ధర్మవరంలో కూటమి నేతల బరితెగింపు, కరెంట్‌ తీగలతో.. | Conspiracy To Assassinate Ysrcp Leader Kamireddypalli Sudhakar Reddy | Sakshi
Sakshi News home page

ధర్మవరంలో కూటమి నేతల బరితెగింపు, కరెంట్‌ తీగలతో..

Published Tue, Nov 19 2024 9:20 AM | Last Updated on Tue, Nov 19 2024 11:33 AM

Conspiracy To Assassinate Ysrcp Leader Kamireddypalli Sudhakar Reddy

కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి

సాక్షి, సత్యసాయి జిల్లా: మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో రాజకీయ కక్షలు బయటపడ్డాయి. వైఎస్సార్ సీపీ నేత, ఉమ్మడి అనంతపురం జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి హత్య కుట్ర భగ్నమైంది.

కాంపౌండ్ వాల్ ఐరన్ డోర్‌కు విద్యుత్ తీగలు వేసిన టీడీపీ కూటమి నేతలు.. డోర్ తాకిన వెంటనే కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి చనిపోయేలా పన్నాగం పన్నారు. అయితే 33కేవీ విద్యుత్ తీగలకు బదులుగా.. ఫైబర్ కేబుల్‌కు కనెక్షన్ ఇవ్వడంతో ప్రమాదం తప్పింది. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి ప్రధాన అనుచరుడిగా కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. కామిరెడ్డిపల్లి పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.

కాగా, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత టీడీపీ నేతల దౌర్జన్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. అక్కడితో ఆగకుండా బాధితులపైనే కేసులు బనాయిస్తున్నారు. తాజాగా ఆదివారం రాత్రి పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువులో నిత్యం రద్దీగా ఉండే వైఎస్సార్, నెహ్రూ సర్కిళ్లతో పాటు ధర్మవరం బస్టాండ్‌ ప్రాంతంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులపై  టీడీపీ గూండాలు మూకుమ్మడిగా దాడి చేశారు. పోలీసులు చూస్తుండగానే... కొడపగానిపల్లికి చెందిన వినోద్‌కుమార్‌రెడ్డి, నరేంద్రరెడ్డి, హరిపై అకారణంగా కాళ్లతో, కర్రలతో విరుచుకు పడ్డారు. కొత్తచెరువుకు చెందిన టీడీపీ ముఖ్య నేత శ్రీనివాసులు ప్రత్యక్షంగా దాడుల్లో పాల్గొన్నట్లు బాధిత కార్యకర్తలు వాపోయారు.  

జడ్పీ వైస్ ఛైర్మన్ సుధాకర్ రెడ్డి హత్యకు కుట్ర

కొత్తచెరువు మండలం కొడపగానిపల్లికి చెందిన సోషల్‌ మీడియా కార్యకర్త ఈడిగ మారుతి రెండు రోజుల క్రితం సోషల మీడియాలో ఓ పోస్టును పెట్టారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ తీర్చిదిద్దిన ప్రభుత్వ బడి ఫొటోతో పాటు ఇటీవల ‘బడి వైన్స్‌’ పేరుతో తిరుపతిలో ప్రారంభించిన మద్యం దుకాణం ఫొటోను జతపరుస్తూ పోస్టు చేశారు. ఇందులో తప్పిదం ఏమీ లేకపోయినా... సీఎం చంద్రబాబు మద్యం పాలసీని తప్పు బట్టారని, ఆ పోస్టును తొలగించకపోతే కేసు పెడతామని స్థానిక టీడీపీ నేత శివయ్య బెదిరింపులకు దిగాడు. అంతటితో ఆగకుండా విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. అయితే ఇంత చిన్న విషయాన్ని రచ్చ చేయరాదని, కేసులు.. గీసులు ఏమీ వద్దని పోలీసులు నచ్చచెప్పారు. అదే సమయంలో ప్రశాంత మైన గ్రామంలో వర్గ కక్షలు ఉండరాదని భావించిన మారుతి కూడా ఆ పోస్టును తొలగించాడు. దీంతో అప్పటికి సమస్య సద్దుమణిగిందనుకున్నారు.  

అయినా కక్ష కట్టిన శివయ్య... మారుతి పోస్టును స్క్రీన్‌ షాట్‌ తీసి ఆదివారం కొత్తచెరువు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఒత్తిళ్లను తాళలేక మారుతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విషయం తెలుసుకున్న కొడపగానిపల్లికి చెంది వైఎస్సార్‌సీపీ నాయకులు వినోద్‌కుమార్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, హరి... కొత్తచెరువు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని మారుతీకి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చే విషయంగా పోలీసులతో చర్చించి ఆదివారం రాత్రి బయటకు వచ్చారు.

ఈ విషయం తెలుసుకున్న టీడీపీ ముఖ్య నేత శ్రీనివాసులు తన అనుచరులతో కలసి పథకం ప్రకారం కొత్తచెరువులోని ప్రధాన కూడళ్లలో వీధి లైట్లను ఆఫ్‌ చేయించి వినోద్‌కుమార్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, హరిపై దాడికి తెగబడ్డారు. చెప్పులు, కర్రలు, ముష్టిఘాతాలతో విరుచుకుపడ్డారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన హరి అనంతపురంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మిగిలిన ఇద్దరికి మూగ దెబ్బలయ్యాయి. ఘటనపై బాధితులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం మారుతిని సోమవారం పోలీసులు వదిలేశారు. 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement