జనవరి నుంచి రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ
మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి
వేర్వేరుగా స్మార్ట్ రేషన్‌కార్డులు, స్మార్ట్ హెల్త్ కార్డుల జారీ
బియ్యం అవసరం లేనివారికి స్మార్ట్ హెల్త్ కార్డులు
లబ్ధిదారుల ఆదాయ పరిమితి, అర్హతలపై నిబంధనల పునః సమీక్ష
21న జరిగే మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో తుది నిర్ణయం
19వ తేదీలోగా ప్రజాప్రతినిధులంతా తమ అభిప్రాయాలను పంపాలని విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త రేషన్‌కార్డుల కోసం అక్టోబర్ నుంచి దరఖాస్తులు స్వీకరించి, వేగంగా జారీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రేషన్‌కార్డులను విభజించి స్మార్ట్ రేషన్ కార్డులు, స్మార్ట్ హెల్త్ కార్డులను వేర్వేరుగా జారీ చేస్తామన్నారు. రేషన్ బియ్యం అవసరం లేకున్నా ఆరోగ్యశ్రీ వంటి ప్రయోజనాల కోసం తెల్లరేషన్ కార్డులున్న వారి కోసం ప్రత్యేకంగా స్మార్ట్ హెల్త్ కార్డులను జారీ చేస్తామని వెల్లడించారు. కొత్త రేషన్‌కార్డులు, హెల్త్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సోమవారం హైదరాబాద్‌లోని జలసౌధలో నాలుగోసారి సమావేశమై చర్చించింది. ప్రభుత్వానికి కొన్ని మధ్యంతర సిఫార్సులు చేసింది. అనంతరం మంత్రులు ఉత్తమ్, పొంగులేటి మీడియాతో మాట్లాడారు.
అర్హతలపై పునః సమీక్ష చేస్తున్నాం..
తెల్ల రేషన్‌కార్డు లబ్ధిదారుల అర్హతలను పునఃసమీక్షిస్తున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ నెల 21న ఇంకోసారి సమావేశమై కొత్త విధివిధానాలను ఖరారు చేస్తామని చెప్పారు. అర్హులైన అందరికీ రేషన్‌కార్డులు జారీ చేయాలని నిర్ణయించామన్నారు. తెలంగాణ ఏర్పాటైన నాటికి 91,68,231 రేషన్‌కార్డులు, 3,38,07,794 మంది లబ్ధిదారులు ఉంటే.. గత ప్రభుత్వం పాత రేషన్‌కార్డులన్నీ రద్దు చేసి కొత్తగా దరఖాస్తులు స్వీకరించిందని చెప్పారు.
అప్పట్లో 89,21,907 కొత్త రేషన్‌కార్డులను జారీ చేయగా.. 2,70,36,250 మంది లబ్ధిదారులు ఉన్నారని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 89.6 లక్షల కార్డులు, 2.81 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం లబ్ధిదారుల వార్షికాదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షల్లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షల్లోపు ఉండాలని.. 3.5 ఎకరాలు/ఆ లోపు తడి, 7.5 ఎకరాలు/ఆ లోపు మెట్ట భూములు ఉండాలని చెప్పారు.
ఏపీ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్‌లలో అమలు చేస్తున్న ఆదాయ పరిమితులను పరిశీలించామని.. రాష్ట్రంలో లబ్ధిదారుల ఆదాయ పరిమితిని పెంచాలా? తగ్గించాలా? ప్రస్తుత నిబంధనలనే కొనసాగించాలా? అన్న అంశాలపై తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కొత్త రేషన్‌కార్డుల జారీ విషయంలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలు కోరుతూ లేఖలు రాయగా.. ఇప్పటివరకు 16 మంది నుంచి స్పందన వచ్చిందన్నారు. మిగతావారు ఈ నెల 19లోగా అభిప్రాయాలను పంపితే.. పరిశీలిస్తామని చెప్పారు.
జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీ..
తెల్ల రేషన్‌కార్డు దారులకు సన్న బియ్యం పంపిణీని జనవరి నుంచి ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. నిరుపేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పులకు ఈ పథకం దోహదపడుతుందని చెప్పారు. దొడ్డు బియ్యం బ్లాక్ మార్కెటింగ్, రిసైక్లింగ్‌కు దారితీస్తోందని.. సన్న బియ్యంతో ఈ సమస్య ఉండదని వివరించారు. వానాకాలంలో పండించిన సన్నరకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ అందిస్తామని తెలిపారు.
ఉప ఎన్నికలుంటేనే రేషన్ కార్డులిచ్చారు: పొంగులేటి
గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి కొత్త రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఆసరా పెన్షన్లు ఇచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. 2016–2024 మధ్య కాలంలో 6,47,479 కొత్తకార్డులు జారీ చేయగా.. 5,98,000 కార్డులను తొలగించిందని చెప్పారు. అంటే ఇచ్చినది 49,476 కార్డులేనని పేర్కొన్నారు. తాము పారదర్శకత కోసం ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను సేకరిస్తున్నామని, వారు విలువైన సలహాలిస్తే భేషజాలకు పోకుండా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు.
మంత్రివర్గ ఉపసంఘం మధ్యంతర సిఫారసులివీ..
– క్యూఆర్ కోడ్/ మైక్రో చిప్/ బార్ కోడ్‌తో కూడిన స్మార్ట్ కార్డులను జారీ చేయాలి.
– ప్రస్తుత అర్హతలను కొనసాగించాలి.
– ‘పరిమితికి లోబడి భూమి ఉండడం ఒక్కటే అర్హత కాదు. భూమి ద్వారా వచ్చే ఆదాయం సైతం ఆదాయ పరిమితికి లోబడి ఉండాలి’అనే నిబంధనను తొలగించాలి. గందరగోళానికి గురిచేసే ఈ నిబంధన అనవసరం.
– సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సక్సేనా కమిటీ సిఫారసులను పరిశీలించాలి.
Comments
Please login to add a commentAdd a comment