అంకాపూర్ లో కేసీఆర్ కు నాగలి బహూకరిస్తున్న రైతు మార గంగారెడ్డి
సాక్షి, నిజామాబాద్ ప్రతినిధి: రాష్ట్రాన్ని కొత్త పంథాలో అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్దామని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి వరకు అధికారులు, ప్రజాప్రతినిధులతో కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ‘తెల్లరేషన్ కార్డుల దుర్వినియోగాన్ని అరికడితే 3, 4 కొత్త పథకాలను ప్రవేశపెట్టవచ్చు. బోధన రుసుం కింద రూ. 4 వేల కోట్లు దుర్వినియోగమవుతున్నాయి. కచ్చితమైన గణాంకాలు లేకపోవడంతోనే ఈ అవకతవకలు జరుగుతున్నాయి. అందుకే సర్వే నిర్వహిస్తున్నాం’ అని సీఎం పేర్కొన్నారు.
‘ఏం చేసినా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళదాం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అక్రమాలపై సీఐడీ విచారణ బాధాకరమైనప్పటికీ తప్పదు. రాష్ట్రంలో 84 లక్షల కుటుంబాలు ఉంటే.. 91 లక్షల రేషన్‌కార్డులు ఉండడం సిగ్గుచేటు. తెల్లరేషన్ కార్డులు ఓ వ్యాధిలాగా అక్రమంగా పెరిగిపోయాయి. మొత్తంగా 20 నుంచి 23 లక్షల వరకు రేషన్‌కార్డులు అధికంగా ఉన్నాయి’ అని వివరించారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 5.93 లక్షల కుటుంబాలుంటే 6.16 లక్షల తెల్లరేషన్ కార్డులు ఉండటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వాటిని నెరవేరుద్దామన్నారు.
‘తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులతో స్నేహ పూర్వకంగా ఉంటుంది. నేను సీఎం అయినప్పటికీ నాకు కొమ్ములేమీ ఉండవు. కలెక్టర్లు కూడా నవ్వుతూ పనిచేయాలి. కడుపునిండా తినాలి... చేతినిండా పనిచేయాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు కలసి ముందుకెళ్లాలి. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యేలను అధికారులు మర్యాదపూర్వకంగా ప్రొటోకాల్ ప్రకారం కార్యక్రమాలకు ఆహ్వానించాలి. నూతన రాష్ట్రంలో నూతన పంథాలో పోదాం. విమర్శలు, ప్రతివిమర్శలు లేకుండా ప్రజాప్రతినిధులు పనిచేయాలి. పనిచేసే అధికారులకు గుర్తింపు ఉంటుంది. ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌ను ఆదర్శంగా తీసుకోవాలి. ఆమె కరీంనగర్ కలెక్టర్‌గా రోడ్లను విస్తరించి మంచిపేరు తెచ్చుకున్నారు. ‘అమ్మలాలన’ పేరిట ఆమె ప్రజలకు చేరువయ్యారు’ అని కేసీఆర్ సూచించారు.