బరితెగిస్తున్న టీడీపీ గూండాలు | TDP Activists Attack on YSR Congress Party Leaders Guntur | Sakshi
Sakshi News home page

బరితెగిస్తున్న టీడీపీ గూండాలు

Published Sat, Feb 22 2020 12:22 PM | Last Updated on Sat, Feb 22 2020 12:22 PM

TDP Activists Attack on YSR Congress Party Leaders Guntur - Sakshi

టీడీపీ వర్గీయుల దాడిలో ధ్వంసమైన ఎమ్మెల్యే రజని మరిది గోపీనాథ్‌ కారు

సాక్షి, గుంటూరు: టీడీపీ గూండాలు బరితెగిస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు, ప్రభుత్వ అధికారులు, పోలీసులు లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. ఆందోళనకారుల ముసుగులో అరాచకాలకు పాల్పడుతున్నారు. తాజాగా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని మరిది విడదల గోపీనాథ్‌పై గురువారం అర్ధరాత్రి దాడికి తెగబడ్డారు. కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా విడదల వారి ప్రభను త్రికోటేశ్వరస్వామి దేవాలయం వద్ద వదిలి వస్తున్న గోపీనాథ్‌ కారుని ఈటీ జంక్షన్‌ వద్ద టీడీపీ గూండాలు ట్రాక్టర్‌ను అడ్డుపెట్టి పథకం ప్రకారం ఆయన్ను హతమార్చడానికి ప్రయత్నించారు. బండరాళ్లు, క్రికెట్‌ బ్యాట్‌లు, రాడ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో గోపీనాథ్‌ అనుచరులు గాయపడ్డారు. గోపీనాథ్‌ కారు అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనపై చిలకలూరిపేట పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దాడి, హత్యాయత్నానికి పాల్పడిన సుమారు 20 మంది టీడీపీ వర్గీయులేనని తెలిసింది.

వైఎస్సార్‌ సీపీ నాయకులు,అధికారులే లక్ష్యం..
గత రెండు నెలల కాలంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రభుత్వ అధికారులు, వైఎస్సార్‌ సీపీ నాయకులే లక్ష్యంగా టీడీపీ నాయకులు దాడులు, హత్యాయత్నాలకు పాల్పడ్డారు.

ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
గత ఏడాది డిసెంబర్‌ 27 : మందడంలో మీడియా ప్రతినిధులు, పోలీసులపై దాడి చేశారు.
జనవరి 7 : చినకాకాని వద్ద ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ గూండాలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. రాళ్లు, కర్రలతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడి చేయడంతో ఆయన తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.
ఫిబ్రవరి 2 : కృష్ణాజిల్లా నందిగామలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ కారును అడ్డుకుని దుర్భాషలాడుతూ టీడీపీ నేతలు ఆయనపై దాడికి తెగబడ్డారు.
ఫిబ్రవరి 17 : కృష్ణాజిల్లా విజయవాడ రూరల్‌ మండలం కొత్తూరు తాడేపల్లి గ్రామంలో గ్రామ సభ నిర్వహిస్తున్న తహసీల్దార్‌ వనజాక్షిపై టీడీపీ ప్రోద్బలంతో కొందరు వ్యక్తులు, మహిళలు దాడికి పాల్పడ్డారు. దుర్భాషలాడుతూ, మహిళా అధికారి పట్ల అనుచితంగా వ్యవహరించారు.
ఫిబ్రవరి 20 : మంగళగిరి రూరల్‌ మండలంలోని ఓ ప్రైవేట్‌ యూనివర్సిటీలో కార్యక్రమానికి హాజరైన వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కారును అడ్డుకుని ఆమెపై దాడికి టీడీపీ గూండాలు విఫలయత్నం చేశారు. రోజా కారును ఆందోళనకారుల ముసుగులో టీడీపీ గూండాలు చుట్టుముట్టిన విషయం పోలీసులకు తెలిసి వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకుని సుమారు 400 మంది పోలీసులు రక్షణ కల్పించడంతో ఆమె ప్రాణాలతో బయటపడ్డారు. ఇదే రోజు తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, డ్రోన్‌ కెమెరా ఆపరేట్‌ చేస్తున్న ఓ కానిస్టేబుల్‌పైనా ఆందోళనకారుల ముసుగులో మందడంలో టీడీపీ నాయకులు దాడికి తెగబడ్డారు.  

టీడీపీకి ఇది కొత్తేమీ కాదు..
పొజిషన్‌లో ఉన్నా.. అపొజిషన్‌లో ఉన్నా హింసను ప్రేరేపించి పబ్బం గడుపుకోవడం టీడీపీకి కొత్తేమీ కాదని సీనియర్‌ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని గత ఐదేళ్లలో గుంటూరు జిల్లాలో టీడీపీ చేసిన అరాచకాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.  టీడీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని గత ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ఏడుగురు ఎంపీటీసీలున్న వైఎస్సార్‌ సీపీకి ముప్పాళ్ల ఎంపీపీ స్థానం దక్కకుండా చేశారు. ఐదుగురు ఎంపీటీసీలున్న టీడీపీ నేతలు వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీలను కిడ్నాప్‌ చేసి ఎంపీపీ స్థానాన్ని దక్కించుకున్నారు. 2014 జూలై 13న ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నికకు ఎంపీటీసీలతో వెళ్తున్న వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే మొహమ్మద్‌ ముస్తఫా, అంబటి రాంబాబుపై మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తనయుడు శివరామ్‌ గూండాలతో మేడికొండూరు వద్ద దాడులు చేయించారు. ఎంపీపీలు ప్రయాణిస్తున్న బస్సు, ఎమ్మెల్యే వాహనాన్ని ధ్వంసం చేసి, ఎమ్మెల్యే ముస్తఫాతో పాటు అంబటిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి భయానక వాతావరణం సృష్టించారు. మళ్లీ ఇప్పుడు టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు గమనించినట్‌లైతే హింసను ప్రేరేపించి రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలను తీసుకురావాలని చూస్తున్నారని నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల అనంతరం పల్నాడు ప్రాంతంలో లేని హింసను రెచ్చగొట్టడం కోసం ప్రతిపక్ష నేత ఎన్‌.చంద్రబాబు అనేక విధాలుగా యత్నించారు. ఓ శిబిరాన్ని ఏర్పాటు చేసి అందులో పెయిడ్‌ ఆర్టిస్టులను కూర్చోబెట్టి వారితో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారానికి దిగారు. చలో ఆత్మకూరు అంటూ నానాయాగీ చేసి టీడీపీ బొక్కబోర్లా పడిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement