పడిపూజ, నిత్యానదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాలు అయ్యప్ప నామస్మరణతో మారుమోగి పోతున్నాయి.
ఇదిలా వుండగా, మహాపూజలో భాగంగా సాయంత్రం 21 మంది చిన్నారులు గంగాజలంతో కూడిన కలశాలను తలపై పెట్టుకొని ఊరేగింపుగా వరాలదేవి మందిరం నుంచి బాలాజీ మందిర్, దత్తామందిర్ వరకు వెళ్లారు. తర్వాత శ్రీ గణపతి హోమం, దీపారాధన, శ్రీ అయ్యప్ప అర్చన, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అదేవిధంగా వివిధ భాషల్లో భజన కార్యక్రమాలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. రాత్రి 8 గంటలకు కట్టేకోల గురుస్వామి చేతులమీదుగా పడి పూజ , మహాపూజ నిర్వహించారు.
ఈ మహాపూజకు వర్లీకి చెందిన శ్రీ అయ్యప్ప స్వామి సచ్చిదానంద భక్త సమాజానికి చెందిన పొట్టబత్తిని శ్రీహరి గురుస్వామి, చెంబూరులోని మణికంఠ సేవా సమితికి చెందిన ముక్కు శ్రీనివాస్ గురుస్వామి, శ్రీ అయ్యప్ప సేవాసమితికి చెందిన సురేష్ గురుస్వామి, శ్రీ వేంకటాచల అయ్యప్ప భక్త బృందానికి చెందిన గడ్డం లక్ష్మణ్ గురుస్వామి, శ్రీ తమిళ్ గణేశ్ మిత్ర మండలికి చెందిన లాల్ చంద్ గురుస్వామి, కామత్‌ఘర్‌కు చెందిన సంతోష్ బండారి గురుస్వామితో పాటు భివండి పట్టణవ్యాప్తంగా మాలధారణ చేసిన అయ్యప్ప భక్తులు, స్థానిక తెలుగు ప్రజలు వేల సంఖ్యలో హాజరయ్యారు. మహాపూజ అనంతరం స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. అనంతరం చేపట్టిన మహాప్రసాదం అన్నదానం కార్యక్రమంలో సుమారు ఐదు వేల మంది పాల్గొన్నారని అనుమండ్ల శ్రీహరి గురుస్వామి తెలిపారు.