సాక్షి, గుంటూరు: మంగళగిరి మండలం ఆత్మకూరులో నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం టీడీపీ కార్యాలయాన్ని నిర్మించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి పేర్కొన్నారు. నూతనంగా నిర్మించిన టీడీపీ పార్టీ కార్యాలయ స్థలాన్ని వాగు, పోరంబోకు భూములకు కేటాయించినట్లు తెలిపారు. ‘వాగు, చెరువు, పోరంబోకు భూములను ఆఫీసులకు, పార్టీ కార్యాలయాలకు కేటాయించ కూడదని చట్టం చెబుతుంది. అయినా చంద్రబాబు ప్రభుత్వం నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించింది’ అని అన్నారు. ఈ విషయంపై తాను కోర్టును ఆశ్రయించానని, దీనిపై కోర్టు నోటీసులు కూడా ఇచ్చినట్లు తెలిపారు.
చంద్రబాబు ఉండే ఇల్లు అక్రమమేనని, ఇప్పుడు ఆయన కట్టుకున్న పార్టీ కార్యాలయం కూడా అక్రమంగానే నిర్మించారని విమర్శించారు. అయితే ఈ పార్టీ కార్యాలయాన్ని లింగమనేని రమేష్ కట్టించారని, దీని కోసం మొదట 3.65 సెంట్ల భూమిని టీడీపీ ప్రభుత్వమే కేటాయించుకుందని తెలిపారు. అది కాకుండా పార్టీ కార్యాలయం కోసం ఉమా మహేశ్వర్‌రెడ్డి అనే రైతు భూమిని కబ్జా చేశారని అన్నారు. దీనిపై ఆ రైతు కోర్టును ఆశ్రయిస్తే కోర్టు స్టే ఇచ్చిందని, కోర్టు ఉత్తర్వులను కూడా చంద్రబాబు పాటించకుండా పార్టీ కార్యాలయాన్ని నిర్మించారని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment