పాతబస్తీ చానళ్లు.. పక్కా.. లోకల్
ఓల్డ్ సిటీ అనగానే ఇరుకు గల్లీలే గుర్తొస్తాయి. గల్లీలు ఇరుకైనా అక్కడి మనుషుల మనసులు విశాలం. రద్దీని చూసి రంది పడకుండా.. కొంచెం ఇష్టంగా ముందుకు నడిచి చూడండి. ఎక్కడి నుంచో సైగల్ గొంతు చెవుల్లో తేనెలు కురిపిస్తుంది. ఓ ఇంట్లోంచి ‘రిమ్‌జిమ్ గిరె సావన్’ అంటూ కిషోర్‌దా స్వరం తొలకరిలా కురుస్తుంది. గల్లీ నుంచి కొంచెం పక్కకు తిరిగితే.. ‘నువు పెద్దపులి నెక్కినావమ్మో.. గండిపేట గండి మైసమ్మ’ అంటూ.. ఓ భక్తిగీతం పరవశులను చేస్తుంది. ఇంకొంచెం ముందుకెళ్తే.. ‘ఆదాబ్..!’ అంటూ హైదరాబాదీ ఉర్దూలో ఓ గొంతు ఆత్మీయంగా పలకరిస్తుంది. ఇది పాతబస్తీలో అడుగు పెడితే సొంతమయ్యే అనుభూతి. ఈ భిన్నత్వమే అక్కడ దాదాపు 100కు పైగా కేబుల్ చానల్స్ విజయవంతంగా నడిచేందుకు దోహదపడుతోంది!
దక్షిణ మూసీ ప్రాంతమైన పాతబస్తీలో 120 వరకు కేబుల్ ఆపరేటర్లున్నారు. ఒకప్పుడు కేబుల్ ఆపరేటర్లుగా ఉన్నవాళ్లు కాస్తా ఇప్పుడు టీవీ చానళ్ల ఓనర్లయ్యారు. ఆశ్చర్యపోకండి. కేబుల్ టీవీ చానళ్ల ఓనర్లు. ఇందులో కొన్ని టీవీలు ఉర్దూ, తెలుగు భాషల్లో న్యూస్ బులెటిన్‌లను అందిస్తుండగా.. మరికొన్ని సినిమాలు, సినిమా పాటలతో నిరంతరం ప్రజలకు వినోదాన్నిస్తున్నాయి. ఎలాంటి నియమ నిబంధనలు, ఒత్తిళ్లు లేకుండా స్వేచ్ఛగా తమ ప్రసారాలను అందిస్తున్నాయి.
రెండు దశాబ్దాల కిందటే...
మీరాలంమండి రోడ్డులోని జహరానగర్‌లో ఆర్‌ఎంఎస్ చానల్ ఇరవయ్యేళ్ల క్రితం మొదటిసారిగా కేబుల్ టీవీ ప్రసారాలను ప్రారంభించింది. అనంతరం ఓల్డ్‌సిటీ కేబుల్ నెట్‌వర్క్ (ఓసీఎన్) పేరుతో మరో కేబుల్ టీవీ చానల్ ప్రసారాలు ప్రారంభించింది. తరువాతి కాలంలో చాలా చానళ్లు ప్రారంభమయ్యాయి.
వందకు పైగా చానళ్లు..
4-టీవీ, రుబీ టీవీ, రియల్ రుబీ, ఆప్‌తక్, సీసీఎన్, ఫిజా, ఎంక్యూ టీవీ, ఎన్‌ఎన్‌ఎస్ చానల్, మాస్ టీవీ, టీవీ-21, హైదరాబాద్ చానల్, శాలిమార్ చానల్, కృషి టీవీ, వీఆర్ టీవీ, మై టీవీ, ఎస్‌ఎం టీవీ, ఎఫ్‌ఎం టీవీ, నిషా టీవీ, నిషా ప్లస్ టీవీ, నిషా ఇస్లామిక్, వీ టీవీ, ఆర్‌ఎంఎస్ కేబుల్ టీవీ, మొఘల్ టీవీ, ఎంకే చానల్, జీ టీవీ, ఎస్ టీవీ, ఏషియన్ టీవీలతో పాటు మరికొన్ని స్థానిక కేబుల్ టీవీ చానళ్లు ఓల్డ్ సిటీలో ఉన్నాయి.ఇవి వందకుపైగా ఉంటాయని అంచనా. ఇందులో 4-టీవీ, రుబీ టీవీ, రియల్ రుబీ, ఉర్దూ టీవీలు రోజూ ఉర్దూలో వార్తలు ప్రసారం చేస్తున్నాయి.
సత్వర స్పందన
పాతబస్తీలో ఏ చిన్న సంఘటన జరిగినా ఈ ఉర్దూ కేబుల్ టీవీ చానళ్లు వెంటనే స్పందిస్తున్నాయి. ఒక్కోసారి సంఘటనా స్థలంలో చిత్రీకరించిన సంఘటనలన్నింటినీ ఎడిట్ చేయకుండా యథావిధిగా ప్రసారం చేస్తున్నాయి. దీనివల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నాయి.
పండుగలకు రేటింగ్...
కొత్త సినిమాలతో పాటు అక్కడ జరిగే పండుగలు, ఉత్సవాలను ప్రత్యక్ష ప్రసారాలు చేస్తున్నాయి ఈ చానల్స్. హిందువుల ఏరియాల్లోని కేబుల్ టీవీ చానళ్లు బోనాలు, అయ్యప్ప స్వామి పూజలు, వినాయక చవితి ఉత్సవాలు, దసరా, దీపావళి వేడుకలను ప్రత్యక్షంగా అందిస్తుండగా.. ముస్లిం ఏరియాల్లోని కేబుల్ టీవీ చానళ్లు ఉర్సు ఉత్సవాలు, రంజాన్, మిలాద్-ఉన్-నబీ తదితర మతపరమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయి. పండుగలు, ఉత్సవాలప్పుడు లోకల్ చానల్స్ రేటింగ్ హైస్పీడ్‌లో పెరిగిపోతుందనడంలో అతిశయోక్తి లేదు.
ఆదాయ వనరులు
ఎమ్‌ఎస్‌ఓలతో సంబంధం లేదు కాబట్టి ఆదాయం నెలవారీ ప్రకటనలే. ప్రతి రోజు స్క్రోలింగ్‌లతో పాటు విజువల్ యాడ్‌లను ప్రసారం చేస్తున్నాయి. స్థానికులు కచ్చితంగా చూసే ఈకేబుల్ టీవీల్లో యాడ్ ఇస్తే తమ కొనుగోళ్లు పెరుగుతాయని వ్యాపారుల నమ్మకం. 24 గంటల పాటు స్క్రోలింగ్ రన్ చేసే ప్రకటనకు నెలకు రూ. 400 నుంచి 600 వరకు, గంటకోసారి ప్రసారం చేసే విజువల్ యాడ్స్‌కు నెలకు 1,500 నుంచి 2,000 వరకు లభిస్తుంది. ఇక భక్తి కార్యక్రమాలు, స్కూల్ యాడ్స్, వ్యాపార ప్రకటనల ప్యాకేజీలను కొనసాగిస్తున్నారు. అంతేనా.. లోకల్‌గా జరిగిన పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్స్‌కి కూడా ఈ చానల్స్‌లో మంచి గిరాకీ.
వ్యయం
శాటిలైట్ టీవీ చానల్ ప్రారంభించడానికి ఖర్చు 20 కోట్ల నుంచి మొదలవుతుంది. కానీ ఈ కేబుల్ చానల్ నిర్వహణకు లక్ష నుంచి లక్షన్నర వరకు ఖర్చవుతుంది. ఒక సిస్టం, ఒక కెమెరా, కెమెరామెన్ చాలు.. చానల్ రన్ చేసేయొచ్చు. చిన్న కేబుల్ టీవీ చానళ్లు కేవలం ఇద్దరు సిబ్బందితో నడుస్తున్నాయి. టీవీ చానల్ గదితో పాటు ఇద్దరి జీతభత్యాలు, నెలసరి ఖర్చు మాత్రమే ఉంటుంది. ఈ ఇద్దరిలో ఒకరు నిర్వాహకులే ఉంటుండటంతో ఒక వేతనం కూడా తగ్గుతోంది. ఇక ఎలాంటి ఎడిటింగ్, మిక్సింగ్ కార్యక్రమాలు లేకపోవడంతో నెలవారీ ఖర్చులు కూడా తక్కువగానే ఉన్నాయి.
ఆకట్టుకునే కార్యక్రమాలు
ఖబర్‌నామా..
ఫోర్త్ టీవీ చానల్‌లో ప్రతిరోజూ ప్రసారమయ్యే ఫోర్త్ టీవీ ఖబర్‌నామా ఉర్దూ న్యూస్‌కి వ్యూయర్స్ ఎక్కువ. రాత్రి 7.30 గంటలకు, 10 గంటలకు, అర్ధరాత్రి ఒంటి గంటకు, తెల్లవారుజామున 4 గంటలకు, ఉదయం 8 గంటలకు, 11.30 గంటలకు ప్రసారమయ్యే ఈ బులెటిన్లలో వార్తలన్నీ పాతబస్తీకే సంబంధించినవి కావడంతో స్థానికులు వాటిని మిస్ కావడంలేదు .
దక్కనీ న్యూస్
హైదరాబాద్ పాతబస్తీ ఉర్దూ యాసలో ప్రసారమయ్యే ద క్కనీ న్యూస్ ఇక్కడి జనాల మోస్ట్ ఫేవరెట్ బులెటిన్. పరాయి భాషలో కాకుండా పక్కింటివాళ్లు విషయం చెప్పినట్టు ‘ఆదాబ్...’! అంటూ వార్తలను చేరవేయడం ఈ న్యూస్ ప్రత్యేకత.
ప్రభుత్వ సహకారం కావాలి
స్థానిక ప్రేక్షకులకు వినోదంతో పాటు ఉత్సవాల ప్రత్యక్ష ప్రసారాలు, వార్తలను అందజేస్తున్న కేబుల్ టీవీ చానళ్లను ప్రభుత్వం గుర్తించి తగిన విధంగా ప్రోత్సాహకాలు అందించాలి. స్థానిక ఉత్సవాల సమయంలో సమాచార పౌర, సంబంధాల శాఖ ప్రభుత్వ ప్రకటనలను జారీ చేస్తే బాగుంటుంది.
- మీర్ మెహదీ అలీ బాక్రీ
సెన్సేషనల్ న్యూస్ సిండికేట్ (ఎస్‌ఎన్‌ఎస్)
- పిల్లి రాంచందర్