
సాక్షి, తాడేపల్లి: స్థానిక ఎన్నికలు జరగకుండా ఉండటమే చంద్రబాబు నాయుడు లక్ష్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బాబు ఎన్నికలను ఆపాలని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని చిన్న సంఘటనలను కూడా భూతద్దంలో చూపుతున్నారని ధ్వజమెత్తారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసేందుకు కనీసం అభ్యర్థులు కూడా లేరని విమర్శించారు. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డబ్బు, మద్యం లేకుండా స్థానిక ఎన్నికలు జరగాలని నూతన సంస్కరణలు తెచ్చారన్నారు. ఇక 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఎప్పుడైనా ఇలాంటి సంస్కరణలు తెచ్చారా విమర్శించారు. రాజకీయ నాయకులు, బంధువులు ఎన్నికల్లో పోటీ చేయకుడదనే నూతన విధానాన్ని సీఎం జగన్ తీసుకువచ్చారన్నారు. సీఎం జగన్ పాలనను అన్ని రాష్ట్రాల వారు అభినందిస్తుంటే ఎల్లో మీడియాకు అవి కనబడటం లేదని మండిపడ్డారు.
వైఎస్సార్‌సీపీలో భారీ ఎత్తున చేరికలు
8 నెలల కాలంలో సీఎం జగన్ చేసిన పాలనను ఇతర రాష్ట్రాలు సైతం అనుసరిస్తున్నాయని చెప్పారు. అవి...ఎల్లో మీడియాకు కునబడం లేదా అని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి తెస్తున్న నూతన సంస్కరణలు నచ్చక చంద్రబాబు ఎల్లో మీడియాల్లో రాష్ట్రంలో ఏదో జరిగిపోయినట్లుగా కల్పితాలు రాపిస్తున్నారన్నారు. ఆయన అమలులోకి తెచ్చిన ఇంగ్లీషు మీడియం, వికేంద్రీకరణ, దిశ చట్టాన్ని ఇతర రాష్టాలు కూడా మెచ్చుకుని వాటిని అనుసరిస్తున్నాయి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారన్నారు. గతంలో తమ నాయకులైన అంబటి రాంబాబు, ముస్తఫాలు సత్తెనపల్లిలో ఎంపీటీసీగా గెలిచిన వారిని బస్సులో తీసుకువెళుతుంటే జరిగిన దాడిపై బాబు ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. పల్నాడులో టీడీపీ పాలనలో జరిగిన అరాచకాలు అందరికీ తెలుసని, కోడెల శివప్రసాద్ కుమారుడు శివరాం, గురజాలలో యరపతినేని, చిలకలూరిపేటలో పుల్లారావ్ చేసిన అరాచకాలు ప్రజలు గమనించారని తెలిపారు. బోండా ఉమా, బుద్దా వెంకన్నకు మాచర్లలో ఏంటి పని..? అని ప్రశ్నించారు. విజయవాడ నుండి గూండాలను మాచర్ల తెచ్చారా అని ఎద్దేవా చేశారు. పల్నాడు పౌరుషాల గడ్డ ప్రజలు మీ అరాచకాలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.
‘సంతాప సభను.. బాబు రాజకీయ సభగా మార్చారు’
టీడీపీ నుంచి రోజుకు ఇద్దరూ చొప్పున పార్టీ మారుతుంటే చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై నిందలువేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ పాలనలో సీబీఐ, ఈడీలను ఎందుకు రాష్ట్రంలోకి రానివ్వలేదని, చంద్రబాబు ఎల్లో మీడియాతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఏడాది పాటు ఎన్నికలు జరపకుండా ప్రత్యేక అధికారులతో పాలన చేసిన నాయకుడు చంద్రబాబు అని విమర్శించారు. సీఎం జగన్ ఆర్డినెన్స్ తో నూతన సంస్కరణలు తీసుకువచ్చారని, డబ్బులు లేకుండా ఎన్నికల జరగాలన్నదే ఆయన ఉద్దేశం అన్నారు. పులివెందుల పంచాయతీ అని విమర్శలు చేస్తున్న టీడీపీ నాయకులు ఓసారి పులివెందుల వెళదాం రండి... అక్కడి ప్రజల మమకారం మీకు తెలియదు అని వ్యాఖ్యానించారు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోయే పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యoలో హింసకు తావు లేదని.. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తామని తెలిపారు. సీఎం జగన్ తీసుకువచ్చిన సంస్కరణలకు కట్టుబడి పని చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మాట్లాడుతూ: చంద్రబాబు రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నారని విమర్శించారు. ఆరాచకాలు ఎలా చేయాలో బాబు తన మనుషులకు చెప్పి పంపిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో గెలవలేమనే జనాన్ని రెచ్చగొడుతున్నారన్నారు. మద్యం, డబ్బు పంపిణీ లేకుండా ఎన్నికలు జరగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారని పేర్కొన్నారు. ఇందుకు విరుద్ధంగా బాబు చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment