మరోసారి డెడ్‌లైన్
-
ఈ నెల 31 నుంచి అనలాగ్ ప్రసారాలు బంద్
-
డిజిటలైజేషన్ చేయాలంటూ ఆదేశాలు
-
30శాతం మించని సెట్‌టాప్ బాక్సులు
-
ఈసారి ఉపేక్షించబోమన్న ప్రభుత్వం
సాక్షి, హన్మకొండ: కేబుల్ టీవీ అనలాగ్ ప్రసారాల డిజిటలైజేషన్ ప్రక్రియ ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా మారింది. కేబుల్ ప్రసారాలను అనలాగ్ పద్ధతి నుంచి డిజిటల్‌లోకి మర్చాలంటూ ప్రభుత్వం ఇంతకుముందు ఆదేశాలు జారీ చేసింది. అయితే అందుకు తగ్గట్లు ప్రజల్లో అవగాహన కల్పించడం, మాస్టర్ సిస్టమ్ ఆపరేటర్లను (ఎంఎస్‌ఓ) సిద్ధం చేయకపోవడంతో ఈ ప్రక్రియ వేగం పుంజుకోవడం లేదు. తాజాగా ఈ నెల 31లోగా కేబుల్ టీవీ ప్రసారాలన్నీ డిజిటలైజ్ చేస్తూ సెట్‌టాప్ బాక్సులు అమర్చుకోవాలంటూ జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశాలు జారీ చేశారు.
ముఫై శాతమే
కేబుల్ టీవీ డిజిటలైజేషన్ పరిధిలోకి ప్రస్తుతం వరంగల్ జిల్లాలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, నర్సంపేట, పరకాల, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి పట్టణాలు వస్తున్నాయి. వీటి పరిధిలో 1.62 లక్షల కేబుల్ టీవీ కనక్షన్లు ఉన్నాయి. గత ఆర్నెళ్ల కాలంగా సెట్ టాప్ బాక్సులను అమర్చే ప్రక్రియ కొనసాగుతోంది. గడువు పొడిగించినా సెట్ టాప్ బాక్సులు ఏర్పాటు చేసుకోవడానికి ప్రజల నుంచి ఆశించిన స్పందన లేదు. దీంతో ఇప్పటి వరకు కేవలం 30 శాతం కనెక్షన్లలకు సెట్ టాప్ బాక్సులు అమర్చి డిజిటలైజ్ చేశారు. రాబోయే ఏడు రోజుల వ్యవధిలో దాదాపు లక్ష కేబుల్ కనెక్షన్లకు సెట్‌టాప్ బాక్సులు అమర్చడం ఇబ్బందికరమైన వ్యవహరంగా మారనుంది.
మూగనోమే..
కేబుల్ టీవీ డిజిటలైజేషన్‌కు ఈ నెల 31 ఆఖరి గడువును కచ్చితంగా అమలు చేస్తామని జిల్లా యంత్రాంగం చెబుతుంది. దీని వల్ల ప్రస్తుతం ఉన్న అనలాగ్ కేబుల్ టీవీ ప్రసారాలు పూర్తిగా ఆగిపోతాయి. 31వ తేదీ అర్థరాత్రి నుంచి కేబుల్ ప్రసారాలు నిలిచిపోతే, వినియోగదారులకు ఇక్కట్లు తప్పేలా లేవు. కేబుల ప్రసారాలు ఆగిపోయిన పక్షంలో సెట్ టాప్ బాక్సులకు గిరాకీ పెరిగిపోతుంది. అయితే డిమాండ్‌కు తగ్గ రీతిలో ఎంఎస్‌ఓల దగ్గర సెట్‌టాప్ బాక్సులు లేవు.
ఏడునెలలుగా..
కేబుల్ టీవీ ప్రసారాలను క్రమబద్ధీకరించే ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతం అమలవుతున్న అనలాగ్ కేబుల్ టీవీ వ్యవస్థను డిజిటలైజ్ చేయాలని కేంద్ర ప్రసార, సమాచార శాఖ నిర్ణయించింది. ఈ మేరకు గత ఐదేళ్లుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో కేబుల్ టీవీ ప్రసారాలను డిజిటలైజ్ చేయాలంటూ అన్ని టీవీ ఛానల్స్ యాజమన్యాలకు కేంద్రం చివరి హెచ్చరికను 2015 డిసెంబరు 22న జారీ చేసింది. 2015 డిసెంబరు 31లోగా డిజిటలైజ్ చేయాలని హెచ్చరించింది. దీంతో జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఉన్న కేబుల్ టీవీ అనలాగ్ ప్రసారాల్ని ఒకేసారి డిజిటిలైజ్ చేయాల్సి వచ్చింది. దీంతో సెట్‌టాప్ బాక్సులకు అనూహ్యంగా డిమాండ్ పెరిగిపోయింది. డిమాండ్‌కు తగ్గ బాక్సులు లేని ఫలితంగా నిర్దేశించిన గడువులోగా కేబుల్ వ్యవస్థను డిజిటలైజ్ చేయడం సాధ్యం కాలేదు. దీంతో కేంద్రం మరో ఆర్నెళ్ల గడువు పొడిగించింది. ప్రస్తుతం ఈ గడువు ముగిసింది.
పట్టణం కేబుల్ టీవీ కనెక్షన్లు
జనగామ 9,364
నర్సంపేట 5,100
భూపాలపల్లి 8,959
మహబూబాబాద్ 7,516
పరకాల 3,093
గ్రేటర్ వరంగల్ 1,27,968
––––––––––––––––––––––