అల్లర్లకు పన్నాగం | TDP Political Drama For Local Body Election | Sakshi
Sakshi News home page

అల్లర్లకు పన్నాగం

Published Thu, Mar 12 2020 3:24 AM | Last Updated on Thu, Mar 12 2020 1:52 PM

TDP Political Drama For Local Body Election - Sakshi

టీడీపీ నేతల వాహనం ఢీకొనడంతో గాయపడిన దివ్యాంగుడు. (ఇన్‌సెట్‌లో) కోపంతో దాడిచేస్తున్న స్థానికులు

సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి పోటీ ఇవ్వలేక అష్టకష్టాలు పడుతున్న తెలుగుదేశం పార్టీ ప్రజల దృష్టిని మళ్లించేందుకే అక్కడక్కడ చిల్లర గొడవలకు దిగడంపై విస్మయం వ్యక్తమవుతోంది. వాటినే ఎల్లో మీడియా ద్వారా భూతద్దంలో చూపించి మరింత రాద్ధాంతం సృష్టిస్తుండడంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల ఆదరణ పూర్తిగా కోల్పోయి తిరిగి పుంజుకునే అవకాశం ఏమాత్రం లేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉద్దేశ్యపూర్వకంగానే కొన్ని సమస్యాత్మక గ్రామాల్లో సహజంగా ఉండే రాజకీయ కక్షలను రెచ్చగొడుతున్నట్లు స్పష్టమవుతోందని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి తప్పదని ముందే గ్రహించిన చంద్రబాబు.. ప్రజలను ఏమార్చేందుకు, ఓటమికి సాకులు చెప్పుకునేందుకే వ్యూహాత్మకంగా ఇలాంటి పనులు చేయిస్తున్నారని ఆయనన్నారు. గుంటూరు జిల్లా మాచర్లలో బుధవారం జరిగిన సంఘటన కూడా ఇందులో భాగమేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇటీవల టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన పిన్నెల్లి కారు 



అనవసర రాద్ధాంతానికే బొండా, బుద్ధా మాచర్లకు..
గుంటూరు జిల్లా పల్నాడులోని వెల్దుర్తి మండలం బోదిలవీడు గ్రామంలో జరిగిన చిన్న గొడవను పెద్దది చేసి హంగామా సృష్టించేందుకు విజయవాడ నుంచి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మరికొందరిని చంద్రబాబు అక్కడికి పంపించినట్లు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. బోదిలవీడులో రెండు వర్గాల మధ్య కొద్దిరోజులుగా గొడవలు జరుగుతుండగా, టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ నేతలపై సోమవారం రాత్రి దాడిచేశారు. దానిపై మంగళవారం వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రశ్నించడంతో నామినేషన్లు వేసే సమయంలో గొడవ జరిగింది. దాన్ని మరింత పెద్దది చేసే ఉద్దేశంతో విజయవాడ నుంచి నాయకులు, కార్యకర్తలను బుధవారం బోదిలవీడుకు పంపి ఉద్రిక్తత సృష్టించాలని చంద్రబాబు చూశారు. కానీ, మార్గమధ్యంలో మాచర్ల వద్ద టీడీపీ నేతల వాహనం వికలాంగుడ్ని ఢీకొట్టింది. ఈ ఘటనతోనే అక్కడ ఘర్షణ తలెత్తిందని వైఎస్సార్‌సీపీ నేతలు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో.. ఒక గ్రామంలో జరిగిన చిన్న గొడవపై విజయవాడ నుంచి భారీఎత్తున నాయకులను పంపాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్నకు టీడీపీ నాయకులు సమాధానం చెప్పాలని పిన్నెల్లి డిమాండ్‌ చేశారు. రాద్ధాంతం సృష్టించే వ్యూహంతోనే వారు బయలుదేరినట్లు ఆయన స్పష్టంచేశారు. అలాగే, చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పులిచర్ల గ్రామంలో నామినేషన్‌ వేయడానికి వెళ్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులను టీడీపీ నేతలు వీడియో తీస్తూ ధూషించడంతో ఘర్షణ జరగ్గా దానిపైనా హంగామా సృష్టించారు. మొత్తంగా ఇలాంటి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ఈ రెండురోజుల్లో ఐదారుకు మించలేదు. 13 జిల్లాల్లో మిగిలిన చోట్ల ఎక్కడా ఘర్షణ వాతావరణం లేకపోయినా తాను సృష్టించిన ఈ చిన్న ఘటనల్ని ఎల్లో మీడియా ద్వారా భూతద్దంలో చూపిస్తూ చంద్రబాబు శాంతిభద్రతల సమస్యగా ప్రచారం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

టీడీపీ హయాంలో ఎమ్మెల్యేలపైనే దాడులు : గోపిరెడ్డి
టీడీపీ హయాంలో గత ఐదేళ్లలో తమపై ఇంతకంటే పెద్దఎత్తున దాడులు జరిగాయని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఎమ్మెల్యేలపైనే దాడులు చేసిన ఉదంతాలున్నాయని ఆయన గుర్తుచేశారు. ఎన్నికల్లో పోటీచేసే వ్యక్తుల్ని బలవంతంగా ఎత్తుకెళ్లిన సందర్భాలున్నాయని వివరించారు. కానీ, ఇప్పుడా వాతావరణం రాష్ట్రంలో ఎక్కడాలేదని.. కేవలం టీడీపీ వాళ్లు అక్కడక్కడ సృష్టించిన చిల్లర గొడవలు తప్ప స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని వైఎస్సార్‌సీపీ చెబుతోంది. 

కీలక నేతల గుడ్‌బైతోనే ఇలా : బొత్స
ఇక అన్ని వర్గాల ఆదరణను కోల్పోయిన తెలుగుదేశం పార్టీ పరిస్థితి గ్రామాల్లో హీనంగా మారిపోవడంతో ప్రజలను ఏమార్చేందుకు ఇవన్నీ చేస్తున్నట్లు మంత్రి బొత్స స్పష్టంచేశారు. ఎన్నికల వేళ గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ కీలక నాయకులు టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతుండడం టీడీపీకి ఏమాత్రం మింగుడుపడడంలేదు. ఉదా..
– డొక్కా మాణిక్యవరప్రసాద్, కదిరి బాబూరావు, రెహమాన్, రామసుబ్బారెడ్డి, సతీష్‌రెడ్డి వంటి ముఖ్య నాయకులు పార్టీకి వరుసగా రాజీనామా చేయడం.. మరికొందరు అదేబాటలో ఉన్నట్లు తెలియడంతో చంద్రబాబుకు ఏంచేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. 
– అనేకచోట్ల పోటీచేసేందుకు అభ్యర్థులు దొరకడంలేదని టీడీపీ నేతలు వాపోతున్నారు. ఎంపీటీసీలు,సర్పంచ్‌ స్థానాల్లో అభ్యర్థుల కోసం వారు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. 
– సగానికిపైగా జిల్లాల్లో జెడ్పీ ఛైర్మన్‌ అభ్యర్థులు లేకపోవడం ఆ పార్టీ దయనీయ స్థితికి అద్దంపడుతోంది. 
– అనేకచోట్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు, ముఖ్య నాయకులు అస్త్ర సన్యాసం చేయడంతో పార్టీని నడిపించే నాథుడే కనిపించడంలేదని చెబుతున్నారు.
– క్షేత్రస్థాయిలో వైఎస్సార్‌సీపీని ఎదుర్కొనే బలం కోల్పోయి ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్లు సైతం పోటీచేయలేమని చేతులెత్తేస్తున్నట్లు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. 
– ఇక పోటీ చేయడానికి అభ్యర్థులు దొరక్కపోతే.. వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా పోటీచేయడానికి ముందుకొచ్చిన వారికి మద్దతిస్తామని స్వయంగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబే ప్రకటించడం.. టీడీపీ పతనావస్థకు నిదర్శనంగా నిలుస్తోందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఐపీఎస్‌ అధికారిపై దాడిచేసిన వారితో స్క్రీన్‌ప్లే
విజయవాడలో నడిరోడ్డు మీద ఐపీఎస్‌ అధికారి బాలసుబ్రమణ్యం (అప్పటి రవాణా కమిషనర్‌) మీద దాడిచేసిన బొండా ఉమ (అప్పటి ఎమ్మెల్యే), ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను మాచర్లకు పంపించడానికి చంద్రబాబు ఎంపిక చేసుకున్నారు. దూకుడుగా వ్యవహరించే స్వభావం ఉన్న వారిద్దరూ అనవసరంగా మాచర్లకు బయల్దేరి రోడ్డు ప్రమాదానికి కారణమయ్యారు. అది చూసి ఆవేశంతో ప్రశ్నించడానికి వచ్చిన స్థానికులతో దురుసుగా ప్రవర్తించారు. అంతటితో ఆగక.. ఆ ప్రమాదానికి రాజకీయ రంగు పులిమి లబ్ధిపొందడానికి ప్రయత్నించారు. బొండా, బుద్ధా గత చరిత్ర కూడా వివాదాస్పదం కావడం తెలిసిందే.

రాష్ట్రమంతా అదే కుట్ర
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లోనూ స్థానికంగా ఉన్న రాజకీయ విభేదాలను రెచ్చగొట్టి శాంతిభద్రతల సమస్య సృష్టించడానికి టీడీపీ ప్రయత్నించింది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం, పెదపూడి, చిత్తూరు జిల్లా పుంగనూరు, చంద్రగిరి, గుంటూరు జిల్లా దాచేపల్లి, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట తదితర చోట్ల కూడా ఇదే తరహాలో కుట్రను అమలుచేయడానికి టీడీపీ నాయకులు ప్రయత్నించారు.

పూర్తిస్థాయి నివేదికకు డీజీపీ ఆదేశం
గుంటూరు జిల్లా మాచర్లలో బుధవారం జరిగిన ఘటనపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వెంటనే స్పందించారు. ఇందుకు సంబంధించి పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని గుంటూరు ఐజీ జె. ప్రభాకర్‌రావును ఆదేశించారు. దీంతో ఐజీ మాచర్లకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఐజీ వెంట గుంటూరు రూరల్‌ ఎస్పీ విజయరావు కూడా ఉన్నారు.

జరిగిందిదీ.. 
► సోమవారమే టీడీపీ దాడి..
గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం బోదిలవీడులో సోమవారం రాత్రి టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ నాయకులపై దాడి చేశారు.

► బెజవాడ నుంచి టీడీపీ నేతలు
బోదిలవీడులో జరుగుతున్న గొడవలను పెద్దవి చేసి రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ఒక పథకం ప్రకారం బుధవారం విజయవాడ నుంచి నాయకులు భారీ సంఖ్యలో వాహనాలలో అక్కడకు బయల్దేరారు.

► మాచర్లలో యాక్సిడెంట్‌..
విజయవాడ నుంచి వస్తున్న టీడీపీ నాయకుల వాహనాలలో ఒకటి మాచర్లలో ఒక దివ్యాంగుడిని ఢీకొట్టడంతో స్థానికులు కోపోద్రిక్తులయ్యారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపించారు.

► దుర్భాషలాడడంతో ఘర్షణ..
దివ్యాంగుడు గాయపడినా ఏ మాత్రం బాధ లేకపోగా.. దుర్భాషలాడడంతో స్థానికులు దాడిచేశారు. కార్లలోని వారు ఏపార్టీ వారనేది కూడా స్థానికులకు తెలియదు.

► బాబు హైడ్రామా..
ఈ ఘటనను రాజకీయంగా ఉపయోగించుకోవడానికి టీడీపీ విమర్శలు మొదలుపెట్టింది. ఫిర్యాదు చేసే పేరుతో డీజీపీ ఆఫీస్‌కు వెళ్లి అక్కడ బయటే బాబు బైఠాయించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement