కూటమి నేతల మధ్య ‘మట్టి’ రగడ | matti war in andhra pradesh | Sakshi

కూటమి నేతల మధ్య ‘మట్టి’ రగడ

Oct 28 2024 10:07 AM | Updated on Oct 28 2024 1:12 PM

matti war in andhra pradesh

ధర్మవరం మండలం రేగాటిపల్లిలో అక్రమంగా మట్టి తవ్వుతున్న టీడీపీ నాయకులు

తమ అనుమతి లేకుండా తవ్వకూడదని జనసేన నేత హుకుం

టీడీపీ నాయకుల జేసీబీ ధ్వంసం చేసిన జనసేన నాయకులు 

«సాక్షి టాస్క్‌ఫోర్స్‌: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో కూటమి నాయకుల మధ్య ‘మట్టి వార్‌’ తారాస్థాయికి చేరింది. ధర్మవరం మండలం రేగాటిపల్లిలో ఆదివారం మట్టిని అక్ర­మంగా తవ్వుతున్న టీడీపీ నాయకులకు చెందిన జేసీబీని జనసేన నాయకులు ధ్వంసం చేశారు. ఇక్కడ మట్టిని తాము తప్ప మరెవ్వరూ తవ్వ­కూడదని జనసేన నాయకులు హెచ్చరించినట్లు తెలిసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ధర్మవరం మండలం రేగాటిపల్లిలో జనసేనకు చెందిన ముఖ్య నేత ఆ«ధ్వర్యంలో జేసీబీ, హిటాచీ వాహనాలతో పెద్ద ఎత్తున అక్రమంగా మట్టి తవ్వి ట్రాక్టర్లు, టిప్పర్లలో ఇతర ప్రాంతాలకు తరలి­స్తున్నా­రు. రోజూ రూ.లక్షల్లో ఆదాయం గడిస్తు­న్నారు. 

మట్టి కోసం ఈ పంచాయతీ దరిదాపుల్లోకి ఇతరులె­వరినీ రానీయకుండా సదరు జనసేన నేత హుకుం జారీ చేస్తున్నారు. ఇదే పంచాయతీకి చెందిన పలువురు టీడీపీ నాయకులు తాము కూడా ఎన్నికల్లో కూటమి గెలిచేందుకు కృషి చేశామని, తామూ మట్టి తవ్వుకుంటామని పలుమార్లు జనసే­న కీలక నేతకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఆయన అంగీకరించలేదు. అయితే టీడీపీ నాయ­కులు ఆదివారం సొంతంగా జేసీబీతో రేగాటిపల్లి కొండ సమీపంలో మట్టి అక్రమ తవ్వకాలకు పూ­ను­కున్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన తమ పార్టీకి చెందిన పదిమందిని పంపి దౌర్జన్యం చేయించారు. మట్టి తవ్వుతున్న జేసీబీపై రాళ్ల వర్షం కురిపించి ధ్వంసం చేయించారు. ఇంత గొడ­వ జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించినట్లు సమాచారం. 

ఆ తర్వాత తీరిగ్గా రెండు వర్గాల మధ్య రాజీకి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. దీన్ని తీవ్ర అవమానంగా భావించిన టీడీపీ నాయ­కులు తమ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి అక్కడే ఈ మట్టి గొడవ తేల్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. కాగా, మంత్రి సత్యకుమార్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో యథేచ్ఛగా మట్టి, ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా, ఈ విషయంలో కూటమి నాయకులు గొడవపడుతున్నా పోలీస్, మైనింగ్‌ అధికారులు కనీసం పట్టించుకున్న పాపాన పోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement