బుల్లితెర కష్టాలు | Difficulties television | Sakshi
Sakshi News home page

బుల్లితెర కష్టాలు

Published Mon, Jul 25 2016 9:13 PM | Last Updated on Tue, Aug 27 2019 5:55 PM

బుల్లితెర కష్టాలు - Sakshi

బుల్లితెర కష్టాలు

సాక్షి, హన్మకొండ: కేబుల్‌ టీవీ డిజిటలైజేషన్‌ ప్రక్రియ మరోసారి తెరపైకి వచ్చింది. జులై 31 అర్ధరాత్రి నుంచి అనలాగ్‌ ప్రసారాలు నిలిపేస్తామని  కేంద్రం మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. దీంతో జులై 31 నుంచి సెట్‌టాప్‌ బాక్సులు అమర్చుకోని వారికి కేబుల్‌ టీవీ ప్రసారాలు నిలిచిపోనున్నాయి.

 
మళ్లీ బుల్లితెరపై సీరియళ్లు, సినిమాలు స్పోర్ట్స్‌ సందడి చేయాలంటే డిజిటల్‌ ప్రసారాలు అందించే సెట్‌టాప్‌ బాక్సు అమర్చుకోవాల్సిందే. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2016 జులై 31 నుంచి అనలాగ్‌ పద్ధతిలో ఉన్న కేబుల్‌ టీవీ ప్రసారాలు నిలిచిపోనున్నాయి. దీని ప్రభావంతో తెలంగాణలో 186, ఆం«ధ్రప్రదేశ్‌లో 180 పట్టణాల్లో కేబుల్‌ టీవీ ప్రసారాలు డోలాయమానంలో పడ్డాయి. కేబుల్‌ టీవీ వ్యవస్థను డిజిటలైజ్‌ ప్రక్రియ మూడోదశలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న  మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా ఎక్కువగా ఉన్న మేజర్‌ పంచాయతీలు, టౌన్‌షిప్‌లలో కేబుల్‌ టీవీ ప్రసారాలను 2015 డిసెంబరు 31లోగా డిజిటలైజ్‌ చేయాలంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబం«ధించి మూడో దశలో ఉన్న పట్టణాలు, ప్రాంతాలు, అక్కడున్న కేబుల్‌ కనెక్షన్ల వివరాలతో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ 2015 ఏప్రిల్‌లో సమాచారం అందించింది. అయితే డిమాండ్‌కు సరిపడా సెట్‌టాప్‌ బాక్సులు అందుబాటులో లేకపోవడంతో నిర్ధేశించిన గడువులోగా డిజిటలైజేషన్‌ ప్రక్రియ సాధ్యం కాలేదు. ఫలితంగా కేంద్రం 2016 జులై 31 వరకు గడువు పొడిగించింది. 
 
అరకొర ప్రకటనలే జారీ..
కేబుల్‌ టీవీ డిజిటలైజేషన్‌ గురించి అరకొర ప్రకటనలు ఇవ్వడం తప్ప కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి ప్రయత్నం జరగలేదు. వినియోగదారులకు అవగాహన కల్పించడం, మాస్టర్‌ సిస్టమ్‌ ఆపరేటర్ల (ఎంఎస్‌ఓ)లపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యాయి. దీంతో కేబుల్‌ టీవీ డిజిటలైజేషన్‌ ప్రక్రియ ఏళ్లతరబడి మందకొడిగానే సాగుతోంది. గతేడాది వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పదిశాతం వరకు కేబుల్‌ కనెక్షన్లు సెట్‌టాప్‌ బాక్సులు అమర్చుకున్నాయి.
 
 ఈ ఏడాది తొలి అర్ధభాగంలో అదనంగా మరో ఇరవై శాతం కనెక్షన్లకు సెట్‌టాప్‌ బాక్సులు అమర్చారు. మొత్తంగా ఇరు రాష్ట్రాల్లో కలిపి ప్రస్తుతం 30 శాతం కనెక్షన్లకే సెట్‌టాప్‌ బాక్సులు అమర్చినట్లు సమాచారం. ఇక ఈ వారం రోజుల్లో మిగిలిన 70 శాతం కనెక్షన్లకు సెట్‌టాప్‌ బాక్సులు అమర్చడం కష్టమే. అనలాగ్‌ కేబుల్‌ ప్రసారాలు నిలిచిపోతే వినియోగదారుల నుంచి సెట్‌టాప్‌ బాక్సులకు తీవ్రమైన డిమాండ్‌ వస్తుంది. ప్రస్తుతం డిమాండ్‌కు తగిన స్థాయిలో మార్కెట్‌లో సెట్‌టాప్‌ బాక్సులు లభించడం కష్టమే. దీంతో మరోసారి గడువు పెంచేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement