సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నాయి! కానీ అధికారంలోనున్న టీడీపీలో అంతర్గత పోరు మాత్రం తారస్థాయికి చేరింది! మంత్రుల నుంచి మండల స్థాయి నాయకుల వరకూ ఆధిపత్య పోరు నడుస్తోంది! ఇది చాలదన్నట్లుగా ప్రలోభాలతో ప్రతిపక్ష పార్టీ నుంచి లాక్కొన్న నాయకుల వైఖరితో పార్టీ క్యాడర్ అగ్గిమీద గుగ్గిలంలా మండిపడుతోంది! జిల్లాలో ఏ నియోజకవర్గం చూసినా ఇప్పుడు ఇదే సిత్రం సాక్షాత్కరిస్తోంది!
సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: జిల్లాలో తొలి నుంచి కింజరాపు, కిమిడి కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి దూకుడుకు కిమిడి కళావెంకటరావు మంత్రి పదవి దక్కించుకున్న తొలినాళ్లలో కాస్త అడ్డుకట్ట పడింది. కానీ గత ఆర్నెళ్లుగా మళ్లీ మొదలైంది. తమకు కావాల్సిన ఉద్యోగులను కోరిన స్థానంలో నియమించుకునేందుకు, అవతలి వర్గం వారిని తప్పించేందుకు ఇరువురు మంత్రులు ఎత్తులకు పైఎత్తులు వేసుకోవడం పరిపాటిగా మారింది. మరోవైపు జిల్లాపై పట్టుకోసం నియోజకవర్గాల్లో గ్రూపులను ఎగదోస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇక పలాస నియోజకవర్గంతో పాటు ఇచ్ఛాపురం రాజకీయాల్లోనూ సీనియర్ నాయకుడు గౌతు శివాజీ కుటుంబం జోక్యంతో వర్గపోరు కటౌట్‌లు చించిపడేసే స్థాయికి వెళ్లింది. మరోవైపు కూన రవికుమార్, గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తిలకు కూడా తమ ఇలాకాల్లో వర్గపోరు సెగ తగులుతోంది.
ఎచ్చెర్ల నియోజకవర్గంలో....
జడ్పీ ఛైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి, మంత్రి కళావెంకటరావు వర్గాల మధ్య విభేదాలు ముదిరిపోయాయి. ఇటీవల ఎచ్చెర్ల మండలంలో ముద్దాడపేట ఇసుక క్వారీని మంత్రి రద్దు చేయించారని ఛైర్‌పర్సన్ వర్గం బహిరంగంగానే విమర్శలకు దిగారు. ధనలక్ష్మి, బాబ్జీ దంపతులకు మంత్రి అచ్చెన్న అండదండలు ఉండటంతో కళాతో ఢీ అంటే ఢీ అంటున్నారు. గత ఎన్నికలలో రణస్థలం మండలంలో అండగా నిలిచిన ఎన్.ఈశ్వర రావుతోనూ కళా వర్గానికి పడట్లేదు. జి.సిగడాం మండలంలోనూ కళాపై కొంతమంది సీనియర్ నాయకులు అసంతృప్తిగా ఉన్నారు. మంత్రి సమీప బంధువు ఒకరు నీరు–చెట్టు సహా పలు అభివృద్ధి పనులు దక్కించుకోవడం జీర్ణించుకోలేకపోతున్నారు. లావేరు మండలంలో కొత్తగా పార్టీలో చేరిన నాయకులకు మంత్రి ప్రాధాన్యత ఇవ్వడం కూడా చిచ్చు రాజేస్తోంది.
పాలకొండ నియోజకవర్గంలో..
గత ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి నిమ్మక జయకృష్ణ ఓడిపోవడంతో పాలకొండపై పట్టు కోసం ఇద్దరు మంత్రులు పావులు కదుపుతూ వస్తున్నారు. ఇది కాస్త వివాదాలకు దారితీస్తుండటంతో గ్రూపుల్లో ఒకరిపై ఒకరు కేసులు, ఘర్షణలకు సైతం తమ్ముళ్లు తెగబడుతున్నారు. దీన్ని సరిదిద్దుకోవాల్సిన నియోజకవర్గ ఇన్‌చార్జ్ జయకృష్ణ తీరు కూడా దీనికి ఆజ్యం పోస్తుందనే విమర్శలు వస్తున్నాయి. జెడ్పీటీసీ సామంతుల దామోదరరావు, ఎంపీపీ ప్రతినిధి వారాడ సుమంత్‌నాయుడు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వీరఘట్టంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు ఖండాపు జ్యోతి, ఆమె భర్త వెంకటరమణ మంత్రి కళా వర్గం కాగా కడకెల్లకు చెందిన యామక అప్పలనాయుడు మంత్రి అచ్చెన వర్గంలో ఉన్నారు. సీతంపేట, భామిని మండలాల్లోనూ వర్గపోరు నడుస్తోంది.
రాజాంలో మూడు వర్గాల పోరు..
రాజాం నియోజకవర్గంలో కిమిడి కళావెంకటరావు, మాజీ ఎమ్మెల్సీ కావలి ప్రతిభాభారతి వర్గాలతోపాటు ఇప్పుడు మంత్రి అచ్చెన్నాయుడు వర్గం కూడా తయారవ్వడంతో ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య పోరు తీవ్రస్థాయిలో ఉంది. రాజాం నగర పంచాయతీ, సంతకవిటి మండలంలో కొత్తగా పార్టీలోకి వచ్చినవారినే అందలం ఎక్కిస్తున్నారని, ఇన్నాళ్లూ జెండా మోసిన తమకు అన్యాయం చేస్తున్నారని టీడీపీ నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. రాజాం ఏఎంసీ చైర్మన్ పదవి విషయంలో ఇది రుజువైంది. వంగర మండలంలో ఎంపీపీ యలకల అమ్మడమ్మ, ఏఎంసీ చైర్మన్ పైల వెంకటరమణ, జెడ్పీటీసీ బొత్స వాసుదేవరావునాయుడు, టీడీపీ అధ్యక్షుడు బెజ్జిపురం త్రినాధనాయుడుల మధ్య వర్గవిబేధాలు ఉన్నాయి. రేగిడి మండలంలో షాడో ఎంపీపీగా చలామణి అవుతున్న కిమిడి వినయ్‌కుమార్‌పై ప్రతిభాభారతి వర్గం గుర్రుగా ఉంది.
పాతపట్నంలో పరిస్థితి దారుణం..
ఫిరాయింపు ఎమ్మెల్యే కలమట వెంకటరమణ వర్గానికి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజు వర్గాల మధ్య వర్గపోరు తారస్థాయికి చేరింది. రకరకాల ప్రలోభాలతో వైఎస్సార్‌సీపీ నాయకులను టీడీపీలోకి తీసుకెళ్లిన కలమట... ఇప్పుడు రెండు వర్గాలను సమన్వయం చేయలేకపోతున్నారు. దీంతో ఫిరాయించిన నాయకులతోనే తన బలం పెంచుకునే పనిలో ఉన్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు శత్రుచర్ల వర్గం అదునుకోసం చూస్తోంది.
మరోవైపు కింజరాపు వర్గంలో ఉన్న యాళ్ల నాగేశ్వరరావు కూడా మార్కెట్ కమిటీ పదవి రాకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు. ఈ గ్రూపులోనే ఉన్న హిరమండలం వైఎస్ ఎంపీపీ నక్క వెంకటరావు కూడా కలమటకు ముఖం చాటేశారు. మెళియాపుట్టి మండలంలో సలాన మోహనరావు రాకతో పార్టీ మండల అధ్యక్షుడు అనపాన రాజశేఖర్‌రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. పాతపట్నం మండలంలో శత్రుచర్లకు అనుకూలంగా మామిడి గోవిందరావు కూడా పనులు చేస్తుండటంతో కలమట గుర్రుగా ఉన్నారు. కొత్తూరు మండలంలో అగతముడి బైరాగినాయుడు, లోతుగడ్డ తులసీవరప్రసాదరావు వర్గాల మధ్య పోరు నడుస్తోంది.
నరసన్నపేట నియోజకవర్గంలో..
నరసన్నపేట మండలంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి వ్యవహార శైలి నచ్చని దిగువ స్థాయి నాయకులు కొందరు బాహాటకంగానే విమర్శిస్తున్నారు. నరసన్నపేట జెడ్‌పీటీసీ శకుంతల, ఆమె భర్త పాపారావులు ఎమ్మెల్యేకి దూరంగా ఉంటున్నారు. పోలాకి మండలం జెడ్‌పీటీసీ గొండు రామన్నకు, ఎంపీపీ ప్రతినిధి తమ్మినేని భూపనరావు మధ్య మనస్పర్దలు కొనసాగుతున్నాయి. సారవకోట, జలుమూరు మండలాల్లోనూ ఇదే తరహా వాతావరణం ఉంది.
ఆమదాలవలస నియోజకవర్గంలో వర్గపోరు..
ఆమదాలవలస మండలం కలివరం సర్పంచ్ కోట వెంకట రామారావు టీడీపీలో ఉన్నా విప్ రవికుమార్ వేరొక వర్గానికి చెందిన గురుగుబెల్లి గిరికి ప్రాధాన్యత ఇవ్వడంతో రామారావు, ఆయన సోదరుడు రాష్ట్ర కనీస వేతనాల అమలు కమిటీ డైరెక్టర్ కోట గోవిందరావులు అసంతప్తిలో ఉంటున్నారు. సరుబుజ్జిలి మండలంలో జన్మభూమి కమిటీ సభ్యులు శివ్వాల సూర్యనారాయణ, జిల్లా టిడిపి ప్రచార కార్యదర్శి నందివాడ గోవిందరావుల మధ్య అంతర్గత విభేదాలు చోటు చేసుకొంటున్నాయి. పొందూరు మండలంలో కూన రవికుమార్‌కు అన్నయ్య, పీఏసీయస్ అధ్యక్షుడు కూన వెంకట సత్యన్నారాయణకు మండల టీడీపీ నాయకులకు అంతర్గత కుమ్ములాట ఉంది.
శ్రీకాకుళం నియోజకవర్గంలోనూ అసమ్మతి...
శ్రీకాకుళం నగరంలో తొలినుంచి మంత్రి అచ్చెన్న వర్గం, ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి వర్గం వేర్వేరుగా పనిచేస్తూ వస్తున్నాయి. ఇటీవల ముగ్గురు తెలుగుదేశం నాయకుల ఇళ్లను అధికారులు కూల్చివేయడంతో మంత్రివర్గానికి బలం చేకూరింది. పలువురు ఎమ్మెల్యే వర్గంలోనివారు మంత్రి, ఎంపీ వైపు వెళ్లిపోయారు. ఇది ఎమ్మెల్యే వర్గానికి మింగుడుపడడం లేదు. శ్రీకాకుళం రూరల్, గార మండలాల్లోనూ ఎమ్మెల్యే అనుచరుల వైఖరిపై టీడీపీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి.
వేడెక్కుతున్న ఉద్దానం..
పలాస ఎమ్మెల్యే గౌతు శివాజీ, ఆయన కుమార్తె టీడీపీ జిల్లా అధ్యక్షురాలు శిరీష కుటుంబం వైఖరి ఇప్పుడు పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో చిచ్చు రేపుతోంది. పలాస–కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ కోతపూర్ణచంద్రరావును వివిద కేసులలో బుక్ చేయించి పార్టీ నుంచి గెంటివేశారనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఇచ్చాపురంలో టీడీపీలో తమ్ముళ్ల మధ్య వర్గపోరు తారస్థాయికి చేరింది. ఎమ్మెల్యే బెందాళం అశోక్ రాజకీయాలకు కొత్తకావటం, మొదటిసారి శాసనసభ్యునిగా ఎన్నిక కావడంతో ప్రతీ విషయానికి జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపి రామ్మోహన్‌నాయుడు కుటుంబం అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. అయితే శివాజీ సొంత మండలం సోంపేట కావటంతో అశోక్‌ను అక్కడ దూరం పెడుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ నుంచి నర్తు నరేంద్ర యాదవ్‌ను పార్టీలోకి చేర్చుకోవడంపై అశోక్ వర్గం పెద్ద రచ్చ చేసింది. మరోవైపు మంత్రి కళా వెంకటరావు ఇచ్చాపురం నియోజకవర్గంలో కొందరు నేతలకు మద్దతు ఇవ్వటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment