దర్మవరంలో టీడీపీ నేత అరాచకం
తాను చెప్పినచోటే సచివాలయం నడవాలని హుకుం
ఫర్నీచర్, కంప్యూటర్లను దౌర్జన్యంగా తరలించిన వైనం
తమ వార్డు సచివాలయం కనపడటం లేదంటూ ప్రజల ఆవేదన
ధర్మవరం: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో టీడీపీ నాయకుల అధర్మ ప్రవర్తన రోజురోజుకు పెచ్చుమీరుతోంది. తాము చెప్పినచోటే సచివాలయం పనిచేయాలంటూ ఏకంగా కంప్యూటర్లు, ఫర్నీచర్‌ను తరలించేశారు. దీంతో ఆ సచివాలయం ఉద్యోగులు మరో వార్డు సచివాలయానికి వెళ్లి పనిచేస్తున్నారు. ధర్మవరం పట్టణంలోని 39వ వార్డులో ఈ దురాగతం జరిగి వారం రోజులైనా మున్సిపల్ అధికారులు స్పందించకపోవడం విమర్శనీయంగా ఉంది. 39వ వార్డు టీడీపీ ఇన్‌చార్జ్ కేతా శ్రీను కొద్దిరోజులుగా సచివాలయ సిబ్బంది తాను చెప్పినట్లుగానే వినాలంటూ తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నాడు.
వార్డులోని 37వ నంబరు సచివాలయాన్ని తాను చెప్పినచోటుకు మార్చాలని హుకుం జారీచేశాడు. అతడు చెప్పిన ప్రదేశం వార్డు ప్రజల రాకపోకలకు అనువుగా లేదు. దీంతో సచివాలయాన్ని ఉన్నచోటే కొనసాగించాలని స్థానిక బీజేపీ నాయకుడు జింకా చంద్రశేఖర్, వార్డు ప్రజలు కోరారు. అయినా తనమాటే చెల్లాలంటూ కేతా శ్రీను వారం రోజుల కిందట సచివాలయంలోని ఫర్నీచర్, కంప్యూటర్లు, ఇతర సామగ్రిని దౌర్జన్యంగా తీసుకెళ్లాడు. వాటిని మరో ఇంట్లో ఉంచి సచివాలయ సిబ్బంది అక్కడికొచ్చి పనిచేయాలని నిర్దేశించాడు. ఈ విషయాన్ని మునిసిపల్ కమిషనర్ ప్రమోద్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లిన సచివాలయ సిబ్బంది మూడురోజులు రామ్‌నగర్ సచివాలయం నుంచి పనిచేశారు.
తరువాత వార్డుకు రెండు కిలోమీటర్ల దూరంలో 40 వార్డులోని తారకరామాపురంలో ఉన్న 38వ నంబరు సచివాలయం నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. పనుల మీద ఇప్పటివరకు సచివాలయం ఉన్న చోటుకు వెళ్లిన ప్రజలు ‘ఇక్కడి మా సచివాలయం ఏది?’ అని ప్రశ్నిస్తున్నారు తనకు ప్రభుత్వం నుంచి ఆరునెలల అద్దె రావాల్సి ఉందని, కనీస సమాచారం ఇవ్వకుండా దౌర్జన్యంగా సచివాలయాన్ని ఖాళీచేయడం దారుణమని భవన యజమాని కడప రంగస్వామి ఆవేదన చెందుతున్నారు. ఈ విషయమై మునిసిపల్ కమిషనర్ ప్రమోద్‌కుమార్‌ను అడిగేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా.. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. బీజేపీకి చెందిన మంత్రి సత్యకుమార్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గ కేంద్రంలోనే టీడీపీ నేత ఇలా దౌర్జన్యంగా వ్యవహరిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment