ధర్మవరంలో ‘కేబుల్’వార్
రెండు ఛానళ్ల నిర్వాహకుల మధ్య ఘర్షణ వాతావరణం
పోలీసులు ఓ వర్గం వారికి కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు
అడకత్తెరలో పోకచెక్కలా ఆపరేటర్లు
ధర్మవరం: అనంతపురం జిల్లా ధర్మవరంలో కొన్ని రోజులుగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ‘కేబుల్’ టీవీ వివాదం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. పరిస్థితి సద్దుమణిగేలా చూడాల్సిన పోలీసులు ఒక వర్గానికి మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి శనివారం కేబుల్ టీవీల వివాదాన్ని ఎస్పీ రాజశేఖర్ బాబు దృష్టికి తీసుకెళ్లారు. వివరాలిలా ఉన్నాయి..
గత సార్వత్రిక ఎన్నికలకు ముందునుంచే ధర్మవరం పట్టణంలో ఓ కేబుల్ టీవీ నడుస్తోంది. అయితే ఎన్నికల అనంతరం స్థానికంగా మరో వర్గం కూడా కేబుల్ వ్యవస్థను ప్రారంభించేందుకు రంగంలోకి దిగింది. ఈ క్రమంలో వారు ప్రస్తుతం నడుస్తున్న ఛానల్ కేబుల్ వైర్లను తొలగించి.. తమ వైర్లు ఏర్పాటు చేయడం ద్వారా కొత్తగా కనెక్షన్లు ఇస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి.
ఈ వ్యవహారంతో రెండు ఛానళ్ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తమ ఆపరేటర్లను గూండాలతో బెదిరిస్తున్నారంటూ ఓ ఛానల్ నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కూడా కొత్త ఛానల్ వారికి మద్దతుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రెండు వర్గాలూ పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేశాయి. అయితే పోలీసులు కనెక్షన్లు తొలగిస్తున్నవారిపై కాకుండా తమపైనే కేసులు నమోదు చేశారని పాత ఛానల్ నిర్వాహకులు తెలిపారు.
తాజాగా పాత ఛానల్‌లో పనిచేస్తే చంపుతామంటూ గుర్తుతెలియని వ్యక్తులు కొందరు తనను బెదిరించినట్టు టెక్నీషియన్ కాటమయ్య వాపోయాడు. శనివారం మధ్యాహ్నం దాదాపు 20 మంది వ్యక్తులు తన ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను తీవ్రస్థాయిలో దుర్భాషలాడటమేకాక.. తనకు ఫోన్ చేసి చంపుతామని.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించినట్లు ఆరోపించాడు. దీనిపై పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించలేదని చెప్పాడు.
రెండు కేబుల్ నెట్‌వర్క్‌ల మధ్య యుద్ధం ఆపరేటర్లకు ఇబ్బందికరంగా మారింది. ఇప్పటిదాకా కేబుల్ నిర్వహిస్తూ జీవనం వెల్లదీస్తున్న తమ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారిందని వాపోతున్నారు. కేబుల్ ప్రసారాలు అడ్డుకుని తమ కడుపు కొట్టొద్దని వేడుకుంటున్నా కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నట్టు చెబుతున్నారు. మరోవైపు ఈ వివాదంతో వినియోగదారులు సైతం ఇబ్బందులు పడుతున్నారు.
ఎస్పీ దృష్టికి తీసుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి
ధర్మవరంలో కేబుల్ టీవీల వివాదాన్ని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి శనివారం ఎస్పీ రాజశేఖర్ బాబు దృష్టికి తీసుకెళ్లారు. కొందరు దౌర్జన్యంగా వ్యవహరిస్తూ కేబుల్ ఆపరేటర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. ఎస్పీ స్పందిస్తూ.. పూర్తిస్థాయిలో విచారణ చేయించి సమస్యలు తలెత్తకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
విచారణ జరుగుతోంది
కేబుల్ టీవీల వివాదంపై పట్టణ డీఎస్పీ వేణుగోపాల్‌ను వివరణ కోరగా ‘పట్టణంలో జరుగుతున్న ‘కేబుల్’ సంబంధిత సంఘటనలపై ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకుంటున్నాయి. ఫిర్యాదులను విచారించి దోషులపై చర్యలు తీసుకుంటాం. శాంతి భద్రతలకు విఘాతం కల్గించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం..’ అని చెప్పారు.
- డీఎస్సీ వేణుగోపాల్