జంట హత్యల కేసు.. 36 గంటల్లో పట్టేశారు | - | Sakshi
Sakshi News home page

జంట హత్యల కేసులో వీడిన మిస్టరీ

Jan 17 2025 10:04 AM | Updated on Jan 17 2025 3:48 PM

36 గంటల్లో పట్టేశారు..

36 గంటల్లో పట్టేశారు..

ముగ్గురు నిందితుల అరెస్టు

హత్య చేసి మధ్యప్రదేశ్‌కు పరారీ

హైదరాబాద్‌కు తీసుకువస్తున్న పోలీసులు

మణికొండ: పుప్పాలగూడలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో మిస్టరీ వీడింది. 36 గంటల్లో కేసును ఛేదించిన నార్సింగి పోలీసులు నిందితులను మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో గురువారం అరెస్టు చేశారు. రాజేంద్రనగర్‌ డీసీపీ శ్రీనివాస్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బిందు(25) అనే యువతి సెక్స్‌వర్కర్‌గా పని చేసేది. ఈ నేపథ్యంలో ఆమెకు రాహుల్‌కుమార్‌ సాకేత్‌ అనే యువకుడితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో రాహుల్‌ కుమార్‌ సాకేత్‌ వీడియో తీసేందుకు యత్నించాడు. అందుకు అభ్యంతరం చెప్పిన బింధు అతడితో గొడవ పడి అక్కడినుంచి వచ్చేసింది. 

ఈ విషయాన్ని అంకిత్‌ సాకేత్‌(27)కు చెప్పింది. దీంతో ఆగ్రహానికి లోనైన అంకిత్‌, రాహుల్‌ను మందలించాడు. ఈ కారణంగా వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తనను మందలించాడనే కోపంతో రాహుల్‌, అంకిత్‌ సాకేత్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయంలో తనకు సహాయం చేయాలని తన మిత్రులు రాజ్‌కుమార్‌ సాకేత్‌, సుఖేంద్ర కుమార్‌ సాకేత్‌లను కోరాడు. 

పథకం ప్రకారం ఈనెల 11న రాహుల్‌కుమార్‌ సాకేత్‌, అంకిత్‌తో పాటు తన స్నేహితులతో కలిసి మరోమారు బింధును తీసుకుని ఆటోలో పుప్పాలగూడలోని అనంత పద్మనాభస్వామి దేవాలయం గుట్టలపైకి వచ్చారు. సుఖేంద్రకుమార్‌ సాకేత్‌ బిందుతో కలిసి ఉండగా రాహుల్‌కుమార్‌, రాజ్‌కుమార్‌, అంకిత్‌ సాకేత్‌ను అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లి కత్తితో పొడిచి, బండ రాయితో మోది దారుణంగా హత్య చేశారు. ఈ సందర్భంగా అంకిత్‌ ఎదురుతిరగడంతో వారిద్దరికీ గాయాలయ్యాయి. అనంతరం ముగ్గురూ కలిసి బింధు వద్దకు వచ్చి ఆమెను తలపై బండరాయితో మోది హత్య చేశారు.

మధ్యప్రదేశ్‌కు పరార్‌
హత్య అనంతరం నిందితులు ముగ్గురూ మృతుల వద్ద ఉన్న సెల్‌ఫోన్లను తీసుకుని 12న తెల్లవారుజామున తమ స్వస్థలమైన మధ్యప్రదేశ్‌కు పారిపోయారు. 14న ఉదయం గుట్టపై మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. నిందితుల వద్ద ఉన్న మృతుల సెల్‌ఫోన్ల ఆధారంగా వారు మధ్యప్రదేశ్‌లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లిన ప్రత్యేక బృందం గురువారం వారిని అదుపులోకి తీసుకుంది. వారి నుంచి మృతుల సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిని స్థానిక కోర్టులో హాజరుపరచి ట్రాన్సిట్‌ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement