సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మధ్య వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. సుదీర్ఘకాలంగా ఇరు కుటుంబాల మధ్య రాజకీయ ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. ఈ పరిణామాల క్రమంలో మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మంత్రి సోమిరెడ్డిని తీవ్రంగా విమర్శించటం. రైతులకు టీడీపీ దూరం అవుతుందంటూ నర్మగర్భంగా వ్యాఖ్యలు చేసి మళ్లీ తీవ్ర చర్చకు తెరతీశారు. అధికార పార్టీ జిల్లా రాజకీయాల్లో ప్రాధాన్యం ఇవ్వకపోవటం, చివరకు ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా మంత్రి సోమిరెడ్డి మితిమీరిన జోక్యం నేపథ్యంలోనే తీవ్ర స్థాయిలో మండిపడినట్లు తెలుస్తోంది. పనిలో పనిగా మరో మంత్రి పి.నారాయణను ఇరకాటంలో పడేశారు. ‘ఇక్కడ జరిగిందంతా చంద్రబాబునాయుడుకు మీరే చెప్పండి’ అంటూ ఆనం హితవు పలికారు. పర్యవసానంగా ఆనం భవిష్యత్తు అడగులు ఎటువైపు ఉంటాయి. పార్టీలోనే ఉండి పోరు కొనసాగిస్తారా లేక కీలక రాజకీయ నిర్ణయం తీసుకుంటారా అనేది ప్రస్తుతం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది.
అడుగడుగునా అవమానాలే..
ఆనం రామనారాయణరెడ్డికి అధికార పార్టీలో అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయి. కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరిన ఆనం సోదరులకు పార్టీలో నాటి నుంచి నామామత్రపు ప్రాధాన్యం కూడా దక్కలేదు. ఆత్మకూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ఆనం రాంనారయణరెడ్డిని నియమించిన క్రమంలో అక్కడ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కన్నబాబును మంత్రి సోమిరెడ్డి, కొందరు పార్టీ జిల్లా నేతలు కీలకంగా ప్రోత్సహిస్తూ వచ్చారు. ఈ క్రమంలో అక్కడ విభేదాలు రోజురోజుకీ ముదిరి పాకాన పడి ఒకే కార్యక్రమాన్ని రెండు వర్గాలు నిర్వహించే పరిస్థితికి వచ్చింది. గతంలో ఆనం రామనారాయణ రెడ్డి జిల్లా నుంచి ఏకైక మంత్రిగా పని చేసి జిల్లాలో చక్రం తిప్పారు. ముఖ్యంగా దివంగత వైఎస్సార్ హయాంలో ఆనం కుటుంబం జిల్లా రాజకీయాలను కొంత కాలం నడిపిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల తర్వాత 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఆనం రామనారాయణరెడ్డి ఆత్మకూరు నుంచి పోటీ చేసి డిపాజిట్ కోల్పోయారు.
ఈ క్రమంలో తదనంతరం అధికార పార్టీలోకి ఆనం రామ నారాయణరెడ్డి, ఆయన సోదరుడు దివంగత నాయకుడు వివేకానందరెడ్డి చేరారు. ఈ వ్యవహారంలో మంత్రి నారాయణ క్రియాశీలకంగా పనిచేశారు. అయితే పార్టీలోకి వచ్చే సమయంలో ఇచ్చిన హమీలు ఒక్కటి కూడా అమలు చేయలేదనే అసంతృప్తి ఆనం వర్గీయుల్లో బలంగా ఉంది. దీని కొనసాగింపుగా పార్టీ సమావేశాలకు ఆనంను ఆహ్వానించకపోవటం. జిల్లా నేతలు ప్రాధాన్యం ఇవ్వకపోవటంతో గతంలో పలుమార్లు తన అసంతృప్తిని వెళ్ళకక్కారు. అయితే ఆనం వివేకా మరణంతో కొద్దిరోజులుగా రాజకీయాలకు ఆనం దూ రంగా ఉన్నారు.
ఈ క్రమంలో పార్టీ మారతారనే ప్రచారం కూడా సాగింది. కొద్ది రోజుల విరామం తర్వాత పార్టీ ఇన్‌చార్జిగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరులో మినీ మహానాడు నిర్వహించారు. అక్కడ కనీసం ఫ్లెక్సీలో ఆనం ఫొటో లేకపోవటంతో పాటు కన్నాబాబు ఫొటో ఉండటం. నియోజకవర్గ పరిణామాలు అన్నింటినీ చూసుకుని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను చార్జింగ్ లేని ఇన్‌చార్జినని 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇన్ని అవమానాలు పడలేదని వ్యాఖ్యానించారు. పనిలో పనిగా మంత్రి సోమి రెడ్డి జిల్లా రైతులను పట్టించుకోలేదంటూ విమర్శలు గుప్పించారు.
రైతులను జైలులో వేసినా పట్టించుకోరు.. సోమశిల హైలెవల్ మొదటి దశ పనులు 30 శాతం కూడా పూర్తి కాకముందే రెండో దశకు టెండర్లు పిలిచి కమీ షన్లు ఎవరు తీసుకుంటున్నట్లు అని ప్రశ్నించారు. మనకు మనమే పాలన బాగుందని నివేదికలు తెప్పించుకుంటే ఉపయోగం ఉండదని వాస్తవ పరిస్థితులు చూసుకోవాలని హితవుపలికారు. పనిలో పనిగా చంద్రబాబుకు సన్నిహితుడైన మంత్రి నారాయణ ఇదంతా సీఎం దృష్టికి తీసుకెళ్లాలని కోరటం విశేషం.
ఆనంతో ఆదాల భేటీ
ఈ పరిణమాల క్రమంలో శనివారం నెల్లూరులో ఆనం రామనారాయణరెడ్డిని మాజీ మంత్రి ఆదా ల ప్రభాకర్‌రెడ్డి కలిశారు. నెల్లూరు పార్లమెంట్ నేత హోదాలో ఆదాల ప్రభాకర్‌రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. మంత్రి సోమిరెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి మధ్య కూడా రాజకీయ వై రం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఇద్దరూ భేటీ కావటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment