lokesh tour
-
టీడీపీలో వసూల్ రాజాలు
నిడదవోలు రూరల్: ప్రభుత్వం కొత్త పథకాలు ప్రవేశపెడితే చాలు జన్మభూమి కమిటీ సభ్యుల జేబులు నిండుతున్నాయి. నిరుపేదలు, అర్హులను ఆయా పథకాలకు ఎంపిక చేయాలంటే అధికార పార్టీ నేతలు ఒక రేటు నిర్ణయించి దోచుకుతింటున్నారు. జిల్లాలో జన్మభూమి కమిటీ సభ్యుల అరాచకాలు రోజురోజుకీ ఎక్కువైపోతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయాలంటే జన్మభూమి కమిటీ సభ్యుల ఆమోదం తప్పనిసరి కావడంతో టీడీపీలో వసూల్ రాజాలు దందా కొనసాగిస్తున్నారు. స్థానిక జన్మభూమి కమిటీ సభ్యుల చుట్టూ తిరిగితే తప్ప తమకు ఏ పని జరగడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. నిడదవోలు నియోజకవర్గంలో ఈనెల 17న మంత్రి నారా లోకేష్ పర్యటన ఉండటంతో పాటు ఆదివారం ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పుట్టినరోజు కావడంతో నిడదవోలు మండలంలోని పలు గ్రామాల్లో టీడీపీ నేతలతో పాటు, జన్మభూమి కమిటీ సభ్యులు ఇటీవల పలు కార్పొరేషన్ రుణాలు, పలు పథకాలకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు, రాయితీ రుణాలు తీసుకున్న వారి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారీగా వసూళ్లు.. నిడదవోలు నియోజకవర్గంలో సుమారు రూ.800 కోట్లతో అభివృద్ధి చేశామని అధికారపార్టీ నేతలు గొప్పలు చెప్పుకుంటూనే గ్రామస్థాయిలో ఆయా పథకాలకు డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో అభివృద్ధి పథకాల మాటున అవినీతి దందా సాగుతోంది. గోదావరి తీరంలో ఉన్న పందలపర్రు, కానూరు– పెండ్యాల, మరికొన్ని అక్రమ ఇసుక ర్యాంపుల వద్ద అనధికారికంగా ఇసుకను విక్రయించడంతో పాటు యంత్రాలతో ఇసుక లోడింగ్ చేయించి అక్రమార్కులు రూ.కోట్లు కొల్లగొట్టారు. దీంతో ర్యాంపు నిర్వాహకులు అధికారపార్టీ నేతలకు రోజువారీగా మామూళ్లు అందజేసేవారు. ఇటీవల నిడదవోలు మండలంలో స్వయం ఉపాధి సోపాన రుణాలకు దరఖాస్తు చేసిన లబ్ధిదారులకు రుణాలు మంజూరులో ఎస్సీల నుంచి రూ.5 వేలు, కాపుల నుంచి రూ.3 వేల వరకు జన్మభూమి కమిటీ సభ్యులు వసూళ్లకు పాల్పడ్డారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారి నుంచి కూడా అడ్వాన్స్ రూపంలో కొంత మొత్తంలో నగదును లబ్ధిదారులు జన్మభూమి కమిటీ సభ్యులకు ముట్టజెప్పారు. 2009 నుంచి ఎమ్మెల్యేగా ఉన్న శేషారావు పుట్టిన రోజును ఈ ఏడాది ఘనంగా నిర్వహించడంతో పాటు మంత్రి లోకేష్ మండలంలోని కంసాలిపాలెం–శింగవరం రోడ్డు, తాడిమళ్ల డ్వాక్రా భవనం, కమ్యూనిటీ భవనాలను ప్రారంభిస్తారని దీంతో ప్లెక్సీలతో పాటు ఇతర ఖర్చులు ఉంటాయని చెబుతూ టీడీపీ నేతలు వసూళ్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వర్షంలో అధికారులకు తప్పని ఇబ్బందులు నిడదవోలు ఎమ్మెల్యే శేషారావు పుట్టిన రోజు ఆదివారం కావడంతో ఆయనకు శుభాకాంక్షలు చెప్పేందుకు మండల, గ్రామస్థాయి అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకవైపు ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షం, మరోవైపు సెలవు రోజు కావడంతో తప్పని పరిస్థితిలో ఎమ్మెల్యే స్వగ్రామం వేలివెన్ను వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవేళ వెళ్లకపోతే టీడీపీ నేతల ఆగ్రహానికి బలికావాల్సి వస్తుందనే భయంతో వర్షంలోనే వెళ్లామని అధికారులు వాపోతున్నారు. జూన్ 24న రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ పుట్టినరోజు కూడా పందలపర్రులో నిర్వహించడంతో ఆదివారం అయినా తప్పలేదని, వారానికి ఒక్కసారి వచ్చే సెలవు కూడా టీడీపీ నేతల చుట్టూ తిరగడానికి సరిపోతోందని వార ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు వసూళ్ల రాజాలపై దృష్టిపెట్టి అర్హులకు పథకాలు అందేలా కృషిచేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. -
ఆమంచి వర్సెస్ దామచర్ల
సాక్షి ప్రతినిధి,ఒంగోలు: చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ మధ్య విబేధాలు పతాకస్థాయికి చేరినట్టు కనిపిస్తోంది. ఎమ్మెల్యే దామచర్ల చీరాల టీడీపీ నేతలు పాలేటి రామారావు, ఎమ్మెల్సీ పోతుల సునీతలకు మద్దతు పలుకుతూ ఆమంచికి సెగ పెడుతున్నారని, దీంతో జనార్దన్‌పై ఆమంచి అక్కసుతో రగిలిపోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే మంగళవారం మంత్రి లోకేష్ చీరాల పర్యటన సందర్భంగా వేసిన ప్రకటనలు, ప్లెక్సీల్లో ఆమంచి టీడీపీ జిల్లా అధ్యక్షుడి ఫొటో వేయలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం లోకేష్ పర్యటన కార్యక్రమంలో వీరిద్దరి తీరు చూసిన అధికార పార్టీ నేతల నుంచి సైతం వీరిద్దరి మధ్య అంతర్యుద్ధం నిజమేననే సమాధానం వస్తోంది. రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖామంత్రి నారా లోకేష్ మంగళవారం చీరాలలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ పర్యటనకు సంబంధించి ఎమ్మెల్యే ఆమంచి ఇచ్చిన పత్రికా ప్రకటనల్లో టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ ఫొటో లేదు. పైపెచ్చు చీరాలలో వేసిన ఫ్లెక్సీల్లోనూ దామచర్ల ఫొటోలు ఒకటి, రెంటిల్లో మినహా 95 శాతం వాటిలో లేవు. టీడీపీ బీసీ నేత నూకసాని బాలాజీ ఫొటోలు వేసిన ఆమంచి జనార్దన్‌ను మాత్రం విస్మరించడం చర్చనీయాంశమైంది. వాస్తవానికి విబేధాలు ఎన్ని ఉన్నా మంత్రి పర్యటనలో పార్టీ జిల్లా అధ్యక్షుడి ఫొటో వేయడం ఆనవాయితీ. కానీ జనార్దన్‌పై అక్కసుతో ఉన్న ఆమంచి నిర్మొహమాటంగా ఆయన ఫొటో వేయలేదు. అధికార పార్టీ నేతల్లో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఆమంచి చర్యతో దామచర్ల వ్యతిరేక వర్గం సంబర పడగా.. అనుకూల వర్గంలో ఆగ్రహం వ్యక్తమౌతోంది. జనార్దన్ మాత్రం యథావిధి చీరాలలో మంత్రి లోకేష్ పర్యటనకు హాజరయ్యారు. దామచర్ల తీరుపై ఆమంచి ఫిర్యాదు.. ఆమంచి, దామచర్ల మధ్య చాలా కాలంగా విబేధాలున్నట్లు ప్రచారం ఉంది. ఆది నుంచి దామచర్ల చీరాల టీడీపీ నేతలు మాజీ మంత్రి పాలేటి రామారావు, పోతుల సునీతలను ప్రోత్సహించేవారు. ఆమంచి అధికార పార్టీలో చేరిన తరువాత కూడా దామచర్ల అటు పాలేటిని ఇటు పోతుల సునీతను ప్రోత్సహిస్తూనే ఉన్నారని, జనార్దన్ మద్దతుతోనే వారు తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనేది ఆమంచి ఆరోపణ. ప్రతి సమావేశానికి పోతుల సునీత, పాలేటిలను పిలిచి వేదికలపై మాట్లడించడాన్ని ఆమంచి జీర్ణించుకోలేక పోతున్నట్లు తెలుస్తోంది. జనార్దన్ వ్యవహార శైలిపై ఆమంచి పలుమార్లు సీఎంతో పాటు ఇటు లోకేష్, బాపట్ల పార్లమెంట్ ఇన్ఛార్జ్, మంత్రి పరిటాల సునీతకు సైతం ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఒక దశలో పార్టీకి దూరమౌతానని కూడా ఆమంచి హెచ్చరించినట్లు సమాచారం. పరస్పర ఫిర్యాదులతో ఇద్దరి మధ్య విబేధాలు పెరిగినట్లు సమాచారం. జిల్లా మహానాడులోనూ ఇదే తీరు.. ఇటీవల ఒంగోలులో జరిగిన జిల్లా మహానాడులోనూ జనార్దన్ ఆమంచిని సరిగా రిసీవ్ చేసుకోలేదు. వేదిక మీద ఉన్న పెద్దలు ఆమంచితో పాటు సభకు వచ్చిన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావును మాత్రమే వేదిక మీదకు పిలిచి ఆమంచిని పట్టించుకోలేదు. ఆ తరువాత వేదిక మీదకు వచ్చిన ఆమంచికి మొదటి వరుసలో సీటు కూడా ఇవ్వక పోవడంతో ఆయన వెనుక సీట్లో కూర్చోవాల్సి వచ్చింది. దీన్ని భరించలేని ఆమంచి ఆ కొద్దిసేపు ముళ్లమీద కూర్చున్నట్లైంది. ఆ తరువాత కొందరు విషయం జనార్దన్ దృష్టికి తీసుకెల్లగా ఆతరువాత ఆయనవచ్చి ఆమంచిని మొదటి వనుసలో కూర్చోబెట్టారు. ఆ తరువాత కొద్దిసేపటికే ఆయన సభ నుంచి వెళ్లిపోయారు. మొత్తంగా అటు ఆమంచి ఇటు దామచర్ల గొడవలు అధికార పార్టీలో పతాక స్థాయికి చేరాయి. పర్యవసానంగా సాక్షాత్తూ మంత్రి లోకేష్ పర్యటనలో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న జనార్దన్‌కు ప్రాధాన్యత ఇవ్వక పోవడం చర్చనీయాంశంగా మారింది. -
లోకేష్ టూర్ కోసం టెన్త్ ఫలితాల విడుదల వాయిదా
విజయవాడ: మంత్రి లోకేష్ విశాఖపట్నం పర్యటన కోసం ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదల సమయాన్ని మార్చారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను విడుదల చేయాలని తొలుత నిర్ణయించగా, మంత్రి గంటా శ్రీనివాసరావు మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. విజయవాడలో ఫలితాలను విడుదల చేయాల్సివుండగా, లోకేష్ టూర్లో పాల్గొనేందుకోసం మంత్రి గంటా వేదికను విశాఖకు మార్చారు. విశాఖలో లోకేష్ పర్యటన ముగిసిన తర్వాత టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్నారు. మంత్రి గంటా తీరుపై విద్యాశాఖ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. లక్షలాదిమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మంత్రి లోకేష్ పర్యటన కోసం టెన్త్ ఫలితాల విడుదల సమయాన్ని మార్చడంపై విమర్శలు వస్తున్నాయి.