సాక్షి ప్రతినిధి,ఒంగోలు: చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ మధ్య విబేధాలు పతాకస్థాయికి చేరినట్టు కనిపిస్తోంది. ఎమ్మెల్యే దామచర్ల చీరాల టీడీపీ నేతలు పాలేటి రామారావు, ఎమ్మెల్సీ పోతుల సునీతలకు మద్దతు పలుకుతూ ఆమంచికి సెగ పెడుతున్నారని, దీంతో జనార్దన్‌పై ఆమంచి అక్కసుతో రగిలిపోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే మంగళవారం మంత్రి లోకేష్ చీరాల పర్యటన సందర్భంగా వేసిన ప్రకటనలు, ప్లెక్సీల్లో ఆమంచి టీడీపీ జిల్లా అధ్యక్షుడి ఫొటో వేయలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం లోకేష్ పర్యటన కార్యక్రమంలో వీరిద్దరి తీరు చూసిన అధికార పార్టీ నేతల నుంచి సైతం వీరిద్దరి మధ్య అంతర్యుద్ధం నిజమేననే సమాధానం వస్తోంది.
రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖామంత్రి నారా లోకేష్ మంగళవారం చీరాలలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ పర్యటనకు సంబంధించి ఎమ్మెల్యే ఆమంచి ఇచ్చిన పత్రికా ప్రకటనల్లో టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ ఫొటో లేదు. పైపెచ్చు చీరాలలో వేసిన ఫ్లెక్సీల్లోనూ దామచర్ల ఫొటోలు ఒకటి, రెంటిల్లో మినహా 95 శాతం వాటిలో లేవు. టీడీపీ బీసీ నేత నూకసాని బాలాజీ ఫొటోలు వేసిన ఆమంచి జనార్దన్‌ను మాత్రం విస్మరించడం చర్చనీయాంశమైంది.
వాస్తవానికి విబేధాలు ఎన్ని ఉన్నా మంత్రి పర్యటనలో పార్టీ జిల్లా అధ్యక్షుడి ఫొటో వేయడం ఆనవాయితీ. కానీ జనార్దన్‌పై అక్కసుతో ఉన్న ఆమంచి నిర్మొహమాటంగా ఆయన ఫొటో వేయలేదు. అధికార పార్టీ నేతల్లో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఆమంచి చర్యతో దామచర్ల వ్యతిరేక వర్గం సంబర పడగా.. అనుకూల వర్గంలో ఆగ్రహం వ్యక్తమౌతోంది. జనార్దన్ మాత్రం యథావిధి చీరాలలో మంత్రి లోకేష్ పర్యటనకు హాజరయ్యారు.
దామచర్ల తీరుపై ఆమంచి ఫిర్యాదు..
ఆమంచి, దామచర్ల మధ్య చాలా కాలంగా విబేధాలున్నట్లు ప్రచారం ఉంది. ఆది నుంచి దామచర్ల చీరాల టీడీపీ నేతలు మాజీ మంత్రి పాలేటి రామారావు, పోతుల సునీతలను ప్రోత్సహించేవారు. ఆమంచి అధికార పార్టీలో చేరిన తరువాత కూడా దామచర్ల అటు పాలేటిని ఇటు పోతుల సునీతను ప్రోత్సహిస్తూనే ఉన్నారని, జనార్దన్ మద్దతుతోనే వారు తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనేది ఆమంచి ఆరోపణ. ప్రతి సమావేశానికి పోతుల సునీత, పాలేటిలను పిలిచి వేదికలపై మాట్లడించడాన్ని ఆమంచి జీర్ణించుకోలేక పోతున్నట్లు తెలుస్తోంది. జనార్దన్ వ్యవహార శైలిపై ఆమంచి పలుమార్లు సీఎంతో పాటు ఇటు లోకేష్, బాపట్ల పార్లమెంట్ ఇన్‌ఛార్జ్, మంత్రి పరిటాల సునీతకు సైతం ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఒక దశలో పార్టీకి దూరమౌతానని కూడా ఆమంచి హెచ్చరించినట్లు సమాచారం. పరస్పర ఫిర్యాదులతో ఇద్దరి మధ్య విబేధాలు పెరిగినట్లు సమాచారం.
జిల్లా మహానాడులోనూ ఇదే తీరు..
ఇటీవల ఒంగోలులో జరిగిన జిల్లా మహానాడులోనూ జనార్దన్ ఆమంచిని సరిగా రిసీవ్ చేసుకోలేదు. వేదిక మీద ఉన్న పెద్దలు ఆమంచితో పాటు సభకు వచ్చిన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావును మాత్రమే వేదిక మీదకు పిలిచి ఆమంచిని పట్టించుకోలేదు. ఆ తరువాత వేదిక మీదకు వచ్చిన ఆమంచికి మొదటి వరుసలో సీటు కూడా ఇవ్వక పోవడంతో ఆయన వెనుక సీట్లో కూర్చోవాల్సి వచ్చింది. దీన్ని భరించలేని ఆమంచి ఆ కొద్దిసేపు ముళ్లమీద కూర్చున్నట్లైంది. ఆ తరువాత కొందరు విషయం జనార్దన్ దృష్టికి తీసుకెల్లగా ఆతరువాత ఆయనవచ్చి ఆమంచిని మొదటి వనుసలో కూర్చోబెట్టారు. ఆ తరువాత కొద్దిసేపటికే ఆయన సభ నుంచి వెళ్లిపోయారు. మొత్తంగా అటు ఆమంచి ఇటు దామచర్ల గొడవలు అధికార పార్టీలో పతాక స్థాయికి చేరాయి. పర్యవసానంగా సాక్షాత్తూ మంత్రి లోకేష్ పర్యటనలో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న జనార్దన్‌కు ప్రాధాన్యత ఇవ్వక పోవడం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment