ముదిరిన కేబుల్‌ వార్‌ | cable war in deepens | Sakshi
Sakshi News home page

ముదిరిన కేబుల్‌ వార్‌

Published Wed, Apr 12 2017 11:17 PM | Last Updated on Tue, Aug 27 2019 5:55 PM

ముదిరిన కేబుల్‌ వార్‌ - Sakshi

ముదిరిన కేబుల్‌ వార్‌

- శిల్పా, ఏవీ సంస్థల ప్రతినిధులు వేర్వేరుగా విలేకరుల సమావేశాలు
- ఒకరిపై ఒకరు ఆరోపణలు
– ఉప ఎన్నికల నేపథ్యంలో వివాదం తీవ్రతరం
 
నంద్యాల: ఉప ఎన్నికల నేపథ్యంలో నంద్యాలలో కేబుల్‌ వార్‌ ముదిరింది. దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి వర్గానికి(ఏవీ) చెందిన డిజిటల్‌ టీవీ, మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి వర్గానికి చెందిన శిల్పా డిజిటల్‌ టీవీల మధ్య వివాదం తీవ్రమైంది. ఈ రెండు సంస్థలు పోలీసు, ఏపీ ట్రాన్స్‌కో, కోర్టులకే పరిమితమైన వివాదం ఉప ఎన్నికల నేపథ్యంలో తీవ్రమైంది. ఇరువర్గాల ప్రతినిధులు బుధవారం వేర్వేరుగా విలేకరుల సమావేశాలను ఏర్పాటు చేసి ఒకరినొకరు విమర్శించుకున్నారు. 
 
ఏపీ ఫైబర్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటు హక్కును దివంగత ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డికి దక్కింది. ఆయన సంస్థ ఫైబర్‌ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి పట్టణంలో కేబుల్‌ వైర్లను వేయడం మొదలు పెట్టింది. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫైబర్‌ నెట్‌వర్క్‌ మినహా విద్యుత్‌ స్తంభాలపై ఇతర సంస్థల కేబుల్‌ వైర్లు ఉండకూడదు. వీటిని తొలగించాలని ప్రభుత్వం విద్యుత్‌ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. కాని దీని వల్ల తాము ఉపాధిని కోల్పోతామని ఏపీ ఎంఎస్‌ఓలు హైకోర్టును ఆశ్రయించగా, యథాస్థితిని కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పట్టణ శివారులోని సుగాలిమెట్ట, పొన్నాపురం ప్రాంతాల్లో శిల్పా కేబుల్‌ నెట్‌వర్క్‌కు చెందిన వైర్లను లక్ష్మికాంతరెడ్డి, ప్రతాపరెడ్డి కత్తిరించారని ఎంఎస్‌ఓ బాలనరసింహుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్‌ పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. దీంతో ఏవీ, డీఎస్పీల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. డీఎస్పీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఏవీ ఆరోపించారు. ఈ నేపథ్యంలో శిల్పా, భూమా వర్గాలకు చెందిన కేబుల్‌ టీవీ ప్రతినిధులు వేర్వేరు మీడియా సమావేశాల్లో ఆరోపణలకు దిగారు. 
 
కేబుల్‌ చట్టం ప్రకారమే..
కేబుల్‌ చట్టం ప్రకారమే విస్తరణను, ప్రసారాలను చేపట్టామని శిల్పా కేబుల్‌ టీవీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జగదీశ్వరరెడ్డి తెలిపారు. కేబుల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్‌ యాక్ట్‌ 995లోని 4బీ ప్రకారం కేబుల్‌ ఆపరేటర్లకు ఉన్న విస్తరణకు సంబంధించిన మార్గదర్శక సూచనల ప్రకారమే ముందుకెళ్తున్నామన్నారు. కాని దీనిపై వివరణ ఇవ్వాలని రెండు వారాల గడువును ఏపీడీసీఎల్‌ జనరల్‌ మేనేజర్‌ అభ్యంతరం తెలిపారని చెప్పారు. దీనిపై ఆయన ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. దీంతో జనవరి 19న హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌కో ఉత్తర్వులు యథావిధిగా కొనసాగుతున్నాయన్నారు. కోర్టు కేబుల్‌ టెలివిజన్‌ చట్టం 4బీ ప్రకారం తాము కేబుల్‌ విస్తరణను చేపట్టామని, న్యాయపరమైన హక్కులు ఉన్నాయన్నారు. 
 
విస్తరణకు అనుమతి లేదు..
శిల్పా కేబుల్‌ టీవీ సంస్థ విస్తరణకు అనుమతి లేదని డిజిటల్‌ టీవీ మేనేజర్‌ జయచంద్రారెడ్డి, న్యాయవాది రాజేశ్వరరెడ్డి తెలిపారు. హైకోర్టు జారీ చేసిన స్టేటస్‌కో ఉత్తర్వుల ప్రకారం ఎవరూ ఎలాంటి విస్తరణ పనులను చేపట్టరాదన్నారు. కానీ శిల్పా టీవీ సంస్థ విస్తరణ చేపట్టడం చట్ట వ్యతిరేకమని, వెంటనే ట్రాన్స్‌కో, పోలీసు అధికారులు అడ్డుకోవాలని కోరారు. 
 
కేబుల్‌ వార్‌ ముదిరితే ముప్పే..
ఉప ఎన్నికల దృష్ట్యా కేబుల్‌ వార్‌ ముదిరితే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఇప్పటికే రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. కేవలం ఈ రెండు సంస్థలు, పోలీస్‌, ట్రాన్స్‌కో అధికారులకే పరిమితమైన ఈ వివాదానికి రాజకీయ రంగు పడటంతో సమస్య జఠిలమయ్యేలా ఉంది. ఉప ఎన్నికల్లో కేబుల్‌ వార్‌ ఎలాంటి వివాదాలు సృష్టించకుండా జిల్లా ఎస్పీ రవికృష్ణ, జిల్లా కలెక్టర్‌ విజయమోహన్‌ జోక్యం చేసుకొని చట్టం పరిధిలో సమస్యను పరిష్కరించాల్సి ఉంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement