యజమాని లేడా.. రేషన్‌కార్డు రద్దే!
ఆధార్ ఇచ్చినా విడుదల కాని బియ్యం
ఆందోళనలో లబ్ధిదారులు
మండలంలో తగ్గిన 800 క్వింటాళ్ల కోటా
కుటుంబ యజమాని చనిపోతే.. ఇక ఆ ఇంటి రేషన్‌కార్డు రద్దు అయింది. కుటుంబసభ్యులున్నా రేషన్ బియ్యం సరఫరా నిలిచిపోయింది. ఈనెల విడుదలైన రేషన్ బియ్యంలో ఈ విషయం వెల్లడైంది. మండల వ్యాప్తంగా సుమారు 800ల క్వింటాళ్ల బియ్యం తగ్గాయి. దీంతో ఇటూ డీలర్లు అటు లబ్ధిదారులు ఆం దోళనకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళ్లితే.. తెల్లరేషన్ కార్డులున్నవారు కుటుంబ సభ్యులతోపాటు కార్డుల్లో నమోదైన వారి ఆధార్‌కార్డులను సేకరించారు. ఆధార్ కార్డులు ఇవ్వని వారి కార్డులు రద్దు చేస్తామని అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. దీంతో సదరు డీలర్లు తమ కోటా తగ్గుతుందని భావించి లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి ఆధార్‌కార్డులను సేకరించారు. వాటిని గడువులోగా రెవెన్యూ కార్యాలయంలో అందజేశారు.
వ్యక్తి మరణిస్తే ఇక అంతే..
ఇదిలా ఉండగా పదేళ్ల క్రితం కుటుంబ యజమానిపై తెల్లరేషన్‌కార్డు జారీ అయింది. అయితే ఆ వ్యక్తి మృతి చెందడంతో అతడి ఆధార్‌కార్డు సమర్పించలేదు. దీంతో కంప్యూటర్‌లో ఇంటి యజమాని పేరుపై ఉన్న ఆధార్‌కార్డు నంబర్‌లేక అది స్వీకరించలేదని అధికారులు అంటున్నారు. కార్డుకు సంబంధించిన డేటా రాక బియ్యం విడుదల కాలేదని అధికారులు చెబుతున్నారు. మండల వ్యాప్తంగా సుమారు నాలుగు వందల అంత్యోదయ కార్డులున్నా వాటి పరిస్థితి కూడా ఇదే విధంగా నెలకొంది. ఆధార్‌కార్డులు ఇచ్చినా కార్డు ఎందుకు రద్దు చేశారని లబ్ధిదారులు ఆందోళన చెందారు. ఇటీవల లబ్ధిదారులు రేషన్‌డీలర్లను నిలదీశారు. అయితే అధికారులు ఇచ్చిన జాబితా మేరకు తాము పంపిణీ చేస్తున్నట్లు డీలర్లు పేర్కొన్నారు. రెండు రోజులుగా లబ్ధిదారులను అధికారులను ప్ర శ్నించేందుకు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేస్తుండగా.. ఆఫీసర్లు మాత్రం సర్వేలో నిమగ్నమై ఉండటంతో ఏం చేయాలో తోచడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు.
డీలర్లకు కోత..
మండల వ్యాప్తంగా 46 రేషన్‌షాపులున్నాయి. వీటిలో ఒక్కొక్క డీలర్‌కు 15 క్వింటాళ్ల నుంచి 20 క్వింటాళ్ల వరకు బియ్యం కోత పడిందని డీలర్ల సంఘం జిల్లా కార్యదర్శి చిలగాని మోహన్ తెలిపారు. అలాగే చక్కెర కూడా మూడు క్వింటాళ్ల వరకు తగ్గిందన్నారు.