కాపు ఐక్యగర్జనకు కరెంట్ కట్
సెల్ సిగ్నళ్లు, కేబుల్ ప్రసారాల నిలిపివేత
పిఠాపురం/తొండంగి: తుని వద్ద ఆదివారం నిర్వహించిన కాపు ఐక్యగర్జన బహిరంగసభకు అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి. బహిరంగ సభ ప్రారంభం నుంచి సభ జరిగే ప్రాంతంతో పాటు సమీప గ్రామాలకూ విద్యుత్ సరఫరా నిలిపేశారు. దీనికి తోడు ‘జామర్లు’ ఏర్పాటు చేసినట్టుగా అన్ని కంపెనీల సెల్ సిగ్నళ్లూ పనిచేయలేదు. టీవీ చానళ్లు, కేబుల్ టీవీ ప్రసారాలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. సభకు అడ్డంకులు కల్పించడానికి ప్రభుత్వ పెద్దలు ఇలాంటి అవాంతరాలు సృష్టించారని సభకు వచ్చిన కాపు నాయకులు మండిపడ్డారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు విద్యుత్ సరఫరా, సెల్ సిగ్నల్స్ లేకపోవడం, ప్రసార మాధ్యమాలు పనిచేయకపోవడంతో సభకు వచ్చిన వారితో పాటు సమీప గ్రామాల ప్రజలు సైతం ఇబ్బందులు పడ్డారు.
ప్రశాంతంగా ప్రారంభమై..
తుని రూరల్: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సారథ్యంలో ఆదివారం నిర్వహించిన కాపు ఐక్యగర్జన సభ ఉదయం ప్రశాంతంగానే ప్రారంభమైంది. ముద్రగడ పిలుపు, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఉద్రిక్తంగా మారింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే వివిధ జిల్లాలకు చెందిన కాపులు సభాప్రాంగణానికి చేరుకోవడం ప్రారంభించారు. అప్పటినుంచి చూస్తే..
10.10 గంటలకు ముద్రగడ పద్మనాభం తన మనవరాలు భాగ్యశ్రీతో కలసి సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
10.45 గంటలకు జామర్ల ఏర్పాటుతో సభా ప్రాంగణంలో సెల్ సిగ్నల్స్ స్తంభించి పోయాయి.
12.45 గంటల సమయంలో వేదిక, ప్రెస్ గ్యాలరీలు కూడా సభికులతో నిండిపోయాయి.
1.30 గంటలకు వేదికపై నాయకులు ఆశీనులయ్యారు.
1.45 గంటలకు అభిమానుల హర్షధ్వానాల మధ్య ముద్రగడ వేదికనెక్కి అందరికీ అభివాదం చేశారు.
2.37 గంటల నుంచి 2.54 గంటల వరకు ముద్రగడ ప్రసంగించారు. అనంతరం వేదికనుంచి దిగిన ముద్రగడ హైవేపై ధర్నాకు దిగారు. అభిమానులు అనుసరించగా అక్కడ ప్రసంగం చేశారు.
3.00 గంటలకు ఆందోళనకారులు సమీపంలోని రైలు పట్టాలపైకి చేరారు.
3.15 గంటల సమయంలో విశాఖ నుంచి విజయవాడ వెళుతున్న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను ఆపేందుకు ప్రయత్నించారు. వేగం తగ్గించిన డ్రైవర్ ఆపకుండా వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఈ సందర్భంలోనే డ్రైవర్లకు, కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. రైలును నిలిపివేసిన డ్రైవర్లు రైలు వదిలి పరుగులు తీశారు. ప్రయాణికులు తమ తమ లగేజీలతో రైలు దిగిపోయారు.
4.40 గంటల సమయంలో కొందరు రత్నాచల్‌కు నిప్పు అంటించారు. అడ్డుకోబోరుున నలుగురు ఆర్‌పీఎఫ్ సిబ్బందిపై రాళ్లతో దాడి చేశారు.
5.00 గంటలకు హైవేపై టైర్లకు ఆందోళనకారులు నిప్పు అంటించారు.