సెట్‌టాప్ బాక్స్ తప్పదు | Set-top box will be | Sakshi
Sakshi News home page

సెట్‌టాప్ బాక్స్ తప్పదు

Published Sat, Dec 26 2015 1:39 AM | Last Updated on Sun, Sep 3 2017 2:34 PM

Set-top box will be

లేకుంటే టీవీ బంద్!
అనలాగ్ కేబుల్ ప్రసారాల నిలిపివేత
ఆదేశాలు జారీచేసిన కేంద్ర ప్రభుత్వం
జనవరి 1 నుంచి  కేవలం డిజిటల్ ప్రసారాలే
ఈ నెల 31 అర్ధరాత్రి  నుంచే కొత్త మార్పులు
తొలుత మున్సిపాలిటీలు, నగరపంచాయతీల్లో అమలు
వినియోగదారులు లక్షల్లో... సెట్‌టాప్ బాక్సులు వేలల్లో
కొత్త సంవత్సరంలో టీవీ వీక్షకులకు     తప్పని ఇబ్బందులు

 
ప్రతీరోజు సీరియళ్లు, సినిమాలు, స్పోర్ట్స్, న్యూస్, వంటలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో వినోదం, విజ్ఞానం అందిస్తున్న కేబుల్ టీవీ ప్రసారాలు ఈ నెల 31 అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్నాయి. అనలాగ్ టీవీ ప్రసారాలకు బదులు డిజిటల్ ప్రసారాలు రానున్నాయి. ఇందుకు తగ్గట్లుగా సెట్‌టాప్ బాక్సులు అమర్చుకోని పక్షంలో టీవీలన్నీ మూగనోము పట్టనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే, డిమాండ్‌కు తగినట్టుగా సెట్‌టాప్ బాక్సులు లేకపోవడంతో కేబుల్ టీవీ వినియోగదారుల పరిస్థితి గందరగోళంగా మారనుంది. కొత్త సంవత్సరం ప్రారంభం నుంచే బుల్లితెర వీక్షకులకు ఇబ్బందులు ఎదురుకానున్నారుు.   
 
హన్మకొండ  కేబుల్ టీవీ ప్రసారాలను క్రమబద్ధీకరించే ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతం అమలవుతున్న అనలాగ్ కేబుల్ టీవీ వ్యవస్థను డిజిటలైజ్ చేయాలని కేంద్ర ప్రసార, సమాచార శాఖ నిర్ణయించింది. ఈ మేరకు గత ఐదేళ్లుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. తొలి దశలో దేశంలోని నాలుగు ప్రధాన మెట్రో నగరాలు, మలి దశలో హైదరాబాద్ వంటి నగరాల్లో కేబుల్ ప్రసారాలను డిజిటల్‌మయం చేశారు. మూడోదశలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో కేబుల్ టీవీ ప్రసారాలనుడిజిటలైజ్ చేయాలంటూ అన్ని టీవీ ఛానల్స్ యాజమన్యాలకు కేంద్రం చివరి హెచ్చరికను డిసెంబరు 22న జారీ చేసింది. దీంతో మన జిల్లాలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, నర్సంపేట, పరకాల, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి పట్టణాల్లో ప్రస్తుతం ఉన్న అనలాగ్ కేబుల్ టీవీ ప్రసారాలు పూర్తిగా ఆగిపోతాయి. వీటి స్థానం లో డిజిటల్ ప్రసారాలు ప్రారంభమవుతాయి. కేబుల్ టీవీ ప్రసారాలు పొందాలనుకునే వినియోగదారులు తప్పనిసరిగా సెట్‌టాప్ బాక్సును అమర్చుకోవాల్సి ఉంటుంది.

ఇబ్బందులు తప్పవా
కేబుల్ టీవీ డిజిటలైజేషన్ కోసం ఎంపిక చేసిన మున్సిపాలిటీల్లో దాదాపు రెండు లక్షల కేబుల్ టీ వీ కనెక్షన్లు ఉన్నాయి. 200 మంది వరకు కేబుల్ ఆపరేటర్లు ఉన్నారు. వీరిలో వేళ్లపై లెక్కపెట్టే సంఖ్యలో కేబుల్ ఆపరేటర్లు మాత్రమే సెట్‌టాప్ బాక్సులు సిద్ధంగా ఉంచుకున్నారు. వీరి దగ్గర కూడా తమ పరిధిలో ఉన్న కనెక్షన్లకు తగ్గట్లుగా బాక్సులు లేవు. దీంతో  ఈ నెల 31 అర్ధరాత్రి నుంచి కేబుల్ ప్రసారాలు నిలిచిపోతే, వినియోగదారులకు ఇక్కట్లు తప్పేలా లేవు. గత నెలరోజులుగా కేబుల్ ఆపరేటర్లు వినియోగదారులకు అవగాహన కలిగిస్తున్నా ఆశించిన ఫలితం రావట్లేదు. ఇప్పటి వరకు పదిశాతం లోపు కనెక్షన్లకే సెట్‌టాప్ బాక్సులు ఉన్నాయి.
 
సెట్‌టాప్ బాక్సుల ధరలు ఇలా..

 ప్రస్తుతం మార్కెట్‌లో స్టాండర్డ్ డెఫినేషన్, హై డెఫినేషన్ మోడళ్లలో సెట్‌టాప్ బాక్సులు లభిస్తున్నాయి. సెట్‌టాప్ బాక్సుల ఖరీదు ఎస్‌డీ మోడల్ రూ.1000 నుంచి రూ.1500 మధ్యన  ఉంది. హెడ్‌డీ మోడల్ రూ.1700 నుంచి రూ.1900 ధరలో మార్కెట్‌లో లభ్యమవుతున్నా యి. నాణ్యత, ఫీచర్ల విషయానికి వస్తే ఎస్‌డీతో పోల్చితే హెడీ సెట్‌బాక్స్ బాక్సుతో ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా సెట్‌టాప్ బాక్సులను కేబుల్ ఆపరేటర్లే వినియోగదారులకు అందిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement