రేషన్‌ కార్డుకు అవాంతరాలు | negligence White ration card issuers | Sakshi
Sakshi News home page

రేషన్‌ కార్డుకు అవాంతరాలు

Published Sun, May 20 2018 8:10 AM | Last Updated on Sat, Oct 20 2018 5:53 PM

negligence White ration card issuers  - Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం: తెల్ల రేషన్‌ కార్డు మంజూరుకు అర్హులైన లబ్ధిదారులకు అనేక అవాంతరాలు ఎదురవుతున్నా యి. అర్హత ఉన్నా ప్రజా సాధికారిత సర్వేలో తమ పేర్లు నమోదు చేసుకోకపోవడం, ఇప్పటికే కుటుంబ సభ్యుల కార్డుల్లో పేర్లు ఉండ డం కొత్త కార్డు మంజూరుకు అవరోధంగా మారాయి. కొత్త రేషన్‌ కార్డు పొందడానికి లబ్ధిదారులు చేయాల్సిన పనులపై యం త్రాంగం అవగాహన కల్పించకపోవడంతో ఏళ్ల తరబడి దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటున్నాయి.

గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్‌ వరకూ కొత్త రేషన్‌ కార్డుల దరఖాస్తులను ఆయా మండలాల తహసీల్దార్‌ కార్యాలయాలు, మీ సేవా కేంద్రాల్లో తీసుకున్నారు. జిల్లాలో 33 వేల దరఖాస్తులు వచ్చాయి. దరఖా స్తు ఎప్పడు ఇచ్చినా జనవరిలో నిర్వహించే జన్మభూమి సభల్లో కొత్తకార్డులు మంజూ రు చేస్తామని అధికారులు చెబుతూ వచ్చారు. సభల్లో 16,200 మందికి కార్డులు మంజూరు చేశారు. మిగిలిన వారికి ఎందుకు రాలేదోనన్న విషయంపై స్పష్టత కరువైంది. తమకు కార్డు ఎందుకు రాలేదో అన్న విషయం జన్మభూమి సభల్లో అడిగినా అధికారుల నుంచి సమాధానం కరువైంది. కొంతమంది తమకు కార్డు ఎందుకు రాలేదు? అంటూ తహసీల్దార్‌ కార్యాలయాలకు పరుగులు పెట్టారు. ఇప్పటికే కుటుంబ సభ్యుల కార్డులో మీరు సభ్యులుగా ఉన్నారంటూ కార్యాలయాల్లోని సిబ్బంది సమాధానం ఇచ్చారు. దరఖాస్తుదారుల్లో కొంతమంది వివరాలు ప్రజా సాధికారిత సర్వేలో నమోదు కాకపోవడం వల్ల  కార్డులు మంజూరు కాలేదు.

ఇప్పుడూ పాత కథే..
జూన్‌ రెండో తేదీన కొత్త రేషన్‌కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తహసీల్దార్‌ కార్యాలయాలకు వచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్‌ చేసేందుకు ఆదివారం నుంచి అనుమతిచ్చింది. ఆన్‌లైన్‌ ప్రక్రియను పూర్తి చేసేందుకు మంగళవారం వరకూ గడువు ఇచ్చింది. జిల్లాలోని తహసీల్దార్‌ కార్యాలయాల్లోని కంప్యూటర్‌ ఆపరేటర్లు ఆదివారం నుంచి రాత్రి వేళల్లో కూడా పని చేసి ప్రతి దరఖాస్తును ఆన్‌లైన్‌ చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఎప్పటిలాగే పాతకథే పునరావృతం అయింది. ప్రజా సాధికారిత సర్వేలో పేర్లు నమోదు చేసుకోకపోవడం వల్లే అత్యధిక దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఇప్పటికే తల్లిదండ్రుల కార్డుల్లో సభ్యులుగా ఉండడం వల్లనూ దరఖాస్తులు ఆన్‌లైన్‌ కాలేదు.

ఎమ్మెల్యే పంపారు.. ఎందుకు రాదు?
కొత్త కార్డు కోసం పలువురు లబ్ధిదారులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సిఫారసులతో తహసీల్దార్‌ కార్యాలయాలకు వస్తున్నారు. వారి దరఖాస్తులను ఆన్‌లైన్‌ చేసేందుకు కంప్యూటర్‌ ఆపరేటర్లు ప్రయత్నిస్తుండగా కారు, ఆదాయం ఎక్కువగా ఉండడం, ప్రజా సాధికారిత సర్వేలో లేకపోవడం, ఇప్పటికే కార్డులో సభ్యులుగా ఉండడంతో ఆన్‌లైన్‌ కావడంలేదు. అదే విషయాన్ని కంప్యూటర్‌ ఆపరేటర్లు వారికి చెబుతున్నా ‘ఎమ్మెల్యేగారు, ఎమ్మెల్సీగారు పంపారు? ఎందుకు కాదు?’ అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. వారికి వివరంగా, అర్థమయ్యేలా చెప్పేసరికి కంప్యూటర్‌ ఆపరేటర్ల తల ప్రాణం తోకకు వస్తోంది.

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో దరఖాస్తుల ఆన్‌లైన్‌ ప్రక్రియ పరిశీలిస్తే కొత్త కార్డులు ఎంత శాతం వస్తాయో అర్థం చేసుకోవచ్చు. 50 డివిజన్ల నుంచి 1,062 దరఖాస్తులు రాగా ఇందులో 600 దరఖాస్తులకు సంబంధించి ప్రజా సాధికారత సర్వేలో లబ్ధిదారుల వివరాలు నమోదు కాకపోవడం వల్ల ఆన్‌లైన్‌ కాలేదు. మరో 353 దరఖాస్తులు ఇప్పటికే కుటుంబ సభ్యుల కార్డుల్లో నమోదై ఉండడంతో వెబ్‌సైట్‌ తిరస్కరించింది. 9 దరఖాస్తులు ఇప్పటికే ఆన్‌లైన్‌ అవగా కొత్తగా 100 దరఖాస్తులు మాత్రమే ఆన్‌లైన్‌ అవడం గమనార్హం. దీనినిబట్టి నగరంలో దరఖాస్తు చేసుకున్న 1,062 మందికిగాను 109 మందికి మాత్రమే కొత్త రేషన్‌ కార్డులు వచ్చే అవకాశం ఉంది. ఈ దరఖాస్తులను కూడా అధికారులు ఆరు దశల్లో పరిశీలన చేసిన తర్వాత కార్డులు మంజూరు చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement