మరో సర్కారీ హత్య.. పోలీసుల సాక్షిగా టీడీపీ నేతల కిరాతకం | TDP Leaders Assassinated Another YSRCP Leader At Nandyala District | Sakshi
Sakshi News home page

మరో సర్కారీ హత్య.. పోలీసుల సాక్షిగా టీడీపీ నేతల కిరాతకం

Published Mon, Aug 5 2024 3:27 AM | Last Updated on Mon, Aug 5 2024 3:27 AM

TDP Leaders Assassinated Another YSRCP Leader At Nandyala District

శ్రీశైలం నియోజకవర్గం సీతారామాపురంలో అతి దారుణంగా వైఎస్సార్‌సీపీ నేత హతం

ఎస్‌ఐ, కానిస్టేబుళ్ల కళ్లెదుటే సుబ్బరాయుడిని ఇంట్లో నుంచి బయటికి లాగి చంపిన వైనం

రాత్రి 9.30 గంటల నుంచే పోలీసులను అప్రమత్తం చేసిన మరో నేత జయనారపురెడ్డి

అదనపు బందోబస్తుకు విన్నవించినా పట్టించుకోని పోలీసు ఉన్నతాధికారులు.. ఊరంతా చూస్తుండగా ‘పచ్చ’ ముఠా విధ్వంసం.. పక్కా ప్రణాళికతోనే హత్య 

వీరు ఊరు దాటేంత వరకు గ్రామంలోకి రాని అదనపు పోలీసు బలగాలు.. చంపేందుకు ఎక్కువ మంది రావడంతో ఏమీ చేయలేకపోయామన్న పోలీసులు
అర్ధరాత్రి 12.20–12.30 గంటల మధ్య హత్య జరిగాక అదనపు బలగాల రాక

జిల్లా కేంద్రానికి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఘోరం

సాక్షి ప్రతినిధి కర్నూలు: నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామాపురంలో శనివారం అర్ధరాత్రి 12.20 గంటలకు టీడీపీ నేతలు పోలీసుల సమక్షంలో వైఎస్సార్‌సీపీ నేత పసుపులేటి సుబ్బరాయుడు అలియాస్‌ పెద్దన్న(65) ఇంట్లోకి వెళ్లి బయటకు లాగి.. కత్తులు, రాడ్లు, రాళ్లతో దాడి చేసి కిరాతకంగా హత్య చేశారు. పోలీసులు గుడ్లప్పగించి చూస్తుండగా సుబ్బరాయుడు అతి దారుణంగా ప్రాణాలు కోల్పోయాడు. హత్య జరిగే ప్రమాదముందని మూడు గంటల ముందే పోలీసులకు సమాచారం ఇచ్చినా, కనీస చర్యలు తీసుకోకపోవడంతో ఈ దారుణం చోటుచేసుకుంది. 

హత్య జరిగిన తీరు, ఘటన పూర్వాపరాలు నిశితంగా పరిశీలిస్తే ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహం, పోలీసుల వైఫల్యమే ఇందుకు కారణమని స్పష్టమవుతోంది. బాధితులు, స్థానికుల కథనం మేరకు.. సీతారామాపురంలో రాత్రి 9.45 గంటలకు టీడీపీ నేత శేఖర్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ నేత పెద్దిరెడ్డి ఇంటికి వెళ్లాడు. పెద్దిరెడ్డి ఇంట్లో లేకపోవడంతో మహిళలను ఇష్టానుసారం బూతులు తిట్టాడు. ఊళ్లో కేకలు వినపడటంతో వైఎస్సార్‌సీపీ నేత జయనారపురెడ్డి వెళ్లి మహిళలను దూషించడం సరికాదని చెప్పారు. దీంతో శేఖర్‌రెడ్డి వెనుదిరిగాడు. 

‘నారపురెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయాళ్ల కథ తేల్చాల్సిందే..’ అని ముఠాను పోగు చేశాడు. ఆ గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి నంద్యాలలో ఉంటే అతనికి సమాచారం ఇచ్చాడు. ఇదంతా గమనించిన జయనారపురెడ్డి.. ఎస్‌ఐ నాగేంద్ర ప్రసాద్‌కు ఫోన్‌ చేసి పరిస్థితి వివరించాడు. ఫోన్‌ చేసిన 40 నిమిషాలకు ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, హోంగార్డుతో అక్కడికి వచ్చారు. టీడీపీ నేతలు గుంపులు గుంపులుగా వచ్చి శేఖర్‌రెడ్డి ఇంటి వద్ద పోగవుతుండటాన్ని చూస్తూనే ఉన్నారు. ఇంతలోనే శ్రీనివాసరెడ్డి మూడు కార్లతో తన ఇటుకల ఫ్యాక్టరీ, గోడౌన్‌ సమీపానికి చేరుకున్నారు. 

జయనారపురెడ్డిని పథకం ప్రకారం పక్కకు పంపి.. 
ఎస్‌ఐ నాగేంద్రప్రసాద్‌.. జయనారపురెడ్డిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. మహానంది పోలీసుస్టేషన్‌కు వెళ్లి, అక్కడ ఫొటో దిగి తన వాట్సాప్‌కు పంపాలని చెప్పారు. ఇక్కడ ఇంత జరుగుతుంటే తాను పోలీస్‌స్టేషన్‌కు వెళ్లడం ఏంటని.. పోలీసు బందోబస్తును పిలిపించండని నారపురెడ్డి కోరాడు. ‘సీఐ, డీఎస్పీకి ఫోన్‌ చేసినా స్పందించడం లేదు.. నువ్వు స్టేషన్‌కు వెళ్లు.. నేను చూసుకుంటా’ అని ఎస్‌ఐ చెప్పడంతో ఐదుగురితో కలిసి జయనారపురెడ్డి మహానంది స్టేషన్‌కు వెళ్లి ఫొటో దిగి ఎస్‌ఐకి పంపారు. 

నారపురెడ్డి ఊరు దాటగానే బుడ్డారెడ్డి శ్రీనివాసరెడ్డి ముఠా ఒక్కసారిగా ఊళ్లోకి దూసుకొచ్చింది. శ్రీనివాసరెడ్డి, శేఖర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, పుల్లారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, లక్ష్మిరెడ్డితో పాటు 30 మంది నేరుగా సుబ్బరాయుడి ఇంటిపై పడ్డారు. తొలుత సుబ్బరాయడిని ఇంట్లోంచి బయటికి లాక్కొచ్చారు. అడ్డొచ్చిన భార్య సుబ్బమ్మపై రాడ్లతో దాడి చేసి గాయ పరిచారు. ఆమె చేయి, కాళ్లకు గాయాలయ్యాయి. 

పోలీసులు జోక్యం చేసుకోకూడదని బెదిరిస్తూ శ్రీనివాసరెడ్డి ముఠా విధ్వంసం సృష్టించింది. అప్పటికే ఊళ్లో వాళ్లంతా అక్కడికి చేరుకున్నారు. మరో వైపు పోలీసులు చూస్తూనే ఉన్నారు. అందరి కళ్లెదుటే సుబ్బరాయుడిని కత్తులతో పొడిచి.. రాడ్లు, రాళ్లతో కొట్టి అతి కిరాతకంగా చంపేశారు. అనంతరం శ్రీనివాసరెడ్డి ముఠా ఊరు దాటి వెళ్లిపోయింది.

హంతకులు పారిపోయాక స్పందిస్తారా?
ఊళ్లో ఏం జరుగుతుందో తెలీక జయనారపురెడ్డి మౌనంగా పోలీ­స్‌­స్టేషన్‌లో కూ­ర్చుని ఉన్నాడు. ఇంతలో సుబ్బ­రాయుడి కుమారుడు ప్రసాద్‌ ఫోన్‌ చేసి ‘నాన్న ఇంగ లేడు. వాళ్లు సంపేసినా­రు’ అని బోరున విలపించాడు. దీంతో అర్ధరాత్రి 12.59కి జయనారపురెడ్డి ఎస్పీ అదిరాజ్‌ సింగ్‌ రాణాకు ఫోన్‌ చేశాడు. ‘సీతారామాపురంలో టీడీపీ వాళ్లు దాడులు చేస్తు­న్నా­రని, చంపడానికి వచ్చారని 9.30 నుంచి ఎస్‌ఐకి చెప్పాం. సీఐ, డీఎస్పీకి కూడా చెప్పాం. బందోబస్తు పంపాలని కోరాం. అయినా పంపలేదు. మనిషిని చంపేశారు’ అని రోదించారు. 

జయనారపురెడ్డి అర్ధరాత్రి 1.02 గంటలకుకు మళ్లీ ఎస్పీకి ఫోన్‌ చేశాడు. శ్రీనివాసరెడ్డి కార్లు తమ ఇంటి ముందు నుంచి వెళుతున్నాయని, తన ఫోన్‌లోని సీసీ కెమెరాల ద్వారా చూస్తే తెలిసిందని వాళ్లు ఏ దారిలో వెళతారో కూడా చెప్పాడు. 1.08 గంటలకు మళ్లీ ఫోన్‌ చేసి, తాము ఎస్పీ ఆఫీసుకు వస్తున్నామని తెలిపారు. 3.18 గంటలకు మరోసారి ఫోన్‌ చేశాడు. 

హంతకుల ముఠా­లోని ‘రమణ’ అనే వ్యక్తిని పట్టుకున్నామని, వా­డిని అప్పగించడానికి ఎస్పీ ఆఫీసు వద్దకు వచ్చామని, బయటే ఉన్నామని చెప్పా­డు. 3.20 గంటలకు ఎస్పీ తిరిగి జయనారపురెడ్డికి ఫోన్‌ చేశారు. ‘రమణ’­ను 3వ పట్టణ పోలీస్‌స్టేషన్లో అప్పగించాలని చెప్పా­రు. పోలీసులపై నమ్మకం లేదని మీకు అప్పగిస్తామని జయనారపురెడ్డి చెప్పారు. దీంతో కొందరు పోలీసులు వచ్చి రమణను ఎస్పీ ఆఫీసులోకి తీసుకెళ్లారు.

నెత్తి నోరు కొట్టుకుని చెప్పా.. పట్టించుకోలేదు  
శనివారం రాత్రి 9.30 గంటలకు ఎస్‌ఐకి ఫోన్‌ చేశా.. ఎస్‌ఐ ముందే శేఖర్‌రెడ్డి మందిని గుంపు చేసినాడు. రాడ్లు తీసుకుని తిరుగుతున్నారు. బందోబస్తును పిలిపించు సార్‌ అని నెత్తి నోరు కొట్టుకుని చెప్పా.. సీఐ, డీఎస్పీ కూడా పట్టించుకోలేదు. నన్ను స్టేషన్‌కు వెళ్లి ఫొటో దిగి పంపమన్నారు. అలా ఎందుకు చెప్పాడో తెలీదు. నేను వెళ్లిన తర్వాత సుబ్బరాయుడిని చంపేశారని ఆయన కొడుకు ఫోన్‌ చేసి సెప్పి ఏడ్చాడు. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఈ హత్య జరిగి ఉండేది కాదు. 
– జయనారపురెడ్డి, వైఎస్సార్‌సీపీ నేత

హత్య విషయం ఎమ్మెల్యేకు ముందే తెలుసా? 
ఎన్నికల ఫలితాల తర్వాత చెప్పినట్లు ‘అందరి కథా తేలుస్తా.. చర్మం వలుస్తా.. ఎవ్వర్నీ వదిలేదే లేదు’ అని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి హెచ్చరించిన నేపథ్యంలో ఈ హత్య ఆయనకు తెలిసే జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యను నివారించేందుకు సమయం ఉన్నా బందోబస్తు రాకపోవడం.. సీఐ, డీఎస్పీ మిన్నకుండిపోవడం, ఒక మనిషిపై హత్యకు తెగిస్తుంటే ఎస్‌ఐ ఫైరింగ్‌ ఓపెన్‌ చేయక పోవడం.. ఇవన్నీ చూస్తుంటే ఒక పథకం ప్రకారం వ్యవహరించి ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డితో ప్రధాన నిందితుడు బుడ్డారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి(ఫైల్‌) 

ముందుగానే ఎందుకు బందోబస్తు పంపలేదు?
రాత్రి 9.30 గంటలకు గొడవ జరిగింది. జయనారపురెడ్డి పోలీసులకు అప్పుడే ఫోన్‌ చేసి చెప్పాడు. 10.10 గంటలకు ఎస్‌ఐ వచ్చాడు. ఎస్‌ఐ ముందే హత్యకు ప్రణాళికలు జరుగుతున్నా, ఎందుకు అదనపు బందోబస్తును పిలిపించలేకపోయాడు? సీఐకి విషయం తెలుసు. ఆపై డీఎస్పీ నోటీసుకు వెళ్లింది. అయినా ఎందుకు బందోబస్తు పంపలేదు? మూడు గంటల పాటు రాని బందోబస్తు 12.30 గంటలకు సుబ్బరాయుడు హత్య జరిగాక.. అదీ శ్రీనివాసరెడ్డి ముఠా ఊరు దాటిన తర్వాత మాత్రమే ఎందుకొచ్చింది? సీతారామాపురం నుంచి డీఎస్పీ, ఎస్పీ ఆఫీసుకు 12 కిలోమీటర్లు. 10 నిమిషాల్లో రావచ్చు. ఎందుకు 3 గంటల తర్వాత బందోబస్తు ఊళ్లోకి వచ్చింది? ఈ ప్రశ్నలకు పోలీసులు, ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement