సెట్‌టాప్ బాక్స్ లేని టీవీలకు ప్రసారాలు బంద్
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పూర్తిస్థాయి డిజిటల్ కేబుల్ టీవీ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. అనలాగ్ పద్ధతిలో కొనసాగుతున్న ప్రసారాలు నిలిచిపోయాయి. ఫలితంగా గత రెండు మూడు రోజుల నుంచి సెట్‌టాప్ బాక్స్ లేని టీవీలు మూగబోయాయి. డిజిటల్ ప్రసారాల కోసం కేబుల్ టీవీలకు సెట్‌టాప్ బాక్స్ (ఎస్‌టీబీ) లేదా డీటీహెచ్ తప్పని సరిగా మారాయి. టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) డిజిటల్ పద్ధతిలో ప్రసారాల కోసం కేబుల్ టీవీలకు సెట్ టాప్ బాక్స్‌లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది.
ఇందుకోసం నాలుగు విడతలుగా గడువు కూడా విధించింది. ఉన్నత న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడంతో కేబుల్ టీవీలకు రెండు రకాల అనలాగ్, డిజిటల్ పద్ధతుల్లో ప్రసారాలకు వెసులుబాటు కల్పిస్తూ వచ్చింది. తాజాగా పూర్తిస్థాయి డిజిటలైజేషన్ ప్రక్రియ అమలులో భాగంగా మల్టీ సిస్టమ్ ఆపరేటర్ల (ఎమ్‌ఎస్‌ఓ)కు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో కేబుల్ టీవీలకు అనలాగ్ ప్రసారాలు పూర్తిగా నిలిచిపోగా, కేవలం డిజిటల్ ప్రసారాలు మాత్రమే అందుతున్నాయి.
పూర్తికాని డిజిటలైజేషన్...
నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోని కేబుల్ టీవీలకు డిజిటలైజేషన్ పూర్తి కాలేదు. ఫలితంగా సుమారు 20 శాతం కేబుల్ టీవీలు మూగబోయాయి. మొత్తం మీద 25 లక్షల టీవీ కనెక్షన్లు ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ (ఎంసీహెచ్) లెక్కల ప్రకారం కేబుల్ కనెక్షన్ల సంఖ్యలో సగానికి పైగా వ్యత్యాసం కనిపిస్తోంది. అధికారికంగా 10 లక్షలు మాత్రమే నమోదై ఉన్నట్లు సమాచార ప్రసార శాఖ గణాంకలు స్పష్టం చేస్తున్నాయి. నగరంలోని మొత్తం టీవీ కనెక్షన్లల్లో 80 శాతం వరకు డీటీహెచ్ కనెక్షన్లు కలిగి ఉన్నట్లు అంచనా. కేబుల్ ప్రసారాలు అందిస్తున్న సిటీ కేబుల్,హత్‌వే,డిజీ కేబుల్, ఆర్‌వీఆర్, భాగ్యనగర్, ఇన్ డిజిటల్ తదితర సంస్ధలు తమ ఆపరేటర్ల ద్వారా సుమారు 20 లక్షల వరకు సెట్‌టాప్ బాక్స్‌లు విక్రయించినట్లు సమాచారం. దీన్ని బట్టి మరో 20 శాతం వరకు కేబుల్ టీవీలకు సెట్‌టాప్ బాక్స్‌లు లేనట్లు తెలుస్తోంది. డిజిటల్ ప్రసారాలతో అవి కాస్తా మూగబోయాయి.