కేబుల్ టీవీ ప్రసారాలపై పిల్ కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: కేబుల్ టీవీ ప్రసారాల రంగంలోకి అడుగుపెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరోధించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. టెలికాం అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సిఫార్సులు మాత్రమే పిటిషనర్ తన వాదనకు మద్దతుగా చూపారని, ఇతర బలమైన ఆధారాలు చూపలేదని తెలిపింది. ట్రాయ్ చేసినవన్నీ సిఫార్సులేనని, వాటిని అమలు చేయాలని చట్టంలో ఎక్కడా లేదని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
ట్రాయ్ సిఫారసులను ఆమోదించి చట్టం చేసి ఉంటే వాటిని అమలు చేయమని ఆదేశించేందుకు ఆస్కారం ఉండేదని తెలిపింది. ప్రభుత్వమే కేబుల్ నెట్‌వర్క్‌లోకి ప్రవేశిస్తే టీవీ ప్రసారాలు ఏకపక్షంగా ఉంటాయని, విపక్షాల గొంతు నొక్కే ప్రమాదం ఉందంటూ మంగళగిరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ పిల్‌ను దాఖలు చేశారు.