సాక్షి, తాడేపల్లి : అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ను ఆధారాలతో చూపించామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. రాజధాని పేరుతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. అమరాతిలో తన పేరిట భూములు ఉన్నాయనే తప్పుడు ప్రచారాన్ని ఆయన ఖండించారు. నీరుకొండలో తనకు ఐదు ఎకరాల భూమి ఉన్నట్టు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాలను తప్పుకుంటానని ఆర్కే సవాలు విసిరారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. రాజధానిలో తనపేరు మీద గానీ, తన భార్య పేరు మీద గానీ భూములు లేవని స్పష్టం చేశారు. తన భార్య పేరు మీద ఐదెకరాల భూమి ఉందని టీడీపీ నేత బోండా ఉమా ఆరోపిస్తున్నారని తెలిపారు. తమకు భూమి ఉందని చూపిస్తే ఆ ఐదెకరాలు వారికే రాసిస్తానని.. అంతేకాకుండా బహిరంగంగా క్షమాపణ చెప్తానని అన్నారు.
రామోజీ, రాధాకృష్ణ తెగ తాపత్రాయపడుతున్నారు..
తనను వివరణ అడగకుండానే పేపర్లలో తప్పుడు వార్తలు రాశారని మండిపడ్డారు. అవాస్తవాలు రాయవద్దని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను కోరారు. చంద్రబాబును కాపాడుకోవడానికి రామోజీరావు, రాధాకృష్ణ తెగ తాపత్రయపడుతున్నారని ఎద్దేవా చేశారు. లక్షల కోట్ల రూపాయల అవినీతి బయటపడుతుందనే కులం పేరుతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజధానిలో అవినీతి జరగలేదని చంద్రబాబు గుండెల మీద చేయ్యి వేసుకుని చెప్పగలరా అని ప్రశ్నించారు. రాజధానికి చంద్రబాబు శాపం అని.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వరం అని అన్నారు. చంద్రబాబు రూ. 5వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క శాశ్వత బిల్డింగ్ కూడా కట్టలేకపోయారని గుర్తుచేశారు.
గత ప్రభుత్వంలోని నేతలు రాజధాని ప్రాంతంలో కి.మీ రోడ్డు కోసం రూ. 40 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పి వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. రాజధానికి భూములు ఇవ్వని రైతులను అప్పటి మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ బెదిరించారని తెలిపారు. అక్రమంగా రైతులపై కేసులు పెట్టించారని విమర్శించారు. దళితుల భూములను కాజేసిన చంద్రబాబు వాటిని తన బినామీలకు కట్టబెట్టారని మండిపడ్డారు. చంద్రబాబు కొత్త బినామీ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అని అన్నారు. అర్ధరాత్రి కరకట్టకు వెళ్లి ప్యాకేజీ తెచ్చుకోలేదా అని పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు. మంగళగిరిలో జనసేన కూటమి అభ్యర్థుల తరఫున పవన్ ప్రచారం ఎందుకు చేయలేదని నిలదీశారు.
భువనేశ్వరి అప్పుడేందుకు రోడ్లపైకి రాలేదు..
చంద్రబాబు అవినీతికి పాల్పడినందుకే మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లో టీడీపీని ప్రజలు ఓడించారని అన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్‌కు మంగళగిరి హద్దులు కూడా తెలియవని ఎద్దేవా చేశారు. రైతుల నుంచి అన్యాయంగా భూములు తీసుకున్నప్పుడు, వారిని పోలీసు స్టేషన్‌లలో పెట్టి కొట్టినప్పుడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఎందుకు రోడ్లపైకి రాలేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినప్పుడు భువనేశ్వరి ఎందుకు బయటకు రాలేదో చెప్పాలన్నారు. రైతుల నుంచి భూములు తీసుకుని ఒక్క శాశ్వత భవనం ఎందుకు కట్టలేదో భువనేశ్వరి చంద్రబాబును అడగాలని సూచించారు. రాజధాని కట్టాలంటే రూ. లక్ష 25వేల కోట్లు ఖర్చు అవుతుందని అన్నారు. చంద్రబాబు రాష్ట్రాలన్ని మూడున్నర లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో నెట్టారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment